2409*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.

గ్రామ కాలుష్య నివారణోద్యమంలో 2409* వ నాడు.

            శుక్రవారం (15-4-22) వేకువ కూడ 18 మంది కార్యకర్తల తొందర మరీ 4.16 కే! మరో 13 మంది కూడ కొద్ది నిముషాల వ్యవధిలోనే చేరిక! ఈ 31 మందికి తోడు బందరు నుండి వచ్చిన వేరే సామాజిక కార్యకర్త! వీళ్ల తొలి పరస్పరాభివాదం నిన్నటి చోటే – 1 వ వార్డు దగ్గరి అపార్ట్ మెంట్ల వద్ద! ఇక అక్కడి నుండి 3 వీధుల్లో చేసిన కాయకష్టం - అందుకు ఊరికి దొరికిన ప్రతిఫలం వివరాలు:

1. అశోక్ నగర్ లోనిదే వడ్లమర గేటు ఎదుటి అడ్డ రోడ్డు - అది పిచ్చి కంపతో, తీగల్తో మూసుకుపోయి, ఎగుడుదిగుడుగా ఉంది సరే ఆ మూరెడు కాలి బాటలోనే ఆ మూడు రోడ్ల నివాసులు ఎలా నడుస్తారో ద్వి చక్ర వాహనాలెలా పరుగెత్తుతాయో ఆశ్చర్యం! ఐదారుగురు కార్యకర్తలు కత్తుల - దంతెల - చీపుళ్ల సమష్టి దాడితో 6.00 తరువాత ఆ బాట ఎంత శుభ్ర సుందరంగా - విశాలంగా ఉన్నదో!

2) గ్రామ సామాజిక సేవలో దివంగత వాసిరెడ్డి మాస్టారు ఏకమానుష సైన్యం (One-man army)! అతడు ఒంటి చేత్తో నిర్మించిన వడ్లమర వీధిని, ఉద్యానాన్ని ఈ 10 మంది స్వచ్చ కార్యకర్తలు గడ్డి లాగి, ఊడ్చి, సంస్కరించడం వా.కో. గారికి సముచిత నివాళి!

3) ఇంక సుందరీకరణ బృందం గురించి వేరే చెప్పేదేముంది! రేపటి ఫలానా రోడ్డు సుందరీకరణం అనుకుంటే చాలు - వాళ్లను ఈ రాత్రి నుండే తొలుస్తూ ఉంటుంది! ఈ రోజు వాళ్ల చూపుపడింది వడ్లమర ఉత్తరవీధి. వాట్సప్ మాధ్యమ చిత్రంలోనైనా ఇప్పుడా వీధి ఎంత ముచ్చట గొల్పుతున్నదో గమనించవచ్చు!

4) రెండు చేతుల్లో రెండు కత్తుల వారూ, రెండు చీపుళ్లతో ఒకే మారు రోడ్డు మార్జిన్లు ఉడ్చి బాగు చేసేవారూ, ప్లాస్టిక్ తుక్కులు, సీసాలు ఏరే కార్యకర్తలూ, ఎక్కడ స్వచ్ఛతలోపిస్తే అక్కడికి అనివార్యంగా నడిచే కొన్ని కాళ్లూ, పూల మొక్కల పాదుల్ని సరిదిద్దే శ్రమజీవులూ... అసలిదంతా 2022 వ సంవత్సరంలో మరెక్కడా ఎవ్వరూ కనని - వినని ఒక క్రొత్తలోకం! 2 గంటల నిస్వార్ధ సార్ధక శ్రమానందం! సర్వులకూ అనుసరణీయమైన ఒక క్రొత్త బాట!

            మురుగు కాల్వలో దిగి, శుభ్రపరిచే కఠిన శ్రమ గాని, చెత్త బండి మీద నిలబడి సర్దే మహిళల్ని గాని, కటిక నేల మీద కూర్చొని గడ్డి చెక్కుతున్న కార్యకర్తల్ని గాని - ఒకే ఊళ్ళో వేల రోజులుగా - నిరంతరాయంగా - నమ్మిన ఆశయం కోసం పాటుబడే ఈ స్త్రీ బాల వృద్దుల్ని గాని, ఈ చల్లపల్లిలో గాక - మరెక్కడైనా చూస్తే దయచేసి చెప్పగలరు!

నేటి దైనందిన శ్రమదాన సమీక్షా కాలంలో :

1. బందరు నుండి వచ్చిన ఒక యువ కార్యకర్త కార్తీక్ "మట్టిని సంరక్షించుకొందాం..అనే విన్నపం చేసి,

2. అసంపూర్ణంగా ఉన్న ద్వితీయ శ్మశాన సంస్కరణానికి దాతలు ముందుకొచ్చిన వార్తను దాసరి రామకృష్ణ ప్రసాదు గారు వెల్లడించి,

3. గంధం తర్షిత్ ముమ్మారు ఊరి స్వచ్చ పరిశుభ్ర సౌందర్య సాధనా సంకల్పాన్ని నినదించి, నేటి 2 గంటల శ్రమదాన సందడి ముగిసింది.

            రేపటి వేకువ కూడ స్వచ్చ సుందరీకరణం కోసం మనం మరొక మారు ఈ బైపాస్ మార్గంలోని వడ్లమర దగ్గరే కలుసుకోవలసి ఉన్నది!

      ఉద్యమాల పురిటిగడ్డ

గతంలోనే చల్లపల్లి ఉద్యమాల పోతుగడ్డ

స్వచ్చ సైనికులకిప్పుడు అది పెంపుడు బిడ్డ!

ప్రతి వీధీ శ్రమదాతల పాదస్పర్శ తోడ

వినూత్నమై పునీతమై వెలుగుతోంది చూడ!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   15.04.2022.