2638* వ రోజు... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

క్రొత్త ఏడాదిలో స్వచ్ఛ సుందరోద్యమ (శ్రమ) వేడుక - @2638*

            వారం, నెల, సంవత్సరం (ఆది, జనవరి, 2023) - అన్నీ కాలం కొలతల్లో మొదటివే! చల్లపల్లి శ్రమదాన ఉత్సాహం కూడా అందుకు తగ్గట్లే క్రొత్త ప్రాత కార్యకర్తలతో కళకళలాడింది ! నేటి పారిశుద్ధ్య రంగస్థలం బందరు జాతీయ రహదారిలోని భగత్సింగ్ వైద్యశాల, అమరావతి రాజప్రాసాదము, కుడి ఎడమలుగా సజ్జా వారి, మునసబు వీధులు!

            నేటి 43 మంది కార్యకర్తలు 3 విధాలు - 4.19 కీ, 5.00 లోపూ చేరుకొన్న వారు సుమారు 30 మందైతే -  మిగిలినవారు అతిధి పాత్రధారులు, అల్పాహార దాతలు వగైరాలు! వీరుకాక - ఊరి దైనందిన పారిశుద్ధ్య శ్రమ/ సమయదాతలు, పోషకులు, వీరాభిమానులు ఏ 200 మందో ఉంటారు! దేశ - విదేశాల్లో ఈ చల్లపల్లి మెరుగుదలను పట్టించుకొనేవారూ వందల సంఖ్యలోనే!

            అదీ ఈ ఊరి అదృష్టం! ఈ ఊరి స్వఛ్ఛ - సుందరోద్యమ బలం, బలగం అంతటిది! ఈ చెట్టు వేళ్లు అంతలోతైనవీ, గట్టివీ! 9 ఏళ్లైనా ఈ నిస్వార్ధ శ్రమదాన వృక్షం ఆకులు వసివాడ లేదంటే చిగిర్చి, పుప్పిస్తున్నదంటే -దాని మూలాలు అంత పటిష్టంగా ఉన్నవన్నమాట! ఇప్పటికీ ఈ శ్రమదానం విలువ తెలియని గ్రామస్తులు గాని, అతిథి అభ్యాగతులు గాని ఏ రోజు వేకువ వచ్చి చూసినా ఇంత సజావుగా, సజీవంగా, సృజనశీలంగా అది కొనసాగుతూనే ఉంటుంది!

ఆంగ్ల సంవత్సరాదిన కార్యకర్తల శ్రమ వైఖరులు, వీధుల మెరుగుదలలూ ఎలా ఉన్నవంటే -

A) వంద గజాల జాతీయ రహదారీ, దాని ఉత్తర దక్షిణ భాగాల పిచ్చిమొక్కలకు మూడి పనికిరాని గడ్డికీ, తీగలకూ ఆయువు తీరి, ట్రాన్స్ఫార్మర్ల లోతట్టు జాగాలు కూడ శుభ్రపడి అసలే కేంద్ర ప్రభుత్వం చలవతో దర్శనీయంగా ఉన్న వీధి మరింత సుందరతరంగా మారడం;

B) సజ్జా వారి వీధిలో కొంత భాగం - ఏడెనిమిది మంది శ్రమతో ఇంకాస్త కళాకాంతులు సంతరించుకోవడం, వీధి మొదట ఎవరో పుణ్యం కట్టుకొన్న కసవు గుట్టకు మోక్ష ప్రాప్తీ;

C) మునసబు గారి వీధిలో 50 గజాల దాక - నాల్గు చెట్ల సుందరీకరణ, డ్రైను పూడిక తొలగింపు;

D) పై చర్యలతో పుట్టుకొచ్చిన వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టర్లోకి ఎక్కించి, చెత్త కేంద్రానికి చేర్చుట;

 

            స్వచ్ఛ కార్యకర్తల నవోత్సాహంతో గంటన్నరకు పైగా సమయం ఇట్టే కర్పూర కదళికలా కరిగిపోయి, 6.25 వేళ గంధం వేంకేటేశ్వరావు పక్షాన విశ్రాంతోపాధ్యాయిని రాయపాటి రమ గారు గ్రామ స్వచ్ఛ సౌందర్య సాధక నినాదాలను విస్పష్టంగా ప్రకటించి

స్వచ్చోద్యమ ఆస్థాన వాగ్గేయకారుడు అర్థవంతమైన గీతాలాపన చేసి

మండవ బాలవర్ది మహాశయుడు (- మామూలోడు కాదు - నాగాయలంకలో సంచలన స్వచ్ఛ సుందరోద్యమ ప్రారంభ - ప్రవర్తకుడు!) చల్లపల్లి కార్యకర్తల్ని ఉత్తేజపరచి

రాయపాటి రాధాకృష్ణ రమా దంపతులు 5000/- స్వచ్చోద్యమ విరాళమూ,

పల్నాటి అన్నపూర్ణ తన సోదరుడు నరహరిసెట్టి ఆర్జున సారధి (- కైకలూరు నివాసి) తరపున 500/- చదివింపూ,

కస్తూరి వర ప్రసాదుని 1200/- కైంకర్యమూ,

తనిది కాని - ఎవరో తన మిత్రుని పనుపున వేముల షణ్ముఖ శ్రీనివాసుని 500/- వితరణా,

            ఇక పై విశేషాలు కాక - అనూహ్యంగా - అల్పాహారం పేరుతో గంధం వేంకటేశ్వరుడు 3 రకాల తినుబండారాల్తో తలా ½ కిలో బరువు పెంచిన వైనమూ....

            గోళ్ల వేంకటరత్నం, ప్రాతూరి శాస్త్రి/గోపాలకృష్ణుల తీపి వస్తువుల పంపిణీ....

            ఇలా నూతన - 2023 సంవత్సరాదిలో చల్లపల్లి శ్రమదానోద్యమంలో ఎన్నో విశేషాలు!

            బుధవారం నాటి - వేకువ వీధి సౌందర్య కృషి కూడ బందరు రహదారిలోని Twills షోరూం దగ్గర నుండే మొదలగును!

                        నా ప్రణామం -186

సచ్ఛరిత్రుడు కర్మవీరుడు స్వార్ధరహితుడు - గ్రామ విహితుడు.

నిబద్ధతతో - జాగృతులతో - హృదయ పరివర్తనకు ఆద్యుడు

స్వచ్ఛ సుందర - కలల గ్రామం సొంతదారుడు మహాశక్తుడు

ఇట్టి శూరుడు - ఇంత ధీరుడు ఎక్కడున్నా మా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   01.01.2023.