2646* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

5+2+1 కార్యకర్తల ప్రమేయంతో రోడ్డు భద్రత - @2646*

            మంగళవారపు (10-1-23) ఐదారుగురి శ్రమదానం మళ్లీ విజయనగర్ తొలి వీధీ, నారాయణరావు నగర్ - గురుకుల పాఠశాల గుంటల రోడ్డుకూ పరిమితమయింది!

            శ్రమదాత లైదుగురూ రెస్క్యూటీమ్ కార్యకర్తలైతే - రోడ్డు మరామత్తుకు కావలసిన రద్దు దాత ఒక విశ్రాంత పశువైద్యుడు - మాలెంపాటి గోపాలకృష్ణ నామధేయుడు! ఇక కార్యక్రమ పర్యవేక్షకుడూ, తనది కాని చల్లపల్లి పరిశుభ్ర సౌందర్యోద్యమానికంకితుడూ - వృద్ధుడు కాని వృద్ధుడూ - ఇంకొక శంకర శాస్త్రి నామకుడూ!

            మరి ఇంత తీవ్ర శీతల వాతావరణంలో - అదీ వేకువ 4.30 వేళ ఈ ఆరేడుగురికి రద్దు దుమ్ము ముఖాలకీ, ముక్కులకీ, కళ్ళకీ అంటుకొంటూ పనిచేసే ఖర్మ ఎందుకు? అసలు వీళ్ల ఈ మంగళవారం వేకువ కాలపు చేష్టలేమిటి?” అని ఆలోచిస్తే :

- నారాయణరావునగర్ గుండా గతుకుల దారి మీదుగా గురుకుల పాఠశాలకు వెళ్లే విద్యార్థులెవరో గుంటలో పడిపోయిన సమాచారం నిన్న ఈ కార్యకర్తలకు తెలిసిందట - (సదరు బాటలోని గుంట ఏ స్థాయిలో ఉందో మన స్వచ్ఛోద్యమ మాధ్యమ చిత్రంలో - భయపడకుండ - చూడండి!)

            విజయనగర్ నుండి ట్రక్కులో నింపుకొని తెచ్చిన రాతిముక్కల మట్టీ - ఇసుకల మిశ్రమాన్ని ప్రభుత్వ పాఠశాల బాటలోని ఒక పెద్ద గుంటను పూడ్చడమే నేటి స్వచ్ఛ కార్యకర్తల బాధ్యతా నిర్వహణ సంతృప్తి! అదే చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమ సందేశ సారాంశం! మరొకమారు ఇలాంటి గట్టి రద్దు దొరికినప్పుడు మిగిలిన గుంటలకు మోక్షం!

            ఈ వేకువ కాలపు స్వచ్ఛ కార్యక్రమ సందేశాన్ని ముమ్మారు చాటి నినదించిన వారు ప్రాతూరి శాస్త్రి గారే!

            బుధవారం నాటి వీధి సుందరీకరణ కోసం విస్తృత సంఖ్యలో కార్యకర్తలు గుమికూడవలసిన చోటు సూరి డాక్టరు గారి వీధి ఆరంభంలోనే!

            నా ప్రణామం -193

అసలిదేమంత కష్టం - అందరూ గానుస్తులొకటై

ఎవరి వీధిని, మురుగు కాల్వను, పాఠశాలను, కాల్వ గట్టును

వంతు లేసుక శుభ్రపరచుట? ప్రజల స్వస్తత ప్రోది చేయుట?

కార్యకర్తల బాట నడచుట? గైకొనుడు నా సత్ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   10.01.2023.