2412*వ రోజు.......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?

2412* వ నాటి రెస్క్యూ టీం వారి శ్రమ సన్నివేశం.

          మొన్నటి, నిన్నటి గ్రామ మెరుగుదల స్థలాలు మారినట్లే - నేటి (సోమవారం - 18-4-22) శ్రమ ప్రమోదస్థలం కూడ మారింది! 4.256.00 నడుమ ఆరుగురు కార్యకర్తల బృందం నిర్వహించిన శ్మశానాంతర్గత సౌకర్య సంపాదనే ఈ వేకువ విశేషం!

          శవ దహన వాటిక ప్రక్కన వీడ్కోలు, తదితర వాహనాల నిలుపుదల కోసం - ముఖ్యంగా వానాకాలంలో - చక్రాలు మట్టిలో దిగకుండా - అదీ ఈ అద్భుత శ్మశానానికి తగ్గట్లుగా - చూడ ముచ్చటగా - ఒక ప్లాట్‌ఫాం తయారు చేసే గతవారపు ప్రయత్నానికి దొక పొడిగింపు!

          దాని కోసమే సంపద తయారీ కేంద్రం దగ్గర నుండి అప్పుడెప్పుడో నిల్వ చేసి దాచిన తారు పెచ్చుల్నీ, రాతి పెంకు ముక్కల్నీ ట్రక్కులో నింపు కోవడమూ, ఈ వాహన నిలుపుదల వేదిక దగ్గర దించి, చదును చేయడమూ, ఎగుడు దిగుళ్ల సర్దుబాటు కోసం బుసక, మట్టీ తెచ్చి సమతలం చేయడమూ ఇదే నేటి గ్రామ భద్రతా దళం పని!

          ఈ టీమ్ సభ్యులేమీ రోడ్ల పని నిపుణులు కారు - ఐనా రోడ్ల గుంటలు పూడుస్తారు; మురుగు స్పెషలిస్టులు కాదు - ఐనా మోకాల్లోతుకు దిగి, పూడిక తీసి, ముందుకు నడిపిస్తారు; సాంప్రదాయకులే, అంతకు ముందు సెంటిమెంట్లున్నవాళ్లే - ఐనా రాత్రి పూట శ్మశానంలో నిర్భయంగా పని చేస్తారు! కారణం బహుశా తమ తాత్త్విక బలం కావచ్చు! సమాజం నుండి తీసుకొన్న దాంట్లో బహుశా కొంతైనా తిరిగి, చెల్లించాలనే బాధ్యతా భావం వీళ్లకి శక్తినిస్తున్న ఇంధనమేమో!

          అందుకే ఈ స్వచ్ఛ సుందర కృషీవలురంటే నాకింత ఆరాధన! వీళ్ళ 2412* రోజుల శ్రమదానాన్ని ప్రతి వేకువా నేను కన్నార్పకుండ చూసేదీ, ఈ ఆదర్శాన్ని లోకానికి చేరువ చేస్తూ వర్ణించేదీ అందుకే!

          నేటి తమ శ్రమదాన బాధ్యతను ఈ కార్యకర్తలు తమ టీంలో క్రొత్తగా చేరిన వృద్ధ కార్యకర్త కోడూరు వేంకటేశ్వర మహోదయుని  స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో ముగించారు!

 

గ్రామ చరితను మార్చగలిగిన - రాజనాల్ పండించ జాలిన

కాలమున కెదురొడ్డి నిలిచిన - క్రమం తప్పక నిలిచి - గెలిచిన

దేశమున మార్మ్రోగి పోయిన దివ్య సందేశములు పంచిన

చల్లపల్లి స్వచ్చ -  సుందర సైనికులకిదె తొలి ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   18.04.2022.