2612* వ రోజు ... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

అదే పాగోలు రోడ్డులోనే - ఆ ఐదుగురు కార్యకర్తలే! - @2612*

            ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర్ల దూరాన గల పాగోలు రోడ్డు మీదికి చేరుకొన్నది.

            కొంచెం అటూ - ఇటూగా 2 గంటల శ్రమతో గాని, ఆ వీధి స్వచ్ఛ - శుభ్రతలకూ, అందానికీ కాస్తంత హామీ లభించలేదు! స్వచ్ఛ సుందరీకృత భాగం పోను రేపటికి కూడ ఈ ఐదుగురికీ అక్కడే పని దొరికేట్లుంది!

            ఇందులో ఒకాయనది కాస్త అతిగా కనిపిస్తున్నది - రేపో లేక ఎల్లి+ఉండో తన ఇంట్లో పెద్ద శుభకార్యం ఉండగా రోడ్డెక్కి శ్రమదానానికి పూనుకొన్నాడు!

            ఈ అత్యల్ప సంఖ్యాకుల శ్రమదాన వీరంగం గురించి నేను ప్రత్యేకంగా పని గట్టుకొని వర్ణించనేల? “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమంలో చూడండి! అక్కడి గ్రామస్తులో, ప్రయాణికులో ప్లాస్టిక్ సంచులో - తుక్కో డ్రెయిన్ లోనో, రోడ్డు మార్జిన్ లోనో విసరడం క్రొత్తా? ఎండు పుల్లల్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఛండాలాన్ని, మద్యం సీసాల్ని ఏరడం ఈ కార్యకర్తలకు క్రొత్తా? సదరు ఉషోదయ శ్రమదాన విశేషాల్ని నేను పొదుపుగా వ్రాయడమూ - మీరు చదవడమూ ఏవీ క్రొత్త కాదు!

 

            ఆ మాట కొస్తే బాటల మీద కశ్మలాలు విరజిమ్మే గ్రామస్తులు మాట వరసకన్నా దారి సుందరీకరణలో ఒకచేయి వేయకపోవడం కూడ ప్రాత సంగతే!

            సరే, చూద్దాం చల్లపల్లి, పాగోలు ప్రజలు ఇంకెన్నాళ్లు - ఎన్నేళ్లు స్వచ్ఛ కార్యకర్తలకు ఇలా సామాజిక బాధ్యతలప్పజెపుతారో!

            6.30 తరువాత నేటికి శ్రమదానం ముగించి, మాలెంపాటి అంజయ్య గారు ముమ్మారు తమ ఉద్యమ నినాదాలు ప్రకటించాక నేటి తమ కర్తవ్యాన్ని రేపటికి వాయిదా వేశారు!

         జడివానల మధురిమలివి

వేన వేల దినాలుగా వందల సత్సంగాలివి

ఆలోచన పరిధి దాటి ఆచరణల మార్గములివి

మహనీయుల అడుగు జాడ మన కిచ్చిన ముద్రికలివి

స్వచ్ఛాంధ్రకు తెలి వెలుగుల జడివానల మధురిమలివి!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   05.12.2022.