2643* వ రోజు......................

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానేద్దాం!

స్వచ్ఛ - సుందరోద్యమం ప్రాయం నేటికి 2643* రోజులు!

          శనివారం - 7-1-23 - నాటి ఆ ఉద్యమకారులు 33 మంది! చల్లపల్లిలో 9 ఏళ్ల తరువాత కూడ  అయ్యో పాపం! చదువుకొన్న ఉద్యోగిస్తున్న వ్యాపారిస్తున్న, వయసు మీరి మూలన కూర్చోవలసిన ఇందరు మంచివాళ్లకు ఇదేం ఖర్మ”? ఈ మురికి, మొటు పనులు చేయమని ఎవరు వీళ్లని శపించారు...? అని జాలిపడే అతి మంచి వాళ్లింకా ఉంటే ఉండవచ్చు గాక –

          స్వచ్ఛ కార్యకర్తలు అలాంటి ఆలోచనను ఏనాడో త్యజించారు, తామెందుకిలా మట్టి - పేడ మురుగు - పనులకు దిగారో, తమ లక్ష్యం ఎలా సాధించుకోగలరో - వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఏ వీధి కాలుష్యానికెలా ప్రతీకారం తీర్చాలో, ఏ శ్మశానానికి - పంట/మురుగు కాల్వల దుస్థితికి, రహదారులు - ఊరి వీధుల గుంటలకు పరిష్కారాలేమిటో వాళ్ల దగ్గర ప్రణాళికలున్నాయి!

          కొందరు అమాయక గ్రామస్తుల ఛీత్కార - సత్కారాల్ని తేలిగ్గా అధిగమించిన అనుభవాలు వాళ్లవి! వేవీ లేకుండానే ఈ గ్రామ పారిశుద్ధ్య హరిత - సుందరీకరణం ఇంత సుదీర్ఘంగా ప్రస్థానించిందా? ఆర్థిక, ప్రాకృతిక ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలిచిందా?

          “పాతిక వేల మంది నివసించే - 10 వేల మంది రాకపోకలు సాగించే ఒక ఊళ్లో ఈ వేకువ 4.17 నుండి 6.15 దాక తమ గ్రామ సమాజ శ్రేయస్సుకై శ్రమించింది 33 మందేనా..?అంటే - అది వేరే కథ!

          నేటి శ్రమ సమర్పణ సంగతి కొస్తే: అది చాల వరకు నిన్నటి చోటికే పరిమితమయింది - మరి కాస్త విస్తరింపు - అంతే!

- 15 మంది కూర్చొని, వంగొని కత్తులతో, గొర్రుల్తో, చీపుళ్లతో శ్రమించినా భారతలక్ష్మి వడ్లమర వీధిలో ఇంకొంచెం మిగిలేపోయింది! స్థానికులు కలిసిరానపుడు - వాకిళ్ల ఎదురుగా గడ్డి - పిచ్చి మొక్కలూ తీగలూ బలిసిపోతున్నా పట్టించుకోనపుడు ఇలా జరుగుతుందన్న మాట!

- నిన్న తుడిచిన, చెక్కిన, మట్టి సర్దిన బందరు దారిలోని రిలయన్స్ మాల్ నిర్మాణం దగ్గరే విసుగులేని విక్రమార్కుల్లాగా డజను మంది మహిళలూ, పురుష పుంగవులూ గోకుడు పార కర్రల్తో  బలంగా గోకి, చెక్కి డిప్పల కొద్దీ మట్టిని ఎత్తు పెరిగిన తారు రోడ్డు అంచుల పల్లాల్లో సర్దారు!

          ద్విచక్ర వాహన క్రయ - విక్రయ దుకాణం ఎదుట రెండు ఖాళీ స్థలాలను సంస్కరంచిన శ్రమ మరి కొందరిది!

          ఇలా ఎంత వ్రాసినా నేటి 2 గంటల శ్రమ వేడుక వివరణ తరిగేనా?

          6.35 కు ఉత్సాహ భరితంగా సాగిన పొట్టి సభలో:

          పసుపులేటి ధనలక్ష్మిగారి స్వచ్ఛ - సుందర శ్రమదానోద్యమ నినాదాలూ, గురవయ్య మేటిమాటలూ, ఎక్కడో దావణగెరె’ నుండి వేమూరి అర్జునుల వారు శ్రుతికల పడాలూ, ఐదేళ్ల నాడు కనుమరుగైనా, తన స్మృతులు చెక్కు చెదరని వాసిరెడ్డి వారి సంస్మరణలూ, మళ్లీ మరొక మారు ఉదయ శంకర శాస్త్రీయ పంచ సహస్ర రూప సమర్పణలూ, సూర్యదేవర రాజేశ్వరి గారి 20 వేల రూపాయల హార్దిక సహకార ప్రస్తావనా, నేటి కార్యకర్తల శ్రమ - సమయ త్యాగపుమెచ్చుకోళ్లూ...!

          రేపటి వేకువ మన ద్విగుణీకృత శ్రమ విశేషాలు కూడ ‘హోండా షోరూమ్ ఎదుటి నుండే కొనసాగగలదు!

          వాసిరెడ్డి కోటేశ్వర!

కృతజ్ఞతకు మనుషులందు కొంత స్థలం మిగులు వరకు

సుమనస్కత, సృజనలకూ చోటు కాస్త దొరకు వరకు

అయాచిత పరోపకృతికి ఆదరణ లభించు వరకు

నీ నామం జనంలోన నిలిచి యుండునిది తప్పదు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   07.01.2023.