2549* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

అరుదైన గ్రామ స్వచ్ఛోద్యమం పుస్తకంలో 2549* వ పుట!

            ఈ శనివారం వేకువ 4.30 నుండి 6.10 దాక ఆ పేజీని వ్రాసిన వాళ్లు 20 మంది! వ్రాస్తుండగా చూసి - చూడకుండా వెళ్లిపోయిన గ్రామస్తులు పాతిక - ముప్పై మంది! సామాజిక స్పృహ చాలని నేటి గడ్డు కాలంలో ఎడతెగక రోజూ ముప్పై - నలభై - అరుదుగా ఏభై మంది స్వచ్ఛ కార్యకర్తలు రచిస్తున్న ఇంత అద్భుత గ్రంథాన్ని ఏరోజుకారోజు ఊరి వాళ్లు - వార్డు వారు చూడాలి - చదవాలి - ప్రోత్సహించాలి! ఏది మరి?

            నిన్న పగటి పూట భారీ వర్షానికి బందరు రహదారి తడిసి - ముద్దై నీళ్లు నిలిచినందు వల్ల ఈ వేకువ స్వచ్ఛంద శ్రమదాన దృశ్యం ఉపమార్గంలోని సజ్జా ప్రసాదు గారి - అనగా అశోక నగర తొలి వీధికి మారింది. చిరు తుంపర పడుతున్న - పెద్దవాన సూచనలున్న - అననుకూల వాతావరణమొక ప్రక్క, చిత్తడి బజారు - నీళ్ల చెలమలున్న డ్రైనులొక ప్రక్క! ఆస్థితిలోనే జరిగిన కార్యకర్తల శ్రమానందం!

            వారం రోజులుగా శరన్నవరాత్రుల సందర్భంగా - ఊళ్ళో వీలైన ప్రతిచోట దేవీ ప్రతిమల్ని పెట్టి - పూజించి - భజించి - భక్తి గీతాలు శ్రావ్యమైనవే గాని, భరించరానంత శబ్దంతో వినిపిస్తున్న సన్నివేశాల్ని చూస్తున్నాం!

మరో 30 - 40 మంది దుర్గాదేవిని పల్లకిలో మేళతాళాల్తో భజనల్తో ఊరేగిస్తూ పొందుతున్న "భక్తి పార దృశ్యానందాన్నీ గమనించాను - మరి, 2549* నాళ్లుగా పాతిక ముప్పై వేల గ్రామస్తుల సౌకర్యాలే ధ్యేయంగా కాయకష్టం చేస్తూ స్వచ్ఛ కార్యకర్తలందుకొంటున్న అత్మ సంతృప్తి మనకు తెలిసిందే!

 

ఈ శనివారం వేకువ వారి శ్రమజీవన సౌందర్య దృశ్యాల్లో కొన్ని:

- సబ్జా ప్రసాదు గారి వీధిలో 40 - 50 గజాల మేర గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ తొలగించి ట్రక్కులోకి బట్వాడా చేయడం,

- బైపాస్ వీధిలో రెండు ప్రక్కలా అదే పని చేసి, నిన్నటి గాలికి విరిగిన కొమ్మల్ని విడగొట్టి, డ్రైను ఒడ్డున పుల్లా - పుడకలూ, ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ, కొబ్బరిబొండాల మిగుళ్లూ ఏరి, శుభ్రపరచడం.

- అశోకనగర్ 2 వ వీధిలో సైతం కొంత మేర అసౌకర్యాలు తొలగించి, ఊడ్చి, ముందే పచ్చగా ఉన్న వీధికొక క్రొత్త ఆకర్షణ తేవడం;

            6.10 దాక అనుమానాస్పద చినుకుల వారణావరణంలోనే జరిగిన పై కార్యక్రమమంతా ముగిసి, 6.25 కు మణికంఠ అనే బాలకార్యకర్త స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య నినాదాలతో ముగిసింది!

            రేపటి ఆదివారం వేకువ కూడ ఇదే ఉపమార్గంలోని భారతలక్ష్మి వడ్లమర వీధి దగ్గర ఆగి - వీధి పారిశుద్ధ్యానికి ప్రయత్నించాలనేది అందరి అంగీకారం!

                 మా ఆశంస

గ్రామభాగ్య విధాతలారా! స్వచ్ఛ కారణ జన్ములారా!

శ్రమ త్యాగ వినోదులారా! పారిశుద్ధ్య ప్రమోదులరా!

ఉన్నతోత్తమ ఆశయంతో ఊరి కోసం పాటుబడు మీ

సత్ప్రయత్నం ఫలించాలని - శాశ్వతంగా నిలబడాలని....

- నల్లూరి రామారావు,

   01.10.2022.