2636* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రమ వేడుక వరుస సంఖ్య 2636*

            30.12.2022శుక్రవారం నాటికి పని దినాల సంఖ్య అది! (గంటల్లో కొలిస్తే ఎన్ని లక్షలౌతుందో మరి!) తొమ్మిదేళ్ల కాలంలో అడుగడుగునా నిలువెత్తు స్వార్థం వికటాట్టహాసం చేస్తున్న సమయంలో తమ సొంతానికి కాక-ఊరు ఉమ్మడి సౌఖ్యం కోసం వేకువ 4.00 నుండి 2 గంటల పాటు పాతిక ముప్ఫై నలభై మంది ఈ భూగోళం మీద ఒకానొక పల్లెలో కొనసాగిస్తున్న శ్రమ సంస్కృతి ఎంత అపురూపమైనదో ఆలోచిస్తుంటే నిబిడాశ్చర్యం కలగదా?

            హిమపాతం తల మీద టోపీల్నీ, బట్టల్నీ తడిపేస్తుంటే మురుగు కాల్వల అంచున ధూళి దూసర వీధుల్లో దూషణ భూషణ తిరస్కారాలను లెక్క చేయక ఎంచుకొన్న లక్ష్యం కోసం ఒక 28 మంది సమూహం యొక్క శ్రమ జీవన సౌందర్యాన్ని ఎవరు వర్ణించగలరు? నిత్యం సదరు శ్రమ వైభవాన్ని చూస్తూ- చేస్తూ అనుభూతి చెందే- వ్రాసే నాబోటి వాళ్లూ, ఎంతెంత దూరంలో ఉన్నా శ్రద్ధగా చదువుతూ ఈ సార్థక శ్రమదానంతో మమేకమౌతున్న కొందరు ఆలోచనాపరులు హార్దిక సహకారులూ ఈ స్వచ్చోద్యమాన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు!

            ఈ 2636*  వ నాటి ఒక ముఖ్య విశేషం ప్రాతూరి శంకర శాస్త్రి గారి శతదినానంతర పునరాగమనం! ఇలాంటి జన్మతః సామాజిక స్వచ్చ కార్యకర్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా అది భౌతికంగానే తప్ప - వాళ్ళ అంతరంగాలు మాత్రం చల్లపల్లి స్వచ్చ- సుందరోద్యమం తోనే! ఇది వినా ఆత్మ సంతృప్తి దాయకం వాళ్ళకు మరొకటుండదు మరి!

            జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమ చిత్రాలుండగా, వ్యాఖ్యానాలుండగా- మళ్లీ నేను ఒక్కొక్కరి పనిని విశ్లేషించి, వివరించనేల? మనసున్న వారికి ఆ చిత్రాలే- అందులో కార్యకర్తల పని భంగిమలే- ఎన్ని విశేషాలనైనా చూపుతాయి- అందుకొనే వాళ్ళకు స్ఫూర్తినీ ఇస్తాయి!

కనుక ఆ చిత్రాల + నా ప్రత్యక్ష సాక్ష్యం ప్రకారంగా:

1) ఇంధన శాల విద్యుదుప కేంద్రాల – NTR పార్కుల ప్రదేశమే ఈ వేకువ కూడ స్వచ్చ కార్యకర్తల శ్రమ స్థలంగా నిలిచింది. బెజవాడ రోడ్డు కేంతక్కువని? ఇటు ప్రయాణికులూ, స్థానికులూ, అటు టీ కొట్ల మత్స్య విక్రయ దారుల కొనుగోలు దారుల నిర్లక్ష్యం కలిస్తే ఎన్నెన్ని రకాల నిరుపయోగ - ప్రమాదకర కాలుష్యాలు ప్రోగుబడవు? 20 కి పైగా కత్తుల దంతెల చీపుళ్ల వాళ్ళకు చేతినిండా పనే పని!

2) పార్కు బైటి ప్రధాన ప్రవేశం దగ్గరి చెట్ల సుందరీకర్తలు - వాళ్ల నిచ్చెనతో, కట్టర్లతో గంటన్నర కు పైగా శ్రమే శ్రమ!

3) ఇక్కడికి దూరంగా - పురిటిగడ్డ దిశగా - ఖాళీలు ఎంచుకొని, 23 పాదులు త్రవ్వి, గద్ద గోరు పూల మొక్కల్ని నాటిన నలుగురైదుగురి కార్య దీక్ష మాత్రం తక్కువా?

            కాఫీ వేళ ముచ్చట్లు ముగిసి, బంకు ఆవరణలో జరిగిన సమీక్షా సభలో శంకర శాస్త్రి గారి పునరాగమనాన్ని కార్యకర్తలు స్వాగతించి స్వచ్చ సుందరోద్యమ నినాదాల్ని పునరాగంతకుడు  పలికి తన అహ్మదాబాద్ 3 నెలల ఉనికినీ అనుభవాల్నీ ప్రస్తావించి, నేటి శ్రమదానాన్ని DRK గారు విశ్లేషించి 7.00 కు గాని అందరూ గృహోన్ముఖులు కాలేదు.

            ఉదయ శంకర శాస్త్రీయ 5000/- విరాళాన్ని అందరూ సహర్షంగా కృతజ్ఞతా పూర్వకంగా స్వాగతించారు.

            రేపటి మన ఉషోదయాత్పూర్వ శ్రమ వేడుక సైతం ఇదే పెట్రోలు బంకు నుండే మొదలు పెడదాం!

            నా ప్రణామం -184

కృతజ్ఞతకే స్థానముంటే నిజాయతీనే గౌరవిస్తే-

స్వార్థ రహిత శ్రమకు ఇంకా స్థానముందని నిరూపిస్తే-

ఈ సుదీర్ఘోద్యమ స్ఫూర్తితొ ఎవ్వరైనా ముందుకొస్తే ...

అట్టి వారికి స్వగంతాంజలి! అమేయంబగు తొలి ప్రణామం !

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

30.12.2022.

ఉదయ శంకర శాస్త్రీయ 5000/- విరాళాన్ని అందరూ సహర్షంగా – కృతజ్ఞతా పూర్వకంగా స్వాగతించారు.