2632* వ రోజు... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

సోమవారం నాటి ప్రత్యేక టీమ్ చర్యలు - @ 2632*

            షరా మామూలుగానే సోమ, మంగళ వారాల పరిమిత సంఖ్యాక స్వచ్చ కార్యకర్తల వీధి భద్రతా/శుభ్రతా కృషి 26.12.2022 వేకువ కాలాన కొనసాగింది! అది మా గంగులవారిపాలెం వీధిలోనే - మా ఇంటి ఎదురుగానే జరిగింది!

            రోడ్డు ప్రక్కన అమర్చిన పేవర్ టైల్స్ క్రుంగిపోగా సరిజేయడమే ఈ సోమవారం స్వచ్చంద శ్రమదాతలు సాధించిన పని. నికరంగా నిలకడగా పని చేసింది ఐదుగురు, వాళ్లకు ఉడతా సాయమందించినది ముగ్గుర్నలుగురు. పైకి చూస్తే ఇది గూడ ఒక పెద్ద ఘనకార్యమేనాఅనిపిస్తుంది గాని, గంటన్నర పాటు అందులో దిగి చేస్తే గదా దాని విలువేమిటో, శ్రమ ఎంతటిదో తెలిసేది!

            వాస్తవంగా ఈ రంగురాళ్లు చక్కదిద్దే పని తాపీ వాళ్ళది. స్వచ్చ - సుందరోద్యమం ఫలితంగా కార్యకర్తల్లో కొందరు

            ఎప్పటికెయ్యది అవసర

            మప్పటికా పనులు నేర్చి”  ఆరితేరుతున్నారు!

            తాపీ మేస్త్రీల కూలీల అవసరాన్నీ, అవకాశాన్నీ తగ్గిస్తున్నారు.

            మరి - అందుకు వీళ్ళందుకొంటున్న ప్రతిఫలం డబ్బు కాదు ప్రచారమూ, ప్రశంసలూ కూడా కాదు

            - అంతకు మించిన ఆత్మ సంతృప్తి!

            ఇదేదో మఘలో పుట్టి, పుబ్బలో ముగిసినతాటాకు మంట ఉద్యమం కాదు, 2632 నాళ్ళ అవిచ్చిన్న శ్రమదాన స్రవంతి!

            6.30 తదుపరి గంధం బృందావన్ తో కలిసి కార్యకర్తలంతా ముక్త కంఠంతో స్వచ్చోద్యమ చల్లపల్లి విజయీభవఅంటూ ముమ్మారు నినదించి, ఇళ్లు చేరారు.

            నా ప్రణామం -180

నేటి తక్షణ సమాజ స్థితి మేటి గ్రామం నమూనాలను

అందు కావశ్యక ప్రణాళిక ఆచరణ పూర్వకంగానే

ప్రదర్శిస్తు పరిప్లవిస్తూ భావి ప్రగతికి బాట వేసే

స్వచ్చ - సుందర గ్రామ సేవక సాహసికులకు నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   26.12.2022.