1852* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1852* వ నాటి ప్రమోదాలు.
 
ఈ నాటి వేకువన కూడ యథావిధిగా 4.02-6.10 నిముషాల నడుమ విజయవాడ దారి-బైపాస్ మార్గం నుండి ప్రభుత్వ పాఠశాల దాక నిర్విఘ్నంగా జరిగిన స్వచ్చ శ్రమదానంలో పాల్గొన్న కృతకృత్యులు 28 మంది.

 
“నక్కలు బొక్కలె వెదకును...” అని ఒక ప్రాచీన తెలుగు కవి చెప్పినట్లుగా ఈ స్వచ్చ సైనికులకు ప్రతి వేకువలోన కనిపించేవి రోడ్ల ప్రక్కన, రోడ్ల మీద గుంటలు, మురుగు కాల్వల్లోని తుక్కులూ, అనాకారి గోడలు, బస్ స్టాపులు, ఖాళీ స్థలాలు, రహదారులు, చెరువుల-కాల్వల గట్లు వగైరా వగైరాలే కదా!
 
- సుమారు ½ కిలో మీటరు పొడవునా ఈ 28 మంది స్వచ్చోద్యమ కారుల ధాటికి ఈ రోజు:
 
1)విజయవాడ మార్గం మీద 10 చిన్న-పెద్ద గుంటలు అత్యంత నాణ్యమైన-ఖరీదైన తారు మిశ్రమంతో శాశ్వత ప్రాతిపదికన మరామత్తు జరిగి, వాహనదారులకు, పాదచారులకు సుఖ సౌకర్యాలు కలుగుతాయి.
 
2) సుందరీకరణ బృందం వారి 1 ½ గంటలు శ్రమ-చెమటల కృషితో రోడ్లు మార్జిన్లలో గత వర్షాలకు పడిన లోతైన ఆరేడు గుంటలు పూడి, సమతలంగా మారి అటు చూచుటకింపుగాను, ఇటు ప్రయాణికులకు సౌకర్యవంతంగాను రూపొందాయి.
 
3) స్వచ్చ ఖడ్గ దారులు పది మంది డ్రైన్ల లో తట్టు ప్రక్కల పెరిగిన వికారమైన పిచ్చి-ముళ్ల మొక్కలు, తీగల మీద తమ ప్రతాపం చూపి, గడ్డి కోసి, పంజాలతో, చీపుళ్ల తో ఊడ్చి, తహదారి మొత్తం కాలుష్యాన్ని ఒక కొలిక్కి తెచ్చి సువిశాల సుందరంగా మార్చారు.
 
4)నలుగురైదుగురు చీపుళ్లతో-గొర్రులతో పెట్రోలు బంకు మొదలుకొని, ఉభయ మార్గాలను ఊడ్చి, మట్టిని, ఇసుకను, వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి పంపించారు.
 
61 నెలల నుండి ఇలా గ్రామ బాధ్యతలు తీర్చుకొంటున్న స్వచ్చ కార్యకర్తలు “ఆడుతు-పాడుతు-జోకులు పేల్చుతు-చేసే నిస్వార్ధ శ్రమదానంలో అలుపుసొలుపే ముంటది- అందరమొకటై చేయి కలిపితే శ్రమ ఏముంటది- ఊరికి గెలుపు మిగుల్తది.....”
 
పసుపులేటి సత్యం గొంతు సవరించుకొంటూ ముమ్మారు చాటి చెప్పిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతోను, అడపా గురవయ్య గుర్తు చేసిన భర్తృ హరి సూక్తులతోను 6.35 నిముషాలకు నేటి బాధ్యతల పరిపూర్తి!
 
వీర సింహుడు శ్రీశైల లడ్డు ప్రసాదాన్ని కార్యకర్తలకు అందించారు.
 
రేపటి మన గ్రామ కర్తవ్యం కోసం విజయా కాన్వెంటు దగ్గర కలుసుకొందాం!
 
అనుమానం పెనుభూతం...(వికట హాస్య వెటకారం).
అవధి లేని త్యాగాలను-స్వచ్చోద్యమ సేద్యాలను
ఇంటింటా-ఊరూరా-ఎద ఎదలో ఎదగదగిన-
స్వచ్చ-శుభ్ర భావనలను సాగుచేయు-ప్రోది చేయు
చల్లపల్లి స్వచ్చ సైన్య సహస ప్రతి బంధకమని...!
 
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శనివారం – 7/12/2019
చల్లపల్లి.