2467* వ రోజు.......

 ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!

          18.06.2022 వ వేకువ 4.20 కి బందరు రహదారి పరిశుభ్రత కు కంకణం కట్టుకొని 6.05 దాక రకరకాలుగా శ్రమించినది 27 మంది. బాగుపడినవి- 6 వ నంబరు కాలువ గట్టున శ్రావ్య ఆస్పత్రి తూర్పున గల బుల్లి ఉద్యానమూ, రిజిస్ట్రారు కార్యాలయం నుండి పింగళి వారి ఆస్పత్రి దాక! ఇవి గాక నిన్నటి శుభ్ర- సుందరీకృత – SBI, జూనియర్ కళాశాల వంటి చోట్ల గూడ మళ్ళీ ఊడ్వవలసిన అవసరం పడింది!

 

          ఒక అంచనా ప్రకారం ఈ రోడ్డు మీదుగా ఎడ్ల బళ్ళు గాని, టిప్పర్లు, ట్రాక్టర్లు గాని ఏ రెండు వందలో ఇసుక రవాణా చేస్తాయి! వేగ నిరోధకాల వల్ల ఇసుక, ఇతర కారణాలతో దుమ్ము, చిరు వ్యాపార పారీణుల మూలంగా ఇంకొన్ని రకాల కశ్మలాలు ప్రోగు బడుతూనే ఉంటాయి!

 

          ఇక-మురుగు కాల్వల సంగతి చెప్పేదేముంది? డ్రైన్లున్నది మురుగు పారుదలకనే సంగతే మర్చిపోయి, ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులు, ప్లేటులు, కొబ్బరి బొండాల మిగుళ్లు, చెడిన కూరగాయలూ, పళ్ళూ, ఇంకా నానా రకాల కంగాళీలన్నీ చాలామంది అందులోకే విసిరి, చేతులు దులుపు కొంటున్నారు!

 

          మరీ ముఖ్యంగా ప్రధాన వీధుల మురుగు కాల్వల్ని స్వచ్చ కార్యకర్తలు ఏదాడికి 10 మార్లు చొప్పున- చెత్త లాగి, సిల్టు తోడి, ప్లాస్టిక్ దరిద్రాల్ని తొలగించి, శుభ్ర పరుస్తూనే ఉన్నారు! ఈ వేకువలో ఐతే- ఆస్పత్రుల వ్యర్ధాలు సైతం వాటిలో చేరాయంటే ఇక ఎవరికి మొర పెట్టుకోవాలి ? పైగా స్వచ్చ శ్రమ కారులు తప్ప- ఈ మురికి పనులకు ఎవరు ముందుకొస్తున్నారు గనుక! అసలు పని సంస్కృతే దేశంలో మృగ్యమై పోతున్నది గదా!

 

          అందువల్ల గ్రామ సోదరులారా! ఊరి స్వచ్చ-శుభ్రత ల పట్ల ఇప్పటికీ ఏ మాత్రం పట్టింపు లేని మిత్రులారా! తస్మాత్ జాగ్రత్త! రాష్ట్రంలోని దేశంలోని- వేల, లక్షల ఊళ్ల లాగే చల్లపల్లి కూడ ధూళి దూసరితమై పచ్చదనం కనిపించని, ఆహ్లాదం లోపించిన, ఆరోగ్యం క్షీణించిన, కళావిహీనమై, ఈసురోమని కనిపిస్తుంది- మనలో తగిన చైతన్యంలోపిస్తే !

 

          అప్పుడిక స్వచ్చ శ్రమ దాతల ఉద్యమ రథ చోదకుల ఉత్తమాశయాలే ఊరి శ్రేయస్సుకు దిక్కవుతాయి! సుమారు 150 గజాల సువిశాల బందరు రహదారిని చీపుళ్ళతో దుమ్ము ఊడ్చి,మార్జిన్ల మాలిన్యాలను తొలగించి, పైకి లేస్తున్న దుమ్ముతో చెమట కలిసి, ఒళ్ళూ- బట్టలూ పేస్టులుగా మారి-6.05 తరువాతనే స్వచ్చ కార్యకర్తలు నేటి తమ శ్రమదానోద్యమాన్ని విరమించారు. 

          కృషి సమీక్షా సమావేశ సమయంలో శ్రమదానోద్యమ ఆశయాలైన ఊరి స్వచ్చ - శుభ్ర- సౌందర్య సాధనా సంకల్పాన్ని ముమ్మారు నినదించినది నందేటి శ్రీనివాసు.

 

          వర్షం రాని షరతుతో రేపటి మన గ్రామ బాధ్యతా ప్రదేశం కూడ ఇదే బందరు రహదారికి చెందిన అమరావతి జమిందారుని భవన పరిసరాలే! (అది వస్తే-విజయవాడ బాటలోని విజయా కాన్వెంటు వద్ద కలుసుకొందాం)!                 

 

    సమర్పిస్తున్నాం ప్రణామం 146

 

మనసే ఒక మందిర మట- మంచికైన చెడుకైనా!

మంచేమో పది మందితొ మమేకమై ఉండునా!

వైయక్తిక సంక్షేమం సమష్టి లోనె భద్రమా!

అందుకె స్వచ్చోద్యమాని కర్పిస్తాం ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  18.06.2022.

SBI వద్ద
శుభ్రం చేసాక బందరు రోడ్డు