2631* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?

క్రిస్ట మస్ వేకువ వేళ కోమలా నగర్ దగ్గరి శ్రమ సందడి -@ 2631*  

 

          ఎప్పట్లాగే – 4.30 AM అనే నిర్ణీత సమయం కన్నా – 10-15 నిముషాల ముందుగానే కనీసం 16 మంది కార్యకర్తల హాజరు నడకుదురు బాటలోని కార్ల మరమ్మత్తు దుకాణం దగ్గరే! మిగిలిన 24 మంది సైతం నిముషాల క్రమంలో వచ్చి చేరి, కోమలా నగర్ ప్రముఖ రోడ్డు దాక – 110 గజాల మేర వీధి పారిశుద్ధ్య పనుల సందడే సందడి!

          ఇది ఆదివారం + క్రిస్టమస్ పర్వదినం! గ్రామస్తుల్లో నిద్రా ముద్రాంకితులు కాని కొందరు చర్చిలకు పొతే, ఇంకొందరు సొంత పనులు చూసుకొంటే – ఇదిగో ఈ 40 మందిని మాత్రం సొంత ఊరి బాధ్యతల్లో భాగంగా నడకుదురు రోడ్డు ఆహ్వానించిందన్నమాట! ఇలాంటి పిలుపునందుకొన్న కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించిన వీధి పారిశుద్ధ్య కథాక్రమం బెట్టిదనగా:

- మట్టి దిబ్బల పని మంతులు అనాథలుగా పడి ఉన్న ఎండు మురుగును త్రవ్వుట, పారలతో తోడి, వాహనంలోకి చేరవేయుట;

- ఎండు చెట్ల మ్రోడుల్నీ – మొండి గోడల్నీ కూడ వదలక సుందరీకరించే బృందం వారు తామే నాటి పెంచిన చెట్ల కొమ్మలు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటే  అవసరమైన మేరకు ఖండిచక- పొందికగా రూపొందించక చూస్తూ ఊరుకోరు గదా!

          - తమ అపార్ట్ మెంట్ల ఎదుట రోతగా పెరుగుతున్న చిల్లర- మల్లర పిచ్చి- ముళ్ళ మొక్కల్నీ, గడ్డినీ పట్టించుకోక అక్కడి వాళ్లు వదిలేస్తే ఆ వీధి మార్జిన్ల ను శుభ్ర పరచిన పని డజను మందిది!

- ఇళ్ళ ఆవరణల్లో తొలగించిన మొక్కలు, కొమ్మలు, తీగలు, ప్లాస్టిక్ పనిముట్లు, చిత్తు కాగితాలు, గోనె సంచులు, ఖాళీ సీసాల వంటివన్నీ చెత్త బండికి అందించక ఇలా వీధిలో పడవేయడం ఏ సంస్కృతో తెలియదు- ఎవరి బాధ్యతా రాహిత్యమో అర్థం కాదు – వీటన్నిటినీ ఊడ్చి, ఏరి, డిప్పల్తో ట్రక్కులో నింపిన కృషి 10 మంది వంతు!

          అలా చూస్తుండగానే గంటన్నరకు పైగా – (50/60 పని గంటల) కాలం కర్పూరం లాగా వెలిగిపోయింది! అప్పుడిక కార్యకర్తలంతా కమ్యూనిష్టు వీధి చివర గల దాసరి రామ మోహన రావు గారి గృహోన్ముఖంగా కదిలారు. 1) మరొక 20 నిముషాల పాటు గ్రామ ప్రప్రథమ మహిళ – కృష్ణ కుమారి గారు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-సౌందర్య- సంకల్ప నినాదాలను ఆమోదించి,2) ఆమె క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన విందును స్వీకరించి, 3) 91 ఏళ్ల గౌరవ్యులు దాసరి వారు కోసిన క్రిస్మస్ కేకును ఆస్వాదించి, 4) DRK గారి సమీక్షా వచనాలనాలకించి, ఈ ఆదివారాన్ని తమ స్వచ్చ -  సుందరోద్యమంలో చిరస్మరణీయంగా మార్చారు!

          పల్నాటి తరుణ్ జన్మదిన సందర్భంగా కార్యకర్తలకు మిఠాయిలూ, ‘ మనకోసం మనం’ ట్రస్టుకు 1000/- విరాళమూ, ఇదే రోజు 62 ఏళ్ల నాడు పుట్టిన – జీసస్, థెరిస్సా పోలికలున్న (భౌతికంగా కాదు!) గోపాళం శివన్నారాయణకు అభినందన చందనమూ నేటి అదనపు విశేషాలు!

          బుధవారం నాడు కోమలా థియేటర్ దగ్గరే మరల మన పునర్దర్శనం !

           నా ప్రణామం – 179

తేట పలుకుల కవితలన్నీ – తియ్య తియ్యని కబుర్లన్నీ

గాంగ ఝరిగా ప్రవచనం –  వాగ్ధాటి మెరిసే వింతలన్నీ

తమ ఒకే ఒక చెమట చుక్కకు సాటిరావని తేల్చి చెప్పిన

స్వచ్చ బంధుర గ్రామ సేవక సాహసికులకు నా ప్రణామం  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   25.12.2022.