2500* వ రోజు....

ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

హిందూ శ్మశాన వాటికలో -2500*వ నాటి శ్రమదానం :

            అది ఎట్ట కేలకు ఈ ఆదివారం వేకువ 4.31 కి సఫలీకృతమయింది!  వేకువ 3.00 నుండే జంఝూమారుతంతో కలిసి వచ్చిన వరుణుడు కొంత ప్రతాపం చూపాడు! 4.00 తరువాత బాగానే సహకరించబట్టే అంచనా ప్రకారం కాకున్నా కనీసం 48 మందై నా (జనాభా కాదు- ఇళ్ల ప్రకారం ఐనా - ఒక్కశాతమైనా) పాల్గొన్నారు! ప్రాత, క్రొత్త, కొంగ్రొత్త కార్యకర్తలు కూడ కలిసి నిర్వహించిన ఈ రుద్రభూమి సంస్కరణం చల్లపల్లి స్వచ్చోద్యమంలో మరొక మలుపే!

            తమ గౌరవనీయ-సంస్మరణీయ పెద్దలకు తగిన తుదివీడుకోలు పలికే ఏ మర్యాదస్తులైనా స్వర్గపురిగా కొందరు పిలుచుకొనే ఈ శ్మశాన స్థలిని బాహ్య మల విసర్జనతోనూ పేడ కుప్పల- రాళ్లు రప్పల డంపింగ్ కేంద్రం గానూ మార్చగలరా?”  అని ఒక 76 ఏళ్ల పెద్దాయన చెందిన ఆవేదన! ఈయనదేమీ కాలం చెల్లిన ఆలోచన కాదనీ, వీధులేంటి- డ్రైనులేంటి- రుద్రభూములేంటి రహదార్లేంటి ..... వరస బెట్టి అన్నిటినీబాగుచేసుకుంటూ ఎనిమిదేళ్లుగా స్వచ్చ కార్యకర్తలొక ప్రక్క పదేపదే-2500*మార్లు ఋజువు చేయనే చేస్తున్నారు గదా !

            స్వచ్చ కార్యకర్తలు కాక- వంతులుగా ఇంటి కొకరు చొప్పున ప్రతి రోజు అదనంగా 50 మంది గ్రామ బాధ్యతలు పంచుకొంటే- తన ఏడాది వేతనాన్ని ఒక మోర్ల రాంబాబు (MPTC) ఈ శ్మశాన పునర్నిర్మాణానికి ప్రకటించినట్లుగా ప్రతి కుటుంబమూ నెలకు పదో /పాతికో చందాలిస్తే – “ స్వచ్చ సుందర చల్లపల్లిపేరుకు తగ్గట్లుగా ఊళ్లో మిగిలిన సగం మందికి కూడ స్వచ్చ స్పృహ వస్తే సంవత్సరం తిరక్కుండానే మన ఊళ్లో ఎన్నెన్ని అద్భుతాలైన జరుగుతాయి! దయచేసి ఇది మరీ అత్యాశ అనీ పగటి కల అనీ ఎగతాళి చేయకండి!యువకుల్లారా! కలలుకనండయ్యా! కష్టించి సాధించుకోండి బాబూ....! అనే గదా ఒక అబ్దుల్ కలాం మహాశయుడు చెప్పింది?

            ఈ ఉషోదయం 115 నిముషాల శ్రమదానంలో ఏమీ అద్భుతాలు జరగకపోవచ్చు ! ఇంత బురదల్లో-నీళ్లలో, అశుద్ధ ప్రదేశంలో 48 మంది పాల్గొని తమ సామాజిక బాధ్యత పాటించడమే గొప్ప! ఈ యకరంపాతిక శ్మశానంలో దోమల్ని పెంచే మాచర్ల కంపను వంగి సగం దాక పీకడమూ, ప్లాస్టిక్ దరిద్రాల్ని ఏరడమూ, మద్యం ఖాళీ బాటిల్స్ పోగేయడమూ జరిగిన వరకు జరిగాయి! మిగిలినవి రేపు కూడ ఇందరు పాల్గొంటే పూర్తి కావచ్చు ! లేదంటే స్వచ్చ కార్యకర్తలుండనే ఉన్నారు!

            నేటి కృషి సమీక్షా కాలంలో 1) లక్షలో- కోట్లో కానున్న ఈ శ్మశాన సుందరీకరణ ఖర్చు విషయంలో DRK గారి నిస్సహాయత;

2) ఎప్పట్లాగే డాక్టరమ్మ గారి తెగింపు;

3)పంచాయతీ బాధ్యుల- గ్రామ పెద్దల- ఇంకా నేడిక్కడికి రాని ఊరి వదాన్యుల స్పందనా, భరోసా ఆశాజనకంగానే ఉన్నవి!   

4)  స్వచ్చ సుందర చల్లపల్లికిజై కొట్టి, అది సాధించే తీరుతామని ముమ్మనేని నాని (ఉప సర్పంచ్) నినదించడమూ

5) ప్రస్తుత కన్నడ దేశస్తుడు వేమూరి అర్జునుడు ఫోనులో అందర్నీ పరామర్శించడమూ- అన్నీ బాగున్నవి!

ఈ బుధవారం వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటు విజయవాడ రోడ్డు లోని కాటాల వద్ద!

 

         సగర్వ ప్రద సన్నివేశం !

ఎవరి లోపం వాళ్లు దాచే- ఎవరి గొప్పలు వాళ్ళె చాటే

ఆకృత్యాలే సుకృత్యాలని అరచి చెప్పే ఈ యుగంలో-

క్రమం తప్పని ధర్మ కర్మలు గ్రామ మంతట నిర్వహించే

స్వచ్చ-సుందర కార్మికులదే సగర్వ ప్రద సన్నివేశం!

- నల్లూరి రామారావు,

  విశ్రాంత ఉపాధ్యాయుడు,

  స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

  07.08.2022.