2644* వ రోజు..............

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానేద్దాం!

2644* (ఆదివారం)నాటి స్వచ్చ స్ఫూర్తి దాయకులు 39 మంది!   

          ఆ 38 మంది స్ఫూర్తి నాకేననుకోండి ! బాగా అడుగంటి పోయిన వేకువ 4.17 సమయపు ఉష్ణోగ్రతలో – ఊరి నలుమూలల్నుండీ- 13 మంది మసీదు ప్రాంతంలో ఊరి బాధ్యతలకు పూనుకోవడమే ప్రేరణ దాయకం!

          అందులో పాల్గొని, 2 గంటలకు పైగా ప్రతి రోజూ ఊరి కోసం (గంటకాలం అనే తొలినాళ్ల నియమం మారిపోయింది మరి)  బందరు రహదారి మెరుగుదలకు ప్రయత్నించిన వాళ్లం సరే- 6.30/7.00 దాక నిద్రలేవని వాళ్లు –  1)ఈ బందరు జాతీయ వీధిని ఇప్పుడైనా వెళ్లి చూడవచ్చు, 2) ‘ జై స్వచ్చ చల్లపల్లి సైన్యం’ మాధ్యమ చిత్రాలైనా చూసి గ్రహించవచ్చు!

          1. సగటు ఆరోగ్యవంతుడైన - వయోధిక లబ్ద ప్రతిష్టుడైన ఒక సీనియర్ వైద్యుడు ఒళ్లు వంచి – చీపురుతో రాళ్ల నడుమ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్నెంత పట్టుదలగా బైటకు లాగుతున్నాడో-   

          2. మరొక దృశ్య (వీడియో) చిత్రంలో డజను మంది కార్యకర్తలు గోకుడు పారల్తో – పలుగుల్తో రోడ్డు క్రొత్త పొర చెడకుండ సీసంలా గట్టిపడ్డ మట్టిని – చేతులు నొప్పి పెడుతున్నా ఆగక – ఎందుకంత పంతంగా గోకి, చెక్కి ఆ మట్టితో రోడ్డు అంచుల్ని పటిష్టపరుస్తున్నారో-

          3. ఆరేడుగురు స్త్రీ – వృద్ధ కార్యకర్తలు చీపుళ్లతో భారత లక్ష్మి వడ్లమర వీధి మొదలు రాజ్యలక్ష్మి  ఆస్పత్రి దాక ఊడ్చి ఊడ్చి ఎంతగా శుభ్రపరుస్తున్నారో –

          4. ఇవి చాలవన్నట్లు కొందరు వాలంటీర్లు మురుగ్గుంటల్లోని ప్లాస్టిక్ పదార్థాల బెడదను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారో-

          5. ఇంత చలిలోనూ ఒకాయన అవసరమైన వాళ్లకు మంచినీళ్ళందిస్తుంటే – మరొక వృద్ధ వైద్యుడు నాణ్యమైన విదేశీ చాక్లెట్లు పంచుతుంటే –

          మరి – ఈ తతంగమంతా చూస్తుంటే – వేకువ 2 గంటల పాటు విధిగా ఊళ్లో జరిగే వింతను పరిశీలిస్తే ఎవరికైనా ప్రేరణ కలగదా?

          6.35 కు చెరువు ప్రక్కన జరిగిన సమీక్షా సభ ఇంకో ఘట్టం! ధ్యాన మండలి కార్యకర్త గోళ్ల వేంకట రత్నం పట్టుదలగా 2 వీధులకు విన్పించేంతగా – గ్రామ స్వచ్చ సుందరోద్యమ సంకల్ప సంకేత నినాదాల్ని ప్రకటించగా-

          కోడూరు వేంకటేశ్వరుని చిన్న బస్తా ఉసిరికల పంపకం జరిగి, ఈ నెలలో, వచ్చే నెలలో ఊరి స్వచ్చ-శుభ్ర ప్రణాళికను చర్చించి,

          7.00 కు గాని – అంటే సుమారు 3 గంటల సమయం గడిచాక గాని – నేటి కార్యక్రమం ముగియలేదు.

          సోమ- మంగళ వారాల ప్రత్యేక స్వచ్చ కార్యక్రమం తర్వాత – బుధవారం వేకువ మన పునర్దర్శనం సూరి డాక్టరు వీధి మొదటిలోనే!   

          నా ప్రణామం – 191

గ్రామ భారం మోయుటన్నా – కశ్మలాలను తరుముటన్నా-

జనుల మనసుల మార్చుటన్నా – స్వచ్చ శుభ్రత పెంచుటన్నా-

పచ్చదనములు నింపి ఊరికి ప్రాణ వాయువు పంచుటన్నా-

అవేం ఆషామాషి పనులా? అందుకే నా తొలి ప్రణామం!  

                          - ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

                                     08.01.2023.