2406*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

శ్మశాన సౌకర్య సాధనలోనే 2406* వ నాడు కూడ!

            మంగళవారం (12-4-22) వేకువ సైతం గ్రామ భద్రతా దళానిది అదే దీక్ష అదే చోట - నిన్నటి పని పొడిగింపుగా! పాత కర్మల భవనం దగ్గర ఖాళీ చోటును సందర్శకుల, ట్రస్టు వారి వాహనాలను వానల్లో కూడ నిలుపుకో దగినంతగా బాగు చేయాలనే తమ సంకల్పాన్ని పూర్తి చేసుకొన్నారు.

            కాకపోతే - ఈ రోజు వాళ్లతో మరో ఇద్దరు చేరి బలం పెరిగింది. శంకర శాస్త్రి గారి పునరాగమనంతో మరికాస్త అండ దొరికింది. చివర్లో ఇద్దరు ట్రస్టు ఉద్యోగులు కూడ తలో చేయి వేస్తే ఆ సంఘీభావం మరింత బలపడింది! ఏమైతే నేం రెస్క్యూ దళం వాళ్లకి ఈ రెండు రోజుల ఫల ప్రద శ్రమదానంతో మానసిక సంతృప్తి దొరికింది!

            మరి ఇందుకే - ఇంత పెద్ద ఊరి స్వస్తతా సంక్షేమం కోసం - ప్రతి వేకువా 30-40-50 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఎనిమిదేళ్లుగా - వాననక, ఎండనక, మంచునీ చలినీ లెక్కచేయక తమ కాలాన్ని, చెమటను, అవసరమైనపుడు కష్టార్జితాన్ని సంతోషంగా ఊరి కోసం వెచ్చిస్తుంటారు! మురుగుకాల్వల్లో దిగుతారు, రహదార్ల వెంట వందల చెట్లనూ, వేల పూలమొక్కల్నీ పెంచుతారు! రోడ్ల గుంటలు పూడుస్తారు! చాలమంది ఈ రోజుల్లో పరమ దరిద్రమని అసహ్యించుకొనే పనుల్ని ఇష్టంగానే చేస్తుంటారు!

            రెస్క్యూ టీం అందుకు మినహాయింపు కాదు దుమ్ము - ధూళి - బరువు పనుల్లో వీళ్ళెప్పుడూ వెనకడుగేసిందీ లేదు!

            ఐతే ఏమయింది లెద్దురూ! పాతిక వేల మంది గ్రామస్తుల్లో అత్యధికులు వీళ్ళ శ్రమ త్యాగమెందుకో, దాని మూలతత్త్వమేదో పట్టించుకొన్నారా? పట్టించు కొన్న సోదర గ్రామస్తులు మాత్రం - ఏ కొద్ది మందో తప్ప - ఈ అద్భుత సామాజిక సంక్షేమ కృషిలో - రోజూ కాకున్నా - వారానికొకటి రెండు నాళ్లైనా చేతులు కలిపారా?... అంతమాత్రాన స్వచ్ఛ సైనికుల గ్రామ కాలుష్య పోరాటం ఆగలేదనుకోండి!

            6.10 కి నేటి ఏడుగురు శ్రమ వీరులూ చిల్లలవాగు, నిద్రాముద్రిత శ్మశాన స్థలీ, డంపింగ్ కేంద్రాల సాక్షిగా మాలెంపాటి అంజయ్య మార్గ దర్శకత్వంలో ముమ్మారు చల్లపల్లి స్వచ్ఛ - సుందర సంకల్ప నినాదాలు ప్రకటించారు!

            ఆదివారం నాటి కార్యకర్తల నిర్ణయానుసారం - రేపటి వేకువ మనం కలుసుకొని, శ్రమించ దగిన చోటు -  బైపాసు వీధిలోని భారతలక్ష్మి వడ్లమర కూడలి దగ్గరే!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం 105

ఏది కారణ మేది కార్యం? ఏ పనికి ఒక మంచి ఫలితం?

ఏది త్యాగం ఏది స్వార్ధం? సంఘజీవుల కేది భావ్యం?

దేశమైనా గ్రామమైనా తేజరిల్లుట కేది మార్గం?...”

అనే సమ్యక్ తత్త్వ చింతన అనుసరణకే నా ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   12.04.2022.