2634* వ రోజు... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

బుధవారం (28-12-22) వేకువ శ్రమదాన సంగతులు @2634*

            నేటి బ్రహ్మముహూర్తాన - 4.18 కే - కోమలా సినీ ప్రదర్శనశాల ప్రక్కన కలుసుకొన్న ఔత్సాహిక శ్రమదాతలు 13 మంది, క్రమానుగతంగా చేరిక మరో 16 మందిది, వెరసి 29 మంది; 6.12 దాక - అంటే 55 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నం జరిగింది నడకుదురు దారిలో సినిమా హాలుకు కుడి యెడమల్లోను, అక్కడికి ½ కిలోమీటరు దూరాన రెండు చోట్లా!

            చలన చిత్ర రంగుల లోకాన్ని చూడవచ్చేది వందలాది ప్రేక్షకులు కాబట్టి ప్రదర్శనశాలలు ఎంతో శుభ్రంగా ఉండాలి. దాని సంగతి సరే హాలు బైట బడా బడా ఫ్లెక్సీలూ సరే - గేటు బైటి చోట్లు సంగతి? డజన్ల కొద్దీ త్రిచక్రవాహనాలు ఆ జాగాల్లోనే! వాటి మధ్య ఎంత దట్టంగా అన్ని రకాల కశ్మలాలు పడి ఉన్నదీ, వాటిని తొలగించేందుకు డజనుకు పైగా కార్యకర్తలెంతగా శ్రమించిందీ, దగ్గరగా గమనించిన వాళ్లకే తెలుస్తుంది!

            రోడ్డుకు ఉత్తర - దక్షిణ దిశల ఖాళీ స్తలాలు ఎన్నెన్ని కశ్మలాలతో - ఎంత కళాహీనంగా ఉన్నాయో - వాటిని పాక్షికంగానైనా సరిదిద్దిన ఏడెనిమిది మంది కార్యకర్తలకే ఎరుక!

            ఆదివారం నాటి వీధి ఉత్తరాభిముఖ వృక్ష సుందరీకరణను నలుగురు కార్యకర్తలు కొనసాగించారు.  చిందరవందరగా పెరిగి, పిచ్చి తీగలల్లుకుపోయి - వికృతంగా జడల రాక్షసిగా ఉన్న ఒక చెట్టు నేను చూస్తుండగానే 20 నిముషాల్లోనే ఒద్దికగా పొందికగా మారిపోయింది!

            వీళ్లకు ఇంకొంత దూరాన నలుగురు మట్టి పని కార్యకర్తలు - ఆదివారం తరువాయిగా ఇంకొక ఎండు మురుగు దిబ్బను త్రవ్వి, టక్కులోకి ఎత్తి, నేలను చదును చేశారు.

            ఇద్దరు వృద్ధ కార్యకర్తలు, ఇద్దరు మహిళా శ్రామికులూ చీపుళ్లతో సాధించినది 150 గజాల వీధి శుభ్రత! దీనికి కొసరుగా ఒక హడావుడీ మహిళ మరొకరితో కలిసి కోమలానగర్ ప్రధాన వీధిలోకి చొచ్చుకుపోయి ఊడ్చి వచ్చారు.

            అసలివాళ్టి మంచే అసాధారణం! అమెరికా - కెనడాలంత మంచు బాంబు కాదు గాని, పనులకు కొంత ఆటంకమే! ఐనాసరే - ఇది ఆదివారం కాకున్నా సరే - శివరామపురం రైతులూ, RTC వాహన చోదకుడూ, మాజీ BSNL ఉద్యోగీ వంటి కొందరి పునరాగమనంతో కార్యకర్తల సంఖ్య పెరిగింది. నాలుగైదారు రోజులు కంటే స్వచ్ఛ కార్యకర్తలు తమ వేకువ శ్రమదానాన్ని వాయిదా వేసుకోలేరు గదా! స్వచ్ఛ - సుందరోద్యమంలో పాల్గొనని వాళ్లకేం తెలుస్తుంది - పరుల కోసం జరిగే ఈ శ్రమదాన సంతృప్తి?

            మరీ ముఖ్యంగా తొలి సమావేశపు పరస్పరాత్మీయ పలకరింపులూ, పనివేళ కొన్ని చతురోక్తులూ, పని ముగించి వస్తూ సహర్షంగా కబుర్లూ ఈ సంఘీభావ సంస్కృతీ ఈ 30 - 40 మంది కార్యకర్తలెలా వదులుకొంటారు?

            నేటి సమీక్షా కాలంలో స్వచ్చోద్యమం తరపున ఊరి స్వచ్ఛ - సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించినది ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగి తోట నాగేశ్వరరావు; ఇందరి శ్రమదాన దృశ్యాలకు పరవశించింది డాక్టరు దాసరి రామకృష్ణుల వారు; అంతకుముందుగా అక్కడి స్ధానిక  చిన్నపిల్లలకు చాక్లెట్లో - బిస్కట్లో కొనిచ్చింది బహుశా పద్మావతీ వైద్యుల వారు!

            రేపటి మన శ్రమదాన సంకల్ప ప్రదేశం బెజవాడ - నడకుదురు బాటల కూడలిలోని ఇంధనశాల!

            నా ప్రణామం 182

ఎవరి బ్రతుకులు ఆభిజాత్యము లెవరి సంపద - లెవరి ఆశలు

శాశ్వతములై నిలిచి పోవని - సమంజసమగు సమాజానికి

స్వార్ధరహితంగా శ్రమించుటె సర్వ శ్రేష్ట విధానమనుకొని

నిరూపించిన స్వఛ్ఛ - సుందర నైష్టికులకే నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   28.12.2022.