2411*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?

          మరొకమారు ATM కేంద్రంగా బందరు రహదారిలో - @2411*

          ఆదివారం – (17-4-22) మాత్రం గ్రామ ప్రముఖ వీధి శుభ్రత చేస్తేనే మంచిదనే నిన్నటి కార్యకర్తల నిర్ణయానుసారం - వేకువ 4.17 కే - వేంకటేశ్వరుని గుడి ఎదురుగా కాలభైరవ మిత్రునితో సహా - 15 మంది స్వచ్చ యజ్ఞం మొదలెట్టారు! మిగిలిన 14 మంది సైతం వీధి కాలుష్యాల మీద తిరగబడి సంత వీధి మొదలు మూడు రోడ్ల కూడలి దాక స్వచ్చోద్యమ విహారం చేశారు! ఈ తిరుగుబాటు 6.15 దాక కొనసాగింది! సంగీత సాహిత్య సరస వినోదాల ముగింపుకు మరో 15 - 20 నిముషాల సమయం!

          ఈ 200 గజాల నిడివి గల సువిశాల ప్రధాన వీధిలోనే గుడులు, అంగడులు, అడుగడుగునా తోపుడు బళ్ల ఆక్రమణలు, 5.30 కే మొదలయ్యే పూల - పళ్ల - చిరుతిళ్ల వ్యాపారాలు వాటన్నిటి నుండి పుట్టుకొచ్చే అనివార్య కశ్మలాలు - మరి స్వచ్చ కార్యకర్తలేమో ఏ రెండొందల మందో కాదు - అల్ప సంఖ్యాకులు!

          ఐనా - ఎప్పటిలాగే ఈ క్రొత్తరకం పోరులో స్వచ్ఛ సైనికులే విజేతలు! చీపుళ్లతో దుమ్ము - ఇసుక ఊడ్చే వాళ్ళు ఊడ్చి, కొబ్బరి డిప్పల్నీ, ఎంగిలాకుల్నీ ప్రోగులు చేసేవాళ్లు చేసి, వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టరులోకి మోసేవాళ్లు మోసి, ఒకరిద్దరు మహిళలైతే నిలిపి ఉన్న కార్ల క్రింది రోతల్ని ఒంగి ఊడ్చి..... నిజంగా ఈ శ్రమదానం - అదీ వేసవి ఉక్కతో, బట్టలు చెమటతో తడిసి - దుమ్మంటుకొని, ఐనా ఎవరూ తమ ప్రయత్నం మానని....ఈ శ్రమ జీవన సన్నివేశం నా వరకు నాకు మాత్రం నయనానందకరం!

          అసలు సిసలు కష్టమంతా ATM కేంద్రం దగ్గరిదే! ఆ రంగు రంగుల పేవర్ రాళ్ల ఆవరణను ఒకటికి రెండు మార్లు ఊడ్చి, ఎందుకో పగిలిన కుండీల్ని సరిజేసిన సంగతి అలా ఉంచితే - ఎప్పుడు వీళ్ల శుభ్ర - సుందరీకరణ పూర్తవుతుందా అని కనిపెట్టి కాసుక్కూర్చున్నారే గాని - అక్కడి చిరు వ్యాపారులు ఏ ఒక్కరూ ఈ కార్యకర్తలకు సహకరించలేదు!

          ఈ ఆదివారం నాటి వీధి కాలుష్యాల వేట కేవలం బందరు రోడ్డుకే పరిమితం కాలేదు! కొందరు కార్యకర్తలు పనిలో పనిగా దక్షిణంగా ఉన్న పోలీసు కార్యాలయ వీధిలో కొంత వరకు వేటాడారు; మరికొందరు నిన్నటి ఉప్పలవారి సూరి డాక్టరు వీధిలో ఇసుక వ్యర్థాల సంగతి చక్కబెట్టి వచ్చారు!

          6.45 కు ATM సెంటర్లో జరిగిన నేటి శ్రమదాన సమీక్షకు ముందు తాతినేని (మొక్కల) రమణ ఎలుగెత్తిన ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధనా ప్రతిజ్ఞల్ని అందరూ పునరుశ్చరించారు; ‘మనకోసం మనంట్రస్టు మార్చి నెల మిగులు బడ్జెట్టును తెలుసుకొని సంతోషించారు; తమ స్వచ్చ సుందరోద్యమాన్ని కీర్తించే పాటను నందేటి శ్రీనివాసు శ్రావ్యంగా పాడితే ఆలకించారు; 6.50 కి ఇంటి ముఖం పట్టారు!

          బుధవారం (19-4-22) నాటి వేకువ మన సుందరీకరణ కర్తవ్యం పాత కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి దగ్గరే కలిసి నిర్వహిద్దాం!

 

          చారిత్రక గాధలు

గతాను గతికం గానే కాలుష్యపు వీధులు;

తిష్ఠ వేసుకొని కదలని మురుగుకాల్వ గుంటలు;

ముక్కు పుటాలదర గొట్టు పూతి గంథ కంపులు -

కార్యకర్త శ్రమ ధాటికి గత చరిత్ర గాథలు!

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   17.04.2022.