2647* వ రోజు.......... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గ్రామ స్వచ్చ - సుందరోద్యమంలో ఈ నాటిది 2647* వ సుదినం!

            సదరు సుదినం - బుధవారం(11-01-23) వేకువ వేళది; ఆ మంచిరోజు నిర్మాతలు 85 ఏళ్ల గరిష్ట వర్షీయసుడైన శస్త్రకార వైద్యునితో సహా - 27 మందే! రూపుదిద్దుకొన్న భలే మంచిరోజుఇందరు స్వచ్చోద్యమకారుల కాయకష్టం నుండీ, సొంతూరి పట్ల తరగని శ్రద్ధ నుండి పుట్టుకొచ్చినదే! ఈ స్వచ్చ చల్లపల్లిమరింత పరిశుభ్రంగా, ఆహ్లాదంగా, ఆరోగ్య ప్రదంగా అంటే స్వచ్చ సుందర చల్లపల్లిగా రూపాంతరం చెందే వరకూ - ఈ నిరంతర శ్రమదానం ఆగనిదే!

            చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల లక్ష్యం, దీక్ష, సామాజిక స్పృహ ఇన్ని వేల రోజులుగా ఎప్పటికప్పుడు ఋజువౌతూనే ఉన్నది! లేకుంటే - ఇందరు లబ్ద ప్రతిష్ట వైద్యులు, ప్రస్తుత & విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, రైతులు గజగజ లాడించే చలిలో మంచులో - అదీ వేకువ 4.20 నుండి 6.30 దాక వీధుల్లోకి వచ్చి, మట్టి పనులకూ - మురుగు తోడివేతలకూ ఎందుకు పూనుకోవాలి?

            ఇందులో గమనార్హమేమంటే - ఈ నిస్వార్థ కర్మిష్టులు తామేదో చల్లపల్లిని ఉద్ధరిస్తున్నామనో లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నామనో - తమది లోకోత్తర మానవ సేవ అనో భావించక - తాము చేస్తున్నది కేవలం సామాజిక బాధ్యతగా మాత్రమే గుర్తించడం! అందుకు గాను తాము అదృష్టవంతులమని తృప్తి చెందడం!

            కటిక చలి వేధింపుల నడుమ వీధి మురికి పనులకు పాల్పడుతున్న కార్యకర్తలకు చంటి హోటల్ వారు వేడి టీ పానీయమందించి, ఆ యజమానురాలు తన హోదాను పట్టించుకోక - పార పట్టి, చీపురు ప్రయోగించి కార్యకర్తలతో సమంగా మురుగుకాల్వను బాగుచేసి.... చల్లపల్లి స్వచ్చోద్యమం ఒంటరిదేమీ కాదని భరోసా ఇవ్వడం!

- ఇలా లాక్కుంటూ పోతే ఈ వేకువ సమయపు శ్రమదానం నుండి ఎన్ని అర్ధాలైనా వస్తాయి!

            బందరు రహదారికి ఉత్తరపు సూరి డాక్టరు వీధి మొదలు 3 చిన్న వీధులు - యడ్లవారి, షాబుల్ గారి, ఇంకా సంత వీధి దాక - ఏ 200 గజాల మేరకో వెడల్పాటి ప్రధాన వీధి నేటి గంట 50 నిముషాల శ్రమదానంతో పరిశుభ్ర - సుందరంగా మారింది! 3 మురుగు కాల్వలు సైతం కాస్త సంస్కరింపబడినవి. కూరగాయల కొట్లు, పాత ఫర్నిచర్ ఆక్రమణ, పచారీ/ఫాన్సీ దుకాణాల ముంగిళ్లన్నీ చెత్తా చెదారాలు తొలగి, దుమ్ము, ప్లాస్టిక్ వస్తువులు అదృశ్యమై ఏ కొంచెం సౌందర్య లాలస ఉన్న వాళ్లకైనా ఇప్పుడు దర్శనీయంగా, ఆదర్శనీయంగా మారినవి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         మరి - ఇదేమన్నా అల్లాటప్పా సంగతా? 50 పని గంటల శ్రమ! 6. 30 వేళ - సమీక్షా సభలో స్వఛ్ఛ - సుందరోద్యమ నినానాదిలిచ్చింది ఒక సూపర్ సీనియర్ వైద్యుడు - దుగ్గిరాల శివప్రసాదు గారైతే వారి నుండి గ్రామ ప్రయోజ నార్థం ఏ 10 లక్షల ఆర్థిక సహకార వాగ్దానమో రాబట్టినది గ్రామ సర్పంచ్  కృష్ణకుమారి! ప్రాతవి కాక శివ ప్రసాదు గారి నేటి విరాళం ఇంకొక లక్ష!

            ఇంకొక వింత విరాళం కూడా నేటి విశేషం! వేముల షణ్ముఖ శ్రీనివాసుని వితరణ - అదొక క్రొత్తరకం! - అతనికి ఈ ఊరి నిండా కనిపించని మిత్రులుంటారు - వాళ్లేమో ఇతని ద్వారా స్వచ్చోద్యమానికి మాటి మాటికీ తృణమో పణమో సమర్పిస్తుంటారు - అద్దాని నేటి లెక్క అక్షరాల 1300/-!

            రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసిన చోటు సంత వీధి నుండి ATM కేంద్రాల దిశగా!

            నా ప్రణామం -194

ఏది వ్రాసిన - ఎంత పాడిన - ఎంతగా తర్కించి చూసిన

ఎంతగా వర్ణన లొనర్చిన - ఎవరి ఎడదల నడిగి చూసిన

సాటి లేదను సత్యమొక్కటె జ్వలిస్తున్నది - నిలుస్తున్నది

అట్టి స్వచ్ఛోద్యమ చరిత్రకు అందజేస్తా సత్ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   11.01.2023.