2480* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా?

ఈ స్వచ్ఛ సుందరీకరణ ప్రయత్నం = 2480* వ నాటిది.

        శుక్రవారం (8.6.22) వేకువ 4.20 కన్న ముందే ప్రారంభమై, రెండు గంటలకు పైగా ప్రవర్తిల్లిన సదరు కఠిన ఉద్యోగం (ప్రయత్నం) 26 మందిది! స్థలం అమల్లో లేని సచివాలయ పరిసరమే. నిన్న అసంపూర్ణంగా వదిలిన చిరు పొదల - మెరక పల్లాల - రాళ్లూ రప్పల 10 సెంట్ల - సచివాలయ ఉభయ దిశల స్థలమే నేటి స్వచ్ఛ కార్యకర్తల కర్మక్షేత్రం!

        పాతిక వేల మంది గ్రామస్తులు పట్టించుకోని, ప్రహరీ లోతట్టున గల, ప్రస్తుతానికి వాడుకలో లేని ఒక కార్యాలయం చుట్టూ పెరిగిన, తుప్పలూ, అల్లుకొన్న ముళ్ల పిచ్చి తీగలూ, మోకాలి బంటిగా పెరిగిన గడ్డీ, ప్లాస్టిక్ తదితర ఛండాలమూ ఈ పాతిక మందికే పట్టాలా? ఇంత మంది శ్రమ మూడు రోజులుగా ఈ కొద్దిపాటి ఖాళీ జాగాకే పరిమితమైపోతే ఊళ్ళోని మిగిలిన పెద్దా - చిన్నా రోడ్లూ, వాటి మీద సరిక్రొత్త గుంటలూ, ఎంతో చాక చక్యాంగా, గుట్టుగా జరిగిపోయే కబ్జాల మాటేమిటి?...” అనుకోవద్దు.

        ఇక్కడ పాటుబడుతున్నది స్వచ్ఛ - సుందరోద్యమ కారులు! పైగా ప్రతిదీ సూక్ష్మంగా - క్షుణ్ణంగా - ఒక శిల్పంగా - చిత్రలేఖనంగా చేసే - చెక్కే - గీసే సుందరీకరణ ముఠా సైతం ఇవాళ విడిగా కాక - అందరితో కలిసి, మూకుమ్మడిగా చేసిన కృషి మరి! తమ కత్తి వాదరలూ, దంతెల సార్ధకతలూ పని చేసిన చోటల్లా స్పష్టమైన ముద్ర వేసే ఈ స్వచ్ఛంద శ్రమజీవుల ఏ  ప్రయత్నమైనా ఇలాగే ఉంటుంది మరి!

        ఎవరైనా మచ్చుకు ఒక్క మారు వచ్చి, వేకువ వేళ జరిగే ఈ గంటన్నర కాలపు కార్యకర్తల పట్టుదలనీ, పని భంగిమలనీ నాలాగే దగ్గరగా గమనించండి ఎందుకీ చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం 2480* రోజుల తర్వాత కూడా ఇలా నిర్విఘ్నంగా మన్నుతుందో ఇంత పెద్ద కూడలి గ్రామం 8 ఏళ్లుగా ఈ మాత్రం స్వచ్ఛ శుభ్ర - సుందరంగా మారిందో ఇట్టే అర్థమైపోతుంది!

        నేటి శ్రమదానంతో వాన రెండు మూడు మార్లు దోబూచులాడినా - ఆటంక పరచలేదు. నిన్నటి కన్న ఎక్కువ భాగం మరింతగా చూడ ముచ్చటగా మారింది! ఆఖరికి ఇందులో ముగ్గురు ముసలి కార్యకర్తలకు కూడ పని చేసే ఉత్సాహం పుట్టింది!

        20 మంది 30 కి పైగా పని గంటల శ్రమతో పుట్టు కొచ్చిన అన్ని రకాల వ్యర్ధాలెన్నంటే - ఒక పెద్ద ట్రక్కు పట్టనంత! అర గంటకు పైగా - ముగ్గురి సహాయంతో ఏ 40 - 50 డిప్పలూ, మోపులుగానో సదరు కశ్మలాలను ఎగుడు - దిగుడు పొడవాటి బాట గుండా మోసి, అవలీలగా చేరవేసినదేమో 60 - 70 మార్లు ఆపన్నులకు రక్తమందించిన ఒకానొక ఆధునిక చల్లపల్లి హెర్క్యూలెస్! ఇతనితో బాటు ట్రక్కులో కశ్మలాలు సర్దిన మరొకాయనకు సైతం ప్రతిఫలమేమంటే దురద గొండి ఆకుల్తో ఒంటి దురదలు!

        ఇలా చెప్పుకుపోతుంటే - ఎన్ని వింతలూ, విశేషాలైనా ప్రతిరోజూ ఉండేవే గాని, సమీక్షా సమావేశపు ఒక విశేషం - BSNL విశ్రాంత ఉద్యోగికి దొరికిన మనకోసం మనంట్రస్టులో ప్రత్యేక ఉద్యోగం! తన కొంగ్రొత్త ఉద్యోగానికి పూర్తి న్యాయం చేయగలనని అతడు ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం!

        స్వచ్ఛ సుందర కార్యకర్తగానూ, గ్రామ ప్రధమ పౌరురాలు గానూ, సమర్ధవంతంగా ద్విపాత్రాభినయం చేస్తున్న పైడిపాముల కృష్ణకుమారి గారు ఉత్సాహంతో ముమ్మారు గ్రామ స్వచ్చ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను అదరగొట్టారు. ఎప్పట్లాగే - ఈ దైనందిన నిస్వార్థ శ్రమదానానికి చలించిపోయే, లోలోపలా, సాధ్యం కానపుడు బాహాటంగా కూడా మురిసి పోయే దాసరి రామకృష్ణ వైద్యుని సంతోషం కూడ విశేషమే అనుకోండి!

        రేపటి వేకువ ఇదే దీక్షతో – గాంధీ బొమ్మ చుట్టూ చేయబోయే శ్రమదానం కోసం మళ్లీ మన పునర్దర్శనం ఇక్కడే!

 

స్వాతంత్రం, సౌజన్యం, శ్రమజీవన సౌందర్యం,

స్వాధీనత, సౌభ్రాతృత, సంతృప్తీ, త్యాగ గుణం

అంగట్లో దొరుకు సరుకు లనుకొనుటే దౌర్భాగ్యం

కష్టార్జిత సంపదలని గమనించుటే సౌభాగ్యం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

  07.07.2022.