2635* వ రోజు... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

వాహన ఇంధన కేంద్రంగా 2635* వ నాటి శ్రమదానం!

            ఆ కేంద్రం బెజవాడ - నడకుదురు బాటల కూడలిలోనిది; ఆ కార్యకర్తలు 27 మంది; అది జరిగిన వేళ వేకువ 4.14 - 6. 14 ల నడుమ; ఆ రెండు గంటల కాలంలో

1) బంకుకు రెండు ప్రక్కలుగా,

2) పురిటిగడ్డ వైపు కాస్త దూరంగా,

3) సినీ ప్రదర్శన శాల ఎదురుగా మూడు రకాల గ్రామ మెరుగుదల పనులు జరిగాయి!

            బంకుకు ½ కిలోమీటరు దూరాన ఇద్దరు - ముగ్గురి వృక్ష శాఖల సుందరీకరణం మామూలుగానే జరిగిపోయింది.

            నలుగురు చెత్త లోడింగు కార్యకర్తలు 150 గజాల బారునా - అదే బాటలో - నిన్నటి - నేటి కసవు ప్రోగుల్ని గంటకు పైగా ఎత్తుతూనే ఉన్నారు. మళ్లీ ఆ గుట్టల్లో ఖాళీ మద్యం, నీటి సీసాలు - వాటిని విడగొట్టి గోనె సంచుల్లో వేసే పనీ తటస్థించింది!

            15 మంది కార్యకర్తల కష్టతరమైన పారిశుద్ధ్య సుందరీకరణ కృషి జరిగింది మాత్రం NTR పార్కు ఎదుటనే! అక్కడ ఘాటుగా కొడుతున్న డ్రైను మురుగు కంపును తట్టుకొని ప్రహరీ పడమర ఎగుడు దిగుడుగా ఉన్న మెష్ అంతర్భాగంలోని జాగాను - కత్తులు, పారలు ఉపయోగించి, గడ్డినీ పిచ్చి మొక్కల్నీ తొలగించి, NTR పార్కు పరువును దక్కించారు. ఇంత చక్కని పార్కు దగ్గర కూడ ఇన్ని ఖాళీ ప్లాస్టిక్, గాజు సీసాలు, గ్లాసు లెందుకో అర్థం కాదు!

            ఆ సంగతలా ఉంచి, నడకుదురు బాటలో గత రెండు వారాలుగా మురుగు మట్టి దిబ్బలని తొలగించి చదును చేసిన ఐదారుగురు మట్టి పని కార్యకర్తలే ఈ వేకువ మూడు నాలుగు చోటుల్లో ముప్పై కి పైగా రంగురంగుల గద్దగోరు పూల మొక్కల్ని  నాటి వచ్చారు.

            పార్కులోని ముప్పై నలభై మంది ఉషోదయ పాదచారులు, శారీరక వ్యాయామకారులు, క్రీడాకారులు మాట వరసకైనా స్వచ్ఛ కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించవద్దా? ఈ 2 ఎకరాల పార్కు స్థిరీకరణ/సుందరీకరణలకు ఎన్నిమార్లు - ఎంతగా ఈ కార్యకర్తలు శ్రమించారో మరువదగునా? 9 ఏళ్ల స్వచ్ఛ - సుందర చల్లపల్లి పౌరుల స్పందన సైతం అన్ని ఇతర గ్రామాల్లో వలెనే ఉండవలెనా?

            పార్కు చిన్న గేటు ఎదుటి పెద్ద అందమైన పూల మొక్కను మరింత సుమ - సుందరంగా మార్చే దీక్షలో ముగ్గురు రైతు కార్యకర్తలు సమయపాలన పట్టించుకోనందు వల్ల కాస్త ఆలస్యంగా - 6.35 కు బంకు ఆవరణలో జరిగిన సమీక్షా సభలో కోమలానగర  పౌరుడు గోళ్ల విజయకృష్ణ కాస్త హాస్య స్ఫోరకంగా - మూడుకు బదులు నాలుగు మార్లు ప్రకటించిన స్వచ్ఛంద శ్రమదానోద్యమ సాంప్రదాయక నినాదాలతోను, కార్యకర్తలందరి సంతృప్తిని వెల్లడించిన DRK గారి ముక్తాయింపు మాటలతోను నేటి శ్రమ వేడుకకు స్వస్తి!

            రేపటి రేపు సైతం మన పరస్పర అభివాద స్థలి బెజవాడ బాటలోని ఇదే ఇంధన నిలయం!

            నా ప్రణామం -183

అడుగడుగునా హరిత వనములు - అణువణువునా స్వచ్ఛ దీప్తులు

భావితరముల భద్రతకు తగు బాట పరచే భవ్య ఊహలు

గల సమగ్ర గ్రామ ప్రగతికి కార్యసాధక ధర్మవీరులు

ఇట్టి శూరులు - ఇంత ధీరులు ఎక్కడున్నా మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   29.12.2022.