2645* వ రోజు.......... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

విజయ్ నగర్ లో శ్రమదాతల వీర విహారం! - @ 2645*

            ఇది సోమవారం (09.01.2023)-అది విజయ్ నగర్ తొలివీధి వాళ్లు గ్రామ వీధుల శ్రమదానం చేసి - చేసి రాటుదేలిన ఐదారుగురు స్వచ్చ కార్యకర్తలు! వాళ్లకు సంపూర్ణ మద్దతు దారులు ఒక శాస్త్రి, ఒక పశు వైద్యుడు మళ్లీ చూస్తే (ఇద్దరి సగటు వయస్సు 79 ఏళ్లు!) సమయమేమో రాకాసి చలి వేకువ - 4.30!

            ఇక - పుణ్యం పురుషార్థం’- అన్నట్లు ఒక సీనియర్ సామాజిక వైద్యుడు, మరొక విశ్రాంత కళాశాలాధ్యక్షుడు కలిసి చేస్తున్న గ్రామ వీధుల వాహ్యాళి సందర్భంగా 5.00 తరువాత ఆరేడుగురి సామాజిక కర్తవ్య తపస్సుకు వారిద్దరి ప్రత్యక్ష పరిశీలన!

వాకబు చేస్తే తెలిసిన సంగతేమంటే :

- అక్కడొక పెద్ద రాతి ముక్కల ఇసుక- సిమెంటు రద్దుల గుట్ట. అది మాలెంపాటి గోపాలకృష్ణుల వారిది! దాని మీద సర్వ హక్కుల్నీ వదలుకొని, అతడు గ్రామ సౌకర్య వినియోగార్థం స్వచ్చ కార్యకర్తలకు అప్పగించిన వైనం.

- మరి- రెస్క్యూ టీం వాళ్లైనా దాన్నేమీ సొంతానికి వాడుకొనేందుక్కాదు ఊరి మెరుగుదల చర్యల్లో భాగంగా ఆ రద్దు గుట్టను గంటకు పైగా పారల్తో-డిప్పల్తో ట్రక్కులోకి ఎక్కించి, 2 ½ కిలో మీటర్ల దూరాన - నాగాయలంక బాట తూర్పున గల కమ్యూనిష్టు అమరవీరుల స్తూపం ప్రవేశ ద్వారం దగ్గరి పల్లం పూడ్చడానికట!

            వండర్ ఫుల్! అమరవీరులది రేపటి తరం కోసం ప్రాణత్యాగం!

            ఈ స్వచ్చ వీరులది ఇంకాస్త మెరుగైన గ్రామ సమాజం కోసం శ్రమత్యాగం! ఉభయులూ తమ సమకాలానికీ, సమాజానికీ పడిన అప్పును చెల్లించేసినట్లే!

            6.30 తరువాత వేల రోజుల్నుండీ చేస్తున్నట్లే స్వచ్చ కార్యకర్తలు మాలెంపాటి వైద్యునితో కలిసి మరింత మంచి సమాజం కోసం తాము చేస్తున్న శ్రమదాన ఉద్యమాశయాన్ని ముమ్మార్లు నినదించారు! 

                    నా ప్రణామం -192

అయోమయ మని ఏల అనవలె? అసాధ్యం అని ఎందుకనవలె?

జన్మనిచ్చిన ఊరి మేలుకు గంట సమయం ఇవ్వలేమా?

అందరొకటై ఉన్న ఊరును నందనముగా మార్చలేమా?

కార్యకర్తల నిత్య కథ ఇది కనుక వారికి నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   09.01.2023.