2479* వ రోజు..........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

2479*వ రోజుకు చేరిన చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం.

            ఇది గురువారం (7-7-22) నాటి సంగతి. స్వచ్ఛ కార్యకర్తలు 26 మంది; వారి శ్రమదానం నిడివి (4.20 to 6.05) 105 నిముషాలు; కనపడదు గాని, దాని లోతు బాగా ఎక్కువ; పరిశుభ్ర - సుందరీకృతంగా మారిన అస్తవ్యస్త - అనాకారి ప్రదేశం 6 వ నంబరు కాలువ - విజయవాడ రహదార్ల ప్రక్కన ఉండే బీడుపడి పోతున్న గ్రామ సచివాలయ పరిసరాలు.

            ఆ ఎగుడు దిగుడు చిందర వందర గందర గోళ ప్రదేశంలో దురద గొండి వంటి ముళ్ల తీగల, రాలి పడిన కొబ్బరి మట్టల, గుంటల, రాయి - రప్పల నాలుగైదు వందల గజాల ఖాళీ జాగాను సంస్కరించిన పద్ధతీ, పడిన శ్రమా, అందులో ఒక్కొక్కరి ప్రత్యేకతా సవివరంగా వ్రాయాలంటే ఒక్కొక్కరికి ఒక్కో పేజీ నిండుతుంది. అదేమంత సంభావ్యం కాదు గనుక సూక్ష్మంగా చెప్పాలంటే :

- దాని అదృష్టం కొద్దీ గాంధీ విగ్రహ ఉత్తరపు జాగా సుందరీకర్తల దృష్టిలో పడింది. పరుస వేదుల్లాంటి వాళ్ల పని చేతుల మహిమతో అది చాల వరకు బాగు పడింది.

- అసలు సచివాలయమే మూతబడింది, అందులోకి ఉన్న నడవా తుప్పల తోను, పిచ్చి చెట్లు, తీగలతోను మూసుకుపోయింది - వాటి తొలగింపుకు, బాట పునరుద్ధీకరణకు గంటకు పైగా పాటు బడిన చేతులు పది!

- కత్తులతో - దంతెలతో సచివాలయ పడమటి భాగాన శ్రమించిన వాళ్లు డజను మంది! అనుకోకుండా వాళ్ల మీదకి దాడి చేసినవి తేనెటీగలు! ఐనా సరే - తప్పించుకొని వాళ్లు తొలగించిన వ్యర్ధాల దరిద్రం ఒక బండెడు!

- ఈ పది - పన్నెండు మంది నరికిన, ఏరిన, పీకిన కొమ్మ రెమ్మల్నీ, ప్లాస్టిక్ ఛండాలాన్ని, కుళ్లిన కొబ్బరి బొండాల్ని, గట్టిగా దాన్ని అవలీలగా దూరంగా ఉన్న ట్రాక్టర్ లోకి మోసుకు పోతున్న ఒక రక్తదాన కర్ణుణ్ణి వాట్సప్ ఫోటోలో గుర్తించండి!

- పనిలో పనిగా ఇద్దరు ముగ్గురు ముసలి ఉడతల సహకారాన్ని

కూడ మెచ్చండి!

            ఔను మరి! ఇది అరుదైన చల్లపల్లి స్వచ్చ శుభ్ర - సుందర - శ్రమదానం! ఇది 2479* రోజులుగా మొండిగా ముందుకు సాగుతూనే ఉన్నది! ప్రచారం వద్దను కొన్నా దేశ వ్యాప్తంగా ప్రాకిపోతూనే ఉన్నది! దేశంలోని ఆరు లక్షల ఊళ్లలోనూ ఇప్పుడిలాంటి శ్రమదానోద్యమ చైతన్యం అవసరమనిపిస్తూనే ఉన్నది!

            6.20 తరువాత - ఒక విలక్షణుడైన 75 ఏళ్ల శాస్త్రీజీ సాధికారకంగా ముమ్మారు నినదించిన - తనది కాని గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరణ సంకల్పంతో నేటి శ్రమదాన బాధ్యతకు ముగింపు - ప్రాతూరి వారి కాశీ యాత్రా విశేష వివరణకు శ్రద్ధగా కార్యకర్తల ఆలకింపు!

    చల్లపల్లి దైనందిన స్వచ్చోద్యమంలో నేటి మరొక విశేషం : గత నెలలో ప్లాస్టిక్ సీసాలు, కప్పులు ఏరినవి విక్రయించగా వచ్చిన 620/- ఆదాయాన్ని ఇద్దరు కార్యకర్తలు మనకోసం మనంట్రస్టుకు జమ చేయడం!

            శుక్రవారం శుభోదయాన మన గ్రామ సామాజిక బాధ్యతలకై కార్యకర్తల పరస్పర పునర్దర్శన ప్రదేశం ఈ గాంధీ స్మృతి వనమే!

 

ఏనాటికైన త్యాగ దీప్తి వినుతి కెక్కకుంటుందా!

నిస్వార్థ శ్రమదానపు నిజం తెలియకుంటుందా!

చల్లపల్లి సామాజిక సంస్పందన తోడైతే

స్వచ్చ శుభ్ర సౌందర్యం సాక్షాత్కరించకుంటుందా!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  07.07.2022.