1853* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1853* వ నాటి కర్తవ్య నిర్వహణలు

 

4.05 నుండి 6.20 నిముషాల దాక ప్రభుత్వ వైద్యశాల వీధి మొదలు 6 వ నంబరు పంట కాల్వ వంతెన దాక, కొసరుగా కాలువ దక్షిణం గట్టు కూడా కొంత మేర స్వచ్చ – శుభ్ర – సుందరీకృతమైన నేటి ప్రాభాతిక కృషిలో పాల్గొన్న కార్యకర్తలు 36 మంది. (గంటన్నరకు పైగా స్వచ్చోద్యమ మాదక స్థితిలో జరిగిన ఈ శ్రమదాన విన్యాసాలలో, భంగిమలలో కొన్నిటిని వాట్సాప్ లో తిలకించవచ్చు!)

 

- సుందరీకరణ సభ్యులు ఈరోజు ప్రధానంగా విజయా కాన్వెంట్ గేటు ప్రాంతంలో డ్రైను లోపలి భాగంలోని ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ఆకులు, గడ్డి వంటి అన్నీ రకాల వ్యర్ధాలను ఊడ్చి, ఏరి, డిప్పలతో మనకోసం మనం ట్రక్కులోనికి ఎక్కించారు. డ్రైను నుండి పంచాయతి వారు తోడి, గట్టిపడిన మురుగు మట్టిని త్రవ్వి రోడ్డు ప్రక్క గుంటలు పూడ్చారు. అక్కడ రంగురంగుల పూల మొక్కలు త్వరలోనే కొలువు తీరవచ్చు!

 

- అదేమిటో – విజయవాడ రోడ్డేదో తమ ఇళ్లనేంతగా నలుగురు మహిళలు చీపుళ్లతో – పంజాలతో ఊడ్చి, ఊడ్చి శుభ్రం చేస్తూనే ఉన్నారు.

 

- పాత, కొత్త చెట్లకు, పూల మొక్కలకు పాదుల్ని చక్కదిద్ది, గడ్డిని తొలగించే పనిలో ఐదారుగురు!

 

- కత్తుల ముఠాకు గూడ ఈరోజు సరిపడాపని దొరికింది. విజయవాడ దారి ప్రక్కల, పంట కాలువ గట్టు మీద, డ్రైన్లలో పిచ్చి – ముళ్ళ మొక్కలు, గడ్డి హతమై, ట్రాక్టర్ లోకి ఎక్కి, చెత్త కేంద్రానికి తరలిపోయాయి.

 

గత 61 నెలలుగా ఇంతమంది – లక్షల పనిగంటలుగా శ్రమిస్తే ఈ చల్లపల్లి ఇలా ఉందంటే – తక్కిన సోదర గ్రామస్తుల్లా వీరు కూడ పట్టించుకొకపోతే ఎలా ఉండేదో!

 

కాఫీ – తేనేటి సరదా విరామం తరువాత జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు నిన్న – మొన్నటి విజయవాడలోని డాక్టర్ జగన్మోహనరావు గారి ఇంట జరిగిన స్వచ్చ వేడుకలను గూర్చి ప్రస్తావించారు. పెళ్లి వేడుకల శ్రమ, శ్రద్ధల కన్న ఐదారు రెట్లు శ్రమతో మొత్తం నాలుగు ఫంక్షన్లలో 5000 మందికి ఆతిధ్యంలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడ వాడని – 100 శాతం శుభ్ర – హరిత వేడుకలో అన్ని సంగతులను పూస గుచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో, దేశంలోని అన్ని వేడుకలు ఇలా జరిగితే పర్యావరణం ఎంత భద్రంగా ఉంటుందో గదా!

 

అంజయ్య గారు త్రిగుణాత్మకంగా రెండు మార్లు పలికిన స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యతల పరిపూర్తి. 6.40 నిముషాలకు లయన్ శ్రీ T. సాంబశివరావు గారు నెలనెలా ఇచ్చే 500/- విరాళానికి ధన్యవాదాలు.

 

రేపటి మన శ్రమదానం గ్రామ ప్రధాన కేంద్రం – మూడు రోడ్ల కూడలిలో నిర్వహిద్దాం.

 

         ప్రత్యామ్నాయం వచ్చుదాకా....    

అహంభావం’, సొంత డబ్బా లనే మాటలు కర్ధమేమిటి?

ప్రచారార్భటి’, ప్రగల్భాలని ప్రకోపించిన కార్యమేమిటి?

స్వచ్చ సైన్యం నిత్యసేవల ప్రత్యామ్నాయం చూడవలదా?

అది లభించే దాక వాళ్ళను ప్రశంసించుట సాధ్యపడదా?

  

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 8/12/2019

చల్లపల్లి.