2648* వ రోజు.......... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గురువారం (12-1-23) శ్రమదానం కూడ బందరు రహదారిలోనే! - @2648*

          అందలి హద్దులు పోలీస్ స్టేషన్ నుండి ATM కేంద్రం దాక! కాలం కొలతైతే 4.18 నుండి 6.28 నడుమ! అంటే 2 గంటల 10 నిముషాలు! గ్రామ బాధ్యతామూర్తులైన శ్రమదాతలేమో 34 మంది - గరిష్టంగా ! పొందగలిగే వాళ్లుంటే - వాళ్లు పంచిన సామాజిక చైతన్యం కొలమానం లేనంత!

          కార్యకర్తల్లో అత్యధికుల - అత్యంత సమయాన్నీ, శ్రమనూ పొందగలిగింది మాత్రం - దేవాలయాల - దుకాణాల బడ్డీ కొట్ల - టిఫిన్ సెంటర్ల - అంతకన్నా గట్టిగా ATM కేంద్ర ప్రాంతాలే! నిన్నటి శుభ్రపడిన ప్రాంతాల్లోనే ఇంత ఇసుకా? దుమ్మా! అందమైన రహదారి మీద నిన్న రాత్రి వేళకే ఇన్నిరకాల వ్యర్ధాలా? అనరాదు గాని - స్వచ్ఛంద శ్రమదానం కొన్ని నెలల పాటు ఆగిపోతే - ఊరి రహదార్ల శుభ్ర - సౌందర్యాల గతేం కాను?

          రక్షక భట వీధిలోనే కీలక మలుపులోనే - ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా తోపుడు బండ్లు స్థిర పడితే ఇక ఎవరికి చెప్పుకోవాలి? దాని ఎదురుగా టీ - కాఫీ వ్యాపారం వద్ద - ముఖ్యంగా మూలమలుపు మురుగు కాల్వలో మూడు డిప్పల ప్లాస్టిక్ లూ, చెత్తా నిండితే ఎవరిది బాధ్యత? సమస్యల సృష్టికర్తలేమో చోద్యం చూస్తుంటే, అవన్నీ స్వచ్చ కార్యకర్తలే శుభ్రపరుస్తుంటే ఈ ఊళ్లోని వ్యక్తులకు, వ్యవస్థలకు ఎబ్బెట్టుగా ఉండదా?

          అసలివన్నీ ఆలోచించి, ఎవరెవరితోనో తర్కించే వ్యవధి కార్యకర్తలకెక్కడిది? వర్షమైనా, మండే ఎండలైనా, ఇంత చలీ మంచూ కాలమైనా చాతనైనంత వరకు రోడ్డు తుడిచి, రోడ్ల అంచుల్ని పటిష్టపరచి, నిలిచిపోతున్న డ్రైన్ల మురుగులకు సరిగా నడక నేర్పడంతోనే వాళ్ల 2 గంటల సమయం సరిపోయింది!

          ‘ATM’ సెంటర్ మనకు పరీక్ష పెట్టబోతున్నది__” అని కార్యకర్తలు నిన్న అనుకొన్నంతా అయింది. 20 మంది పారల్తో పేవర్ టైల్స్ గోకి, చీపుళ్లతో ఊడ్చి, దుమ్ము దులిపితే గాని గంటకు పైగా కాలాన్ని మ్రింగేసి గాని - ఆరేడు సెంట్ల స్థలం బాగుపడలేదు. అక్కడి రోడ్డు మీద గాని, మెట్ల మీద గాని వాళ్లు ప్రోగేసి, ట్రక్కులోకెక్కించిన దుమ్ము - ఇసుక మళ్ళీ వెంటనే

1)  అమర వీర స్ధూపం దగ్గరా,

2) గురుకుల పాఠశాల గతుకుల రోడ్డు గుంటల్లోకీ సర్దుబాటయింది!

          తక్కిన పనులట్లా ఉంచి 20 నిముషాల పాటు 10 మంది అంత వేగంగా, పోటా పోటీగా, తరగని ఉత్సాహంగా బరువైన డిప్పల్ని మోసి ట్రక్కులో కెక్కిస్తున్న దృశ్యం మాత్రం చిరస్మరణీయం!

          6.40 వేళ - 33 మంది క్రమపద్ధతిలో నిల్చి, ఒక వామపక్షీయుడు - యద్దనపూడి మధు ముమ్మారు చాటి చెప్పిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సంకల్ప నినాదాలను పునః సంకల్పిస్తున్న దృశ్యం మాత్రం తక్కువదా?

          తమ 13 వ వివాహ వేడుక జ్ఞాపికగా మనకోసం మనంట్రస్టుకు 1000/- విరాళం సమర్పించిన గంధం బృందావన - లక్ష్మణలకు స్వఛ్ఛ - సుందరోద్యమ శుభాకాంక్షలు!

          ఒక వంక చలీ మంచుల్నెదిరిస్తూ, రహదారి దుమ్ము దులిపిన, ATM ల ప్రాంగణాన్ని సుందరీకరించిన కార్యకర్తలకు హార్దికాభివందనలు!

          జాతీయ రహదారిలో మిగిలిన కాలుష్యం మీద పోరు కోసం రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసింది మళ్లీ ATM కేంద్రం నుండే!

                    నా ప్రణామం -195

ఏది సత్యం? ఏదసత్యం? ఏది శుభ్రత ఏదశుభ్రత?

ఏది ఋజువో ఏది కపటమొ - ఇన్ని శ్రమదానముల సాక్షిగ

జనం దృష్టికి తీసుకెళ్లిన - జాగృతిని విస్తృతం చేసిన

చల్లపల్లి స్వఛ్ఛ సుందర స్వాప్నికులకే నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   12.01.2023.