2637* వ రోజు... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2022 వ సంవత్సరాంతపు శ్రమదాన ఉత్సాహం - @2637*

          శనివారం వేకువ ఆ ఉత్సాహం 4.22 కే ప్రారంభమైందనడానికి సాక్ష్యం వాట్సప్ తొలి సామూహిక చిత్రమే! ఔత్సాహికులు మొత్తం 31 మంది కొద్ది మంది ట్రస్టు కార్మికులతో సహా! వీళ్ల కర్మక్షేత్రం ప్రధానంగా బెజవాడ రహదారే గాని, ఐదుగురు మ(గ)ట్టి పనివాళ్ళు మాత్రం నడకుదురు దిశగా - దూరంగా వెళ్లి వచ్చారు!

          తమ ఊరి కోసం జరిగే ఈ సుదీర్ఘ శ్రమదానానికి హద్దులూ - పరిమితులూ ఏవీ ఉండవని స్వచ్ఛ కార్యకర్తలేనాడో తేల్చేశారు కంపు గొట్టే మురుగ్గుంటలు కావచ్చు, పంట కాల్వలు కావచ్చు, బోసిపోయే 7 రహదార్లూ, ఊరి ముఖ్య వీధులూ, పబ్లిక్ స్థలాలూ, పెట్రోలు బంకులూ, దురాక్రమిత వీధి మార్జిన్లూ...

          కాదేదీ శ్రమదానాని కనర్హం....అని అడుగడుగునా ఋజువు పరుస్తూనే ఉన్నారు. రోడ్ల గుంటల అసౌకర్యమో, తాము పెంచిన ఉద్యానాల సౌందర్యలోపమో, బస్ ప్రాంగణ పచ్చదనాల కొరతో... ఏదో ఒకటి వాళ్లని 9 ఏళ్లుగా – ‘త్వరగా వచ్చి సరిదిద్దమనిచప్పట్లు కొట్టి పిలుస్తూనే ఉంటుంది! (ఐతే సదరు చప్పట్ల చప్పుళ్లు 30 - 40 మంది చెవులకు మాత్రమే వినిపిస్తుంటాయి - వేలకొద్దీ గ్రామస్తులకు కాదు!) ఇక వాళ్ల శ్రమకు విరామ మెక్కడో?

2637* వ వేకువ సమయాన కార్యకర్తల శ్రమ నిర్వాక మేమంటే:

- అంతకు ముందెక్కడెక్కడ ఏ పాటుపడి, ఏవి చక్కబెట్టారో గాని, నేను చూసేప్పటికి - మాత్రం సుందరీకరణ బృంద పంచకం పెట్రోలు బంకుకూ - బెజవాడ బాటకూ నడుమ బరువు రాళ్లను క్రమబద్దీకరించి, వాటి అడుగున పేరుకున్న మురికిని వదలించి, కంట్లో నలుసులా వికృతంగా ఉన్న పరిస్థితిని చక్కదిద్దారు.

- రోడ్డుకు తూర్పున విద్యుత్ ఉపకేంద్ర ప్రవేశ ద్వారాన్ని 6.00 తర్వాత ఒక్కమారు చూడండి - ఎగుడు దిగుళ్లు సర్దుకొని, చిన్న కాగితం ముక్కైనా కనిపించని స్వచ్ఛత ఎలా సాధ్యపడింది? ఇద్దరు కార్యకర్తల గంటన్నర శ్రమ వల్లనే!

- రహదారి పడమరగా - ఒక మహానుభావుడి ఆక్రమణలో రెండేళ్లుగా ఉన్న జాగాలో ఎన్నెన్ని ప్లాస్టిక్లు, ఎంతరోత! అవన్నీ మరో నలుగురి కార్యదీక్షతో శుభ్రపడినవి. 

- ఇదే బాటలో పనిలో పనిగా ఒక డ్రైను మురుగును ముందుకు కదిలించడం, డిప్పల కొద్దీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాల్ని ఏరి, ఊడ్చి ట్రక్కులో నింపుకోవడం....

          అలా నేటి శ్రమదాన ప్రస్థానం కోమలానగర్ సగం దాక పోయింది. కొసరుగా చిన్న వీధుల కొంత భాగమూ బాగుపడింది!

          నేటితో నడకుదురు రోడ్డుకు స్వచ్ఛ కార్యకర్తల సేవలు నెలకు పైగా జరిగి, సంతృప్తికరంగా ముగిశాయి. 60 కి పైగా గద్దగోరు పూల మొక్కలు కూడ నాటారు.

          కాఫీ కాషాయ - కబుర్ల వేళ ఒక ముసుగుదాత కార్యకర్తలకు పంచిన చెవి క్లిప్పులుతగ్గినందు వల్ల వీలుచూసుకొని మరొకమారు ఒసంగబడునని వివరించారు!

          చల్లపల్లినీ, పరిసర గ్రామాలనూ తన నర్సరీ పూల మొక్కల్తో సుందరీకరిస్తున్న తాతినేని వేంకట రమణ స్వగ్రామ శుభ్ర సౌందర్య ప్రద నినాద కర్త!

          కొంగ్రొత్త ఏడాదిలో చల్లపల్లి ఊరి స్వచ్ఛ - సౌందర్య శోభ మరింత పెరగాలనీ, అందుకు గ్రామస్తుల సహకారం లభించాలనీ కోరుకొందాం.

          నూతన సంవత్సర శ్రమదాన వేడుకను రేపు ఉదయం బందరు జాతీయ రహదారిలో Twills షోరూం దగ్గర జరుపుకొందాం!

            నా ప్రణామం -185

ఈ విశాల క్లిష్ట గ్రామం ఎలా ఉన్నదొ ఇతః పూర్వం!

ఇప్పుడది సర్వాంగ సుందర హృదయ రంజక శుభాదర్మం!

ఎంత శ్రమతో - నిబద్ధతతో ఎందరెందరి కృషితొ సాధ్యం?

అందుకే ఈ స్వచ్ఛ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   31.12.2022.