2641* వ రోజు................

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

బందరు రహదారి మెరుగుదలలోనే 28 మంది! - @2641*

            ఈ సంగతి 04-01-23 (బుధవారం) నాటిది. ఇది వేకువ 4.17 మొదలు 6.11 దాక – SRYSP జూనియర్ కాలేజ్ నుండి తూర్పు రామాలయం వరకు జరిగింది! వీధి మార్జిన్ల చదును, ఆకర్షణీయతలే లక్ష్యంగా - చీపుళ్ళో, గొర్రులో, డిప్పలో అవసరాన్ని బట్టి వాడుతూ - అందరిదీ కలిపి ఏ 50 పనిగంటలో చేసిన ప్రయత్నం!

            కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదార్ల - బైపాస్ మార్గాల సమన్వయంలో భాగంగా ఈ రహదారి అన్ని హంగులూ తెచ్చుకొని, ఇప్పటికే చూడముచ్చటగా ఉన్నది గాని, డివైడర్ల గీతలతో - పాదచారణ రేఖలతో క్రొత్త అందం ఉట్టిపడుతున్నది గాని, రోడ్డు మార్జిన్ల పటిష్టత కోసం ఎర్ర - గట్టి - మట్టి పరిచారు గాని, ఇంత మంచి సువిశాల రహదారి పైన రోజువారీగా పడే దుమ్ము ఇసుక చెత్త పేడ - ప్లాస్టిక్ ల సంగతేమిటి?

            నిత్యకృత్యంగా సాగే ఊరి ముఖ్య వీధుల శుభ్ర - సౌందర్య హత్యకు పరిష్కారమేదంటే - అటు పంచాయతీ కార్మికుల విధులూ ఇటు స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానమే కదా! ఇప్పటికి 9 ఏళ్లుగా నడుస్తున్న స్వచ్చోద్యమం ఆగిపోతే - ఈ అందమైన హరిత - పుష్ప ఆహ్లాదకర దృశ్యాలు ఏం కావాలి?

            ఏ వార్డుకావార్డు వీధుల శుభ్ర - సుందరీకరణకు సదరు ప్రాంతపు ఎన్నికైన ప్రజా ప్రతినిధులూ, ఎన్నుకొన్న స్థానికులూ పూనుకోవద్దా? ఒక బృహత్తర యజ్ఞంగా నడిచే ఈ ఊరి స్వచ్ఛ - సుందరోద్యమానికి వాళ్లంతా క్రియాశీలంగా మద్దతు తెలపవద్దా? నేటి కార్యకర్తల సమీక్షా సభ జరిగిన చోట రహదారి భద్రతకు అభ్యంతరకరంగా ఏర్పడిన శాశ్వత పటిష్ట మెరకను ఎవరు పట్టించుకోవాలి? ఎప్పుడు ప్రశ్నించాలి?

            స్వచ్ఛ కార్యకర్తలదేముంది 2641* రోజుల్లాగా వాళ్ల నిరంతర శ్రమదానం గ్రామ సమాజానికి సమర్పితమౌతూనే ఉంటుంది. నేటి శ్రమదానం వివరాలేమంటే :

1) 1 వ వార్డు ప్రవేశం దగ్గర్నుండి సజ్జా వారి వీధి వైపూ, తూర్పు దిశగానూ వీధి మార్జిన్లను చదును చేసి, మెరుగు పరచడం;

2) అమరావతి జమిందార్ల వైజయంతంబారునా, బాటకు దక్షిణం గాను డజను మంది శ్రమదాతల ప్రయత్నాలూ,

3) మరొకమారు 10 మంది కర్మల భవనం ప్రక్కన, ఎదుటి మునసబు వీధిలోనూ శ్రమించడం;

4) రిలయన్స్ మాల్ నిర్మాణం దగ్గర, ప్రక్కన నర్సరీల దగ్గర మరి కొందరి శ్రమ సమర్పణం.....

            6.30 పిదప - ఒక ప్రక్క DRK గారి దైనందిన శ్రమ సమీక్షానందమూ, మరో వంక వేముల శ్రీనివాస ఉపాధ్యాయుని గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ సంకల్ప నినాదాలూ, చెక్ పోస్టు రావు గారి 520/- విరాళమూ, ఉసిరికల - షణ్ముఖ శ్రీనివాసుల వారి జామ - రేగు పండ్ల పంపకమూ ముగిసి, 6.50 కి గాని, కార్యకర్తలు స్వగృహోన్ముఖులు కాలేదు!

            రేపటి శ్రమదాన బాధ్యత కోసం మనం ఇదే బందరు రహదారిలో ఇదే ట్విల్స్దుకాణం వద్దనే కలుద్దాం!

                        నా ప్రణామం -189

ఇది - ప్రజాసేవనుటే విచిత్రం! గ్రామ హితవను టొక ప్రహసనం!

రోడ్లు ఊడ్చే - మురుగు తోడే రోత పనులన్నీ ప్రచారం....

అని విమర్శించే జనానికి అనతి కాలంలోనె బదులిడి

అదే మార్గంలో జ్వలించు మహాశయులకు నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   04.01.2023.

కోడూరు వేంకటేశ్వరరావు గారి విరాళం