2642* వ రోజు...................

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానేద్దాం!

6-1-23 శుక్రవారపు వేకువ శ్రమ జీవన సార్థక్యం! - @2642*

            సదరు శ్రమైక జీవన మాధుర్యం 27 మంది కార్యకర్తలది! వాళ్ల సామాజిక స్పృహతో శుభ్ర మనోహరమైన గ్రామ భాగం బందరు జాతీయ రహదారిలోను, భారత లక్ష్మి మరదారిలోను మొత్తం 150 గజాల దాక! నేటి శ్రమదాన సందర్శకులు వందల్లో - పాల్గొని సహకరించినావారు ‘O’ మంది! ఒకనాటి ప్రాత కార్యకర్త (హీరో షోరూమ్ సంబంధిత) అర్జా చలపతిరావు తప్ప వాలంటీర్లవి ప్రాత ముఖాలే!

            ఇక 4.14 కే వీధి కాలుష్యాల మీద కత్తులు నూరుతున్న డజను మందీ, గ్రామ గ్రామేతర కార్యకర్తలు 15 మందీ గంటా 50 నిముషాల్లో ఏమేమి సాధించారంటే:-

అవి ముఖ్యంగా 3 విధాలు!

- నాలుగైదేళ్లనాడు ప్రవాస భారతీయ విద్యాలత వైద్యురాలి విరాళానికి తమ వందలాది శ్రమ గంటలు జోడించి, మంచి వసతికరంగా, హరితమయంగా, సుమ సుందరంగా నెలకొల్పిన ఒక కర్మల భవనం వెనుక తట్టు ఉద్యానాన్ని కలుపు తీసి, కొన్నిటి పాదుల్ని సవరించి, ప్లాస్టిక్ గ్లాసుల సీసాల - సంచుల దౌర్భాగ్యాన్ని పరిహరించి, ఒక్కో అంగుళం చొప్పున శుభ్రపరిచిన 12 మంది శ్రామికులూ,

- రాయపాటి వారి ఇంటి ఎదుటా, ‘సజీవమత్స్యవిక్రయశాల ముందరా, గడ్డి చెక్కి, వ్యర్ధాలుంటే తొలగించి, ఎగుడు దిగుడు నేలను చదును చేసి సూర్యోదయానికల్లా అందంగా అమర్చిన సుందరీకర్తలూ,

- వాళ్లు నలుగురైదుగురే గాని, అక్కడ వీధి లైట్లు వెలగని రిలయన్స్ మాల్పడమర వీధిని కొంతవరకు పిచ్చి -  దురదగొండి మొక్కల్ని చాకచక్యంగా తొలగించి, దొరికిన ఖాళీ మద్యం సీసాలను ఏరుకొని, గడ్డిని చెక్కుతూ కష్టించినందుకూ,

- పై రెండు వీధుల్లో, ముఖ్యంగా రిలయన్స్ మాల్ నిర్మాణ సందర్భంగా బాగా మురికి పట్టిన బందరు రహదారిని ఊడ్చిన గజ ఊడ్పు గాళ్లకూ,

- అన్ని రకాల శ్రమలనూ సమన్వయించి, పర్యవేక్షించిన వారికీ...... (న్యాయంగా ఊరు జనులో - వార్డు నివాసులో ధన్యవాదాలు తెలపాలి-) నా కృతజ్ఞతాంజలి!

            ఈ బందరు, నాగాయలంక దారుల శుభ్ర - సుందరీకరణ జరిగే 10 - 15 రోజుల్లోనైనా సదరు గ్రామ విభాగ నివాసులు వచ్చి చేతులు కలుపుతారనే ఆశిద్దాం!

6.10 తదుపరి - కాఫీల, కబుర్ల కాలం పిదప

1) మాలెంపాటి గోపాలకృష్ణ వైద్యుని నెలవారీ స్వచ్ఛోద్యమ చందా 2,000/-

2) వేముల షణ్ముఖ శ్రీనివాసుని రేగు పండ్ల, చెవి క్లిప్పుల పంపకమూ,

3) ఈ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సంచాలకుని నేటి శ్రమ సమీక్షా, ముగిసి, అడపా గురవయ్య సూక్తులు విని, అందరూ ఇంటి దారి పట్టారు!

            మన శ్రమదాన ధారావాహికలో రేపటి ఎపిసోడ్’  బందరు వీధిలోనే - తూర్పు రామాలయ ప్రాంతం నుండే మొదలు కాగలదు!

            నా ప్రణామం -190

చెప్పు కబురు లవెంత సులభమొ - చేసి చూపుట గదా కష్టం!

గ్రామ మంతటి స్వచ్ఛ బాధ్యతకై తపించడ మెంత చిత్రం!

బాధ్యతల బరువులను మోసిన స్వచ్ఛ - సుందర నాయకత్వం!

అమోఘం గద అద్భుతం గద - అందుకే గద నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   06.01.2023.