2640* వ రోజు.............

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

7 x 1 ½  = 10 పని గంటల కాయకష్టం! - @2640*

            మంగళవారం 3.1.23 వ నాటి వేకువ 4.30 నుండే వారి - ముఖ్యంగా ఐదుగురి కఠినతర శారీరక శ్రమ మొదలయింది! అది చల్లపల్లిలో కాక పొరుగూరు - రామానగరం - బందరు రహదారి ఉత్తరాన - స్రవంతి హోమ్ ఫుడ్స్ వీధిలో జరిగింది.

            అక్కడి ప్రధాన వీధీ, ఉప వీధి మొదట్లోనూ ఎవరు కాస్త నిదానించి శ్రద్ధగా చూసినా, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు భరింపరానివిగానే ఉన్నాయి. ఇక - స్వచ్ఛ కార్యకర్తలా అస్తవ్యస్త అనౌచిత్య - కాలుష్య భారాన్నెలా సహిస్తారు? వాళ్ల చూపు పడినప్పుడిక ఆ వీధి భాగం మెరుగు పడక ఏమౌతుంది?

            పాదచారులుగా పరామర్శకులుగా ఇద్దరం 5.10 కి అక్కడికి చెరుకొనేప్పటికే రెస్క్యూ టీమ్ చీపుళ్లతో, కత్తులతో, కొండొకచో వట్టి చేతులతో అక్కడి కసవు గుట్టల మీద పిచ్చి - ముళ్ళ మొక్కల మీద ఏక మాత్ర వాడకానికి పరిమితమయ్యే ప్లాస్టిక్ వస్తువుల మీద ఎంగిలాకుల మీద తడాఖా ప్రదర్శిస్తున్నది.

            సీనియర్ సిటిజన్అనదగ్గ ఒక రైతు కార్యకర్త గొంతు నొప్పి - దగ్గు ఆయాసంతోనే పైన చెప్పిన పనులు చేస్తున్నాడు!

            ఆల్ రౌండర్అనే ముద్ర పడిన ఇంకొకాయన ట్రక్కు పైకెక్కి, కత్తి - గొడ్డలి ఉపయోగించి, అక్కడి బాత్ రూమ్ గోడను బద్దలు కొడుతున్న రావి చెట్టును కూకటి వేళ్లతో పెకలించి ఆ గోడ రక్షకుడైపోయాడు!

            అసలా ఐదుగురి పని సమన్యయం, అంకితభావం, సమయ స్పృహ, ప్రణాళిక.. నేను ఈ కాస్త జాగాలో ఎలా వ్రాయగలను? వాళ్ళదీఊరు కాదు, వీధీ కాదు, జీతభత్యాలూ లేవు, కనీసం ఆ వీధి మనుషుల సహకారమూ లేదు! ఎందుకిలా చలిలో మంచులో - దుమ్ములో ఈ వేకువ వేళ శ్రమిస్తుంటారనేదే గ్రామస్తులు ఆలోచించదగిన సంగతి!

            తమ విధి పూర్తయ్యాక - 6.45 కు యధాప్రకారం 2640* రోజుల దీక్షనూ, తదుద్దేశ్యాన్నీ ప్రకటిస్తూ నినాదాలు కస్తూరి శ్రీనివాసరావు ద్వారా పలికి నేటికి పని ముగించారు!

            ఇద్దరు సీనియర్ కార్యకర్తలం రామానగరం వీధుల్లో పరిశీలనగా తిరుగుతున్నప్పుడు మూడు వీధులూ అందులో ముఖ్యంగా చిరుమామిళ్ళ వారి వీధి అందులో పరిశుభ్రంగా, పొందికగా నిర్వహింపబడుతున్న మానస హాస్పిటల్నూ గమనించాము.    

            రేపటి వేకువ మన విసృత శ్రమదానం కోసం ఎదురుచూస్తున్న చోటు బందరు రహదారిలోని ట్విల్స్వస్త్ర దుకాణ ప్రాంతమే!

            నా ప్రణామం -188

గ్రామ బాధ్యతలన్ని తలపై కట్టగట్టుక మోయడానికి

ప్రజామోదం పొందడానికి - సజావుగ కథ సాగడానికి

ఎన్ని యత్నా - లెన్ని యుక్తులు - ఎన్ని త్యాగాలెన్ని బాధలో

అనుభవించిన - రాటుదేలిన - స్వచ్ఛ సైన్యానికి ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   03.01.2023.