ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.
రెస్క్యూ టీం వారి శ్మశాన సౌకర్య కృషి - @2405*
సోమవారం - (11-4-22) సమయం వేకువ 4.30 – అక్కడెందుకో చీకటి – స్థలమేమో –"ఛ! అది శ్మశానన మేంటి? సకల విధ పుష్ప విలాస - హరిత సుందర - బహుళ సౌకర్య - సుమనోహర - వర్ణరంజితారామం...." అని చూసిన భావుకులంతా మెచ్చుకొనక తప్పని రుద్రభూమి! శ్మశాన పరమైన సెంటి మెంట్లు లేని – గ్రామస్తుల అంతిమ ప్రస్థానంలో మరికొన్ని వసతులు కల్పించే పట్టుదల గల నలుగురైదుగురు స్వచ్చ కార్యకర్తలు అప్పుడక్కడ ప్రత్యక్షం!
కరోనా కష్టకాలం నుండే సోమవారం కాస్తా గ్రామ రక్షక దళ వారంగా మారిపోయింది! కాస్త చురుకైన - తెలివైన గ్రామస్తులప్పుడే రెస్క్యూ టీం వాళ్లను తమ వీధి గుంటల పూడిక కోసం సంప్రదిస్తున్నారు కూడ! ఈ రోజు ఎందుకో రెస్క్యూటీం సభ్యులిద్దరో ముగ్గురో రాలేదు గాని - వాళ్ల స్థానాల్ని నలుగురు ట్రస్టు కార్మికులు నింపారు!
గంటన్నరకు పైగా నేటి శ్రమదానమేమంటే –
- ప్రధాన రుద్రభూమికి పడమరగా - పార్థివ దైహిక వీడుకోలు, ఇతర ట్రస్టు వాహనాల నిలుపుదల కోసం ఖాళీ స్థలం మెరుగుదల చర్యే!
- ఇందుకు గాను, తామెప్పుడో భవిష్యత్తు అవసరాల కోసం సేకరించి, భద్రపరచుకొన్న తారు పెచ్చుల నిధి నుండి కొంత బైటకు తీసి, ట్రక్కులోని కెక్కించి, పైన చెప్పిన చోటికి చేర్చడం –
- ఇక తొలుత తారు పెచ్చుల్తోను, తరువాత కొంత మట్టి సర్దుడుతోను, వర్షాల్లో నైనా వాహనాలు నిలుపుకొనే లాగ చదునుచేయడం –
యధా ప్రకారంగానే 6.30 కి ‘మనకోసం మనం’ ట్రస్టు పర్యవేక్షకుడు కస్తూరి శ్రీనివాసుడు ముమ్మారు గ్రామ భవిష్య సముజ్జ్వలా కాంక్షా నినాదాలు పలికి మిగిలిన పనిని రేపటికి వాయిదా వేశారు!
సమర్పిస్తున్నాం ప్రణామం – 104
మీ గ్రామం మెరుగుదలే మీకున్న ఒకే గమ్యం
ప్రజా స్వస్త - సౌఖ్యములే పరమాద్భుత ఆశయం
అందుకె మీ ఎనిమిదేళ్ల నిరంతరమగు పోరాటం
ఆశయ పూర్తికి శ్రమించు అందరికీ ప్రణామం!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
11.04.2022.