2633* వ రోజు... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

నిన్నటి వీధికే మరొక మెరుగుదల ప్రయత్నం - @2633*

          మంగళవారం వేకువ కూడ 4.30 కు ముందే స్వచ్ఛ కార్యకర్తల చతుష్టయం గంగులవారిపాలెం వీధిలోకి చేరుకొన్నది. నిన్న వదలిన పేవర్ టైల్స్ పనిని పూర్తిచేయడంతో బాటు ఆస్పత్రి దగ్గర రెండు చింత మొద్దుల క్రమబద్ధీకరణ / సుందరీకరణను కూడ చేపట్టింది.

          ఇతరుల సంగతేమో గాని, స్వచ్ఛ కార్యకర్తల్లోనే ఒకరిద్దరు ఒకటి రెండు మార్లు నేనిలా ప్రతి ఉదయం స్వచ్ఛ కార్యాక్రమ నివేదికలు వ్రాయడాన్ని కొంచెం అభ్యంతర పెట్టారు మనం చేసే ఈ చిన్న చిన్న బాధ్యతలకింత వివరణ, వర్ణన అవసరమా...? అని! ఎక్కువ మందేమోఇదేమీ కల్పన కాదు, అభూత వర్ణనా కాదు, ప్రతి ఊరి జనానికీ తెలిసి తీరాల్సిన ఎంతో కొంత స్ఫూర్తి కలిగించే వాస్తవం కనుక ఇక్కడి వాస్తవాల నివేదన అవసరమే అని భావించారు!

          నలుగురు రాటు దేలిన కార్యకర్తలూ, వాళ్లకు కాస్తో కూస్తో సహకరించిన ముగ్గురూ ఈ సోమ  మంగళవారాల్లో తాము తలపెట్టినవి చాల వరకు పూర్తిచేయడం విశేషం!

          6.30 పిదప నేటి స్వచ్ఛ - సుందర నినాదాలను వినిపించిన వంతు, అతిథి కార్యకర్త పాత్రధారి కస్తూరి విజయ్ ది!

          వీధిలో స్వచంద శ్రమదానం అలజడి ఉంటే, కపై వీధి నుండి తాత్కాలిక స్వచ్ఛ కార్యకర్తలు బైటకు వచ్చి, మనతో కలవాలని ఆశిస్తూనే ఉందాం!

          రేపు - 28.12.22 వేకువ సమయంలో మన శ్రమదానానికి ఎదురు చూసేది నడకుదురు బాటలోని కోమలా థియేటర్ ప్రాంతమే!

            నా ప్రణామం -181

ఏది సులువుగా దక్కబోదని దసాధ్యం కానే కాదని

ఐకమత్యమే మహాశక్తిని - పారదర్శకతే బలమ్మని

హేతు బద్ధ సమష్టి నిశ్చయమే సదాచరణీయ మనుకొని

పురోగమించిన స్వచ్ఛ సైనిక స్ఫూర్తికే నాతొలి ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   27.12.2022.