2649* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

మడమ త్రిప్పని చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం - @ 2649*

          శుక్రవారం - 13-1-23 నాటి శ్రమదానం రోజుల సంఖ్య అది! నేటి స్వచ్ఛ కార్యకర్తపాత్రధారులు 30+2+1 = 33 మంది! ఇద్దరు పాగోలు గ్రామ సంబంధిత కంఠంనేని స్వచ్ఛోద్యమాభిలాషులు, మరొకరు నినాదాల సమయంలో కలిసి వచ్చిన అనాహూతుడు! నేటి స్వచ్ఛ - శుభ్ర సుందరీకృత రంగస్థలం సంపటాలమ్మ గుడి మొదలు 3 రోడ్ల కూడలి దగ్గరి వినాయకుల వారి గుడి దాక!

          మరి, నికరంగా 30 మంది శ్రామికులు ఇంత చలిలో - వేకువ 4.18 - 6.15 నడుమ ఎవరికేం ఒరగ బెట్టి - ఈ బందరు రహదారి భాగాన్నెంత వరకు ఉద్ధరించారో చూడండి :

1) అది వందలాది భక్తులు దర్శించుకొనే వేంకటేశ్వర దేవాలయం - రేపటి పగలు భక్తులు అక్కడ అన్నదానం చేయబోతున్నారట అందు నిమిత్తం డజను మంది కార్యకర్తలీ వేకువ తలా గంటన్నర సమయ - శ్రమదానాలతో ఆ పరిసరాల దుమ్ము ధూళిని ఊడ్చి, దాని తూర్పు ప్రక్క గుడినీ, హోటల్ ముందు భాగాన నాలుగైదంగుళాల మందపు తడి - పొడి మట్టినీ తొలగించారు.

2) పంచాయతి గ్రంథాలయ మార్గాన్ని కొంత శుభ్రపరచి, దాని ఎలపల - దాపల అంచుల పల్లాలను పూడ్చి మెరుగు పరిచారు.

3) మూసిన మురుగు కాల్వ భాగాలు కాక - మూడు నాల్గు చోట్ల ప్లాస్టిక్ చిత్తు కాగితాల తుక్కుల్ని బైటకు రప్పించారు.

4) ఈ 150 గజాల జాతీయ రహదారిలోనే 15 మంది కార్యకర్తలు గంటన్నరలో ఆశ్చర్యకరంగా ఊడ్చి, ప్రోగులు పెట్టి, డిప్పలతో ట్రక్కు నింపుకొని - అవసరమైన రోడ్ల గంటల పూడికకు తరలించడం మరొక పని.

          ప్రతి దినమూ ఎవరింటిని, ఆవరణను, ఆఖరికి మొఖాలు చూసుకొనే అద్దాల్ని అందరం ఎలా ఊడ్చుకొంటామో - తుడుస్తామో - ఈ ఊరి వీధులన్నీ సొంతం చేసుకొన్న స్వచ్ఛ కార్యకర్తలూ అంతే! తమ ఊరి ముఖ్య వీధులు దుమ్ముకొట్టుకొని, మురికోడుతూ, కళాహీనంగా ఉంటే వాళ్లకి సయించదు మరి! అది వాళ్లకి నామోషీ కాబోలు!

          క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్స్ ఓన్లీ టు గాడ్లీనెస్” (పరిశుభ్రతే పరమాత్మ సన్నిధి) అనే ఆంగ్ల సామెత ప్రకారం - ఇందరు భక్తులూ, గ్రామస్తులూ ఇకముందైనా ఊరి శుభ్ర సుందరీకరణం బాట పట్టగలరని ఆశిద్దాం!

          మట్టినీ పేడనూ - గ్రామస్తులూ, ఈ దుకాణదారులూ బాధ్యతా రహితంగా విసిరే చెత్తా - చెదారాల్ని ఓపికగా - బాధ్యతగా- వేల కొద్దీ రోజులుగా ఊడ్చి - తొలగించిన ఈ స్వచ్చంద శ్రమజీవులకు అభినందనలర్పిద్దాం!

ATM కేంద్రం దగ్గర 6.35 కు ఏర్పాటైన సమీక్షా సభలో:

- గోదావరి జిల్లా తణుకుకు చెందిన - క్రొత్తపాలెంలో పశు సంవర్థక శాఖలో ఉద్యోగిస్తున్న - మన ప్రాత కార్యకర్త శాయిబాబు గారు కొసమెరుపుగా పలికిన స్వచ్ఛ - సుందర సౌభాగ్య నినాదాలూ;

- ఎప్పటికప్పుడు మన గ్రామ భూత వర్తమాన భవితవ్యాల - సౌకర్యాల లెక్కలు తేల్చే ఒక స్వచ్ఛ వైద్యుని హిత వచనాలూ కాక

          పాగోలు గ్రామంలోని 21 సెంట్లలో - లక్షల వ్యయంతో కంఠంనేని వంశస్తులు నిర్మించిన కమ్యూనిటీ - ఫంక్షన్ హాలురేపటి ప్రారంభోత్సవానికి స్వచ్ఛ కార్యకర్తలకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రామబ్రహ్మం, అతని సోదరుడు -

          ఈ 2649* వ నాటి శ్రమదాన సంగతులిలా ముగిసినవి!

          రేపటి వేకువ గంగులవారిపాలెంబాటకు దక్షిణాన కడియాల భారతి గారు సాంప్రదాయంగా నిర్వహించే భోగి పండుగ దగ్గర కలుసుకొందాం!

          నా ప్రణామం -196

ఏళ్ల తరబడి జరుగుచుండే ఇంత స్వచ్చోద్యమ చరిత్రను

వేల దినముల - లక్ష గంటల వినుత శ్రమదానం పవిత్రత

ఐక్యరాజ్యం సమితిలోనూ - విశ్వమంతట వ్యాప్తి చేసిన

సురేష్ నాదెళ్లకూ, ఇంకా పాత్రికేయులకూ ప్రణామం!-

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  13.01.2023.