2639* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

క్రొత్త ఏడాదిలో మరొక రోజు శ్రమదానం - @ 2639*

            ఆంగ్ల సంవత్సరం రెండో నాడు - సోమవారం వేకువ 4.30 కే 1+3 కార్యకర్తలు శ్రమదానం మొదలు పెట్టారు. అదేమో ఊరికి ఉత్తరాన శ్మశానంలో! శ్రమజీవుల చతుష్టయంలో తొలి వారు - 100 రోజుల ఎడంతో గుజరాత్ నుండి స్వచ్చోద్యమ చల్లపల్లి పునః ప్రవేశకుడు.

 ‘మంచు సోనల నడుమ అంత చీకటి వేకువలో వీళ్లకేం పనిఅంటే - వెంటనే రెండు ప్రశ్నలు పుట్టుకొస్తాయి

1) చిల్లలవాగు గట్టు దగ్గరి శ్మశానం స్వచ్ఛ కార్యకర్తలు నెలల తరబడీ శుభ్ర - సుందరీకరించినదీ, చల్లపల్లికీ చెందినది కాదా?                                                                                           

2) స్వగ్రామ వైభవానికి కంకణ బద్ధులైన స్వచ్ఛ కార్యకర్తలకూ - అందులో ఐదారుగురు ప్రత్యేక దళానికీ ఇది శ్మశానం - అది మురుగు గుంట..అనే నిషేధం ఏముంది?

            ఊరి వీధులన్నీ - పబ్లిక్ స్తలాలన్నీ- అస్తవ్యస్త రహదారులన్నీ వాళ్లేనాడో తమ సొంతమనుకొన్నారు - కేవలం మెరుగులు దిద్దేందుకు! అసౌకర్యాల్ని హరిహరించి, ఆహ్లాద వాతావరణాన్ని పరికల్పించి, అందుకు నిరంతరంగా - నిర్నిబంధంగా పరిశ్రమించడం తమ బాధ్యతనుకొన్న కార్యకర్తలకు ఏ చోటూ - ఏపనీ నిషిద్ధం కాదు!

ఈ వేకువ వాళ్లకు శ్మశానంతో ఏం పని బడిందంటే :

- ప్రతి దినమూ తమ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా వాళ్లు డిప్పల కొద్దీ ఖాళీ మద్యం సీసాలను ఏరి, రుద్రభూమిలో భద్రపరుస్తుంటారు. అలా ప్రోగుపడ్డ గాజు సీసాల గుట్టను ట్రక్కులో నింపుకొని, 34 కిలోమీటర్ల దూరంలోని - పెదకళ్ళేపల్లి మార్గంలోని ప్రభుత్వ సారా దుకాణం దగ్గరకు చేర్చడమే నేటి కార్యకర్తల పని!

            6.40 కి మళ్లీ గస్తీగదికి చేరుకొని - భోగాది వాసు నినదించిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటి, నేటి తమ కృషికి స్వస్తి పలికారు!

      

            నా ప్రణామం -187

హరిత సుందర ప్రకృతి లేనిచొ ఎండమావే గ్రామ సౌఖ్యం

ఎడద స్వచ్ఛత - వీధి శుభ్రత - ఇవే ఆరోగ్యపు రహస్యం

అందుకే ఏడెనిమిదేళ్లుగ స్వచ్ఛ - సుందర ఉద్యమం

నిర్వహించిన కార్యకర్తకు నిండు హృదయంతో ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   02.01.2023.