2413*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?

2413* వ వేకువ కూడ అదే బరువు పని

            మంగళవారం సైతం అదే చోట ఆ ఆరుగురు  రెస్క్యూ టీం మనుషులే 4.26 నుండి 6.10 మద్య ఆ దహన వాటిక పడమటగా మళ్ళీ అదే బండ పని! (ఇవి నా మాటలే సుమా! ఊరి సౌకర్య మెరుగుదలే లక్ష్యంగా 8 ఏళ్లుగా శ్రమిస్తున్న కార్యకర్తలకు తమ గమ్యం వైపు ఒక్కో అడుగే తప్ప ఇవి సుకుమార సేవలా, కఠిన చర్యలా, పత్రికల్లో మన ఫొటోలు పడతాయా, గుర్తింపులొస్తాయా,...వంటి ఆలోచనలు మచ్చుకైనా రావు! - ఊరికోసం చేతి చమురొదిలించుకొనే - విలువైన తమ కాలాన్ని సమర్పించే - చెమటలు చిందించే వాళ్లకు ఏ పనులైనా ఒకటే!)

            తారు పెచ్చుల్నీ, ఇసుక - మట్టి చిల్లర రాళ్ల మిశ్రాన్నీ డిప్పల్తో ట్రక్కులో నింపడం గాని, దానిని దించి, పారల్తో చేతుల్తో సర్దడం గాని, అందు నిమిత్తం శ్మశానంలో రాత్రి వేళ వేసవి ఉక్కతో చెమటలు దిగగార్చడం గాని ఇవన్నీ మొండి బండ పనుల క్రిందే లెక్క! రోజుకు వెయ్యి రూపాయలిచ్చినా ఇలాంటి మురుగు కంపు పనులకిప్పుడెవరూ దొరకని కాలం!

            ఈ స్పచ్చ కార్యకర్తల పనిని ఆర్థిక ప్రమాణంతో కొలిచేకన్నా అసలు వాళ్ల ప్రణాళికేమిటి? దాని వెనకున్న ఉద్దేశ్యమేమిటి? గ్రామ పౌరుల్లో ఎందరిలో వీళ్ళు ఏ మాత్రం సామాజిక స్పృహను తేగలిగారు....వంటి అంచనాలు వేసుకోవడమే మంచిది. ఈ గ్రామస్తులు చాల విషయాల్లో చైతన్యవంతులై యుండి కూడ - ఇంత సుదీర్ఘ కాల శ్రమదానోద్యమం పట్ల ఇప్పటికీ చాలమంది అంటరానితనాన్నెందుకు పాటిస్తున్నారనే దానికి సమాధానం వెదకడం మరీ మంచిది!

            ఏమైతేనేం రెండు వారాల, నాల్లు పని దినాల రెస్క్యూటీం పంతం నెరవేరి, వాహనాలు నిలిపే చదును ప్రదేశం 95% సిద్ధమైపోయింది! వీళ్ళ పని ముగింపు వేళకు ముందే నలుగురైదుగురు పాదచారులు వాళ్ళూ స్వచ్చ కార్యకర్తలే - గ్రామ సుందరీకరణ బాధ్యులే - వచ్చి, సంఘీభావం ప్రకటించారు! కోడూరు వేంకటేశ్వరుని గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నినాదాలే మరొకమారు శ్మశానంలో ప్రతిధ్వనించాయి!

            రేపటి బుధవారపు వేకువ మన పునర్దర్శనం బైపాస్ రోడ్డులోని పాత కస్తూర్బా ఆసుపత్రి దగ్గరే!

 

ఈ మహోత్కృష్ట శ్రమదానం ఏకొందరి పరిమితమా!

తలచుకొంటే ముందుకొస్తే - అదేం పెద్ద అసాధ్యమా!

వెలుతురువలె - గాలి వలే వెలుగొందే నిస్వార్థత

అందరి కాచరణీయమె స్వచ్చోద్యమ విశిష్టత!

 

- నల్లూరి రామారావు,

   స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

   ‘మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

   19.04.2022.