2650* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

సుదీర్ఘ శ్రమదాన వైభవంలో మరో మైలురాయి - @2650*

            గ్రామ స్వఛ్ఛ సుందరోద్యమంలో 9వ భోగి పండుగ - ఈ 14-1-23 (శనివారం) వేకువ! శ్రమదాతలు 40 మంది కాక, మరో 30 మంది వచ్చి, 4.30 నుండి 7.45 దాక - అటుభోగి మంటల, భోగి పండ్ల - పిండి వంటల సంప్రదాయాన్నీ ఇటు గ్రామ సామాజిక కర్తవ్య పాలననీ కలగలిపి పాటించిన క్రొత్త సంస్కృతీ ప్రాభవమది!

            దీని రంగస్తలం గంగులవారిపాలెం దారి నుండి సన్ ఫ్లవర్ కాలనీకి వెళ్లే దారి; ప్రాత సంప్రదాయ నిర్వాహకులు కడియాల రామారావు - భారతి కుటుంబీకులైతే - అ 150 గజాల వీధిలో క్రొత్త శ్రమ సంస్కృతీ సంస్థాపకులు 30 మందికి పైగా స్వచ్ఛ కార్యకర్తలు! వణికించే చలిదీ, రెచ్చిపోతున్న మంచుదీ ప్రకృతి ధర్మం! దాన్నెదుర్కొని వీధి పారిశుద్ధ్య సాధన స్వచ్చోద్యమ విజయం! ఇది కదా - నేటి కాలంలో విజ్ఞులు పాటింపదగిన నవజీవన ప్రమాణం!

            పండుగ వేడుక కన్న ముందుగా దైనందిన సుప్రభాత శ్రమదాన వేడుకను చెప్పుకొందాం. ఆ వేడుకను 4.35 కే ప్రారంభించిన డజను మందీ, నిముషాల క్రమంలో వచ్చి, చీపురు గొర్రు కత్తి - డిప్ప - చేతులకు తొడుగులూ ధరించి, “సంక్రాంతి పండగ రోజైనా సరే! తగ్గేదేలేఅని వీధి పారిశుద్ధ్యానికి దిగింది మరో 18 మందీ!

            వాళ్ల పట్టుదల ముందు తలవంచి, చేతులెత్తేసి, లొంగి బలైపోయింది ఒక ట్రాక్టరు కశ్మలాలు! మూడు - నాలుగు నెలల నుండి స్వచ్ఛ కార్యకర్తలీ వీధికి రాక - వానలకు పెరిగి, బలిసిన పిచ్చి చెట్లు, గడ్డి, దుమ్ము దూళి పేడ - ప్లాస్టిక్ వంటి వికృతాలన్నీ గంటన్నర సమయంలో తోకముడిస్తే - ఇప్పుడు ఈ వీధి ఎంత శుభ్రంగా - విహారయోగ్యంగా ఉన్నదో గమనించండి!

            నేటి కార్యకర్తల దైనందిన వేకువ శ్రమదానంలో కలిస్తే కలిసిరి - లేకుంటే దూరంగా ఉంటిరి. ఈ వీధి నివాసులు నెలకొక మారైనా తమ బజారు పరిశుభ్రతనీ, సౌందర్యాన్నీ కాపాడుకోవలెనని విన్నపం!

            ఇక సంక్రాంతి - భోగి వేడుక సంగతి కొస్తే - చల్లపల్లిలో సగం సంప్రదాయం చైతన్యం ఆదర్శం ఇవాళ ఈ వీధిలోనే కనిపించాయి! పిల్లల భోగి పండ్ల ముచ్చట, తల్లుల - అమ్మమ్మల మురిపాలు కనువిందు చేశాయి! మరోప్రక్క - ఆ ఉదయం వేళనే వంటల ఘుమఘుమలు.! భోగి మంటలు - చుట్టూ చేరిన శ్రమ జీవుల ఔత్సాహిక కేరింతలు, ఛలోక్తులు, ఛాయాచిత్రాలు!

            70 మంది గుమికూడిన ఈ ప్రాతః కాల అ(న)ల్పాహార విందులో ప్రతిదీ పర్యావరణ హిత వస్తువే! ప్రతి తిను బండారమూ రుచ్యాతి రుచికరమే! నాలుగైదు రకాల భోజ్యాలూ, అంతే సంఖ్యలో అనుపానాలూ - దేన్నీ రుచిచూడక - పూర్తిగా న్యాయం చేయక వదలలేని బలహీనతే!

            ఇంత వైవిధ్యమైన - శుచికరమైన - పర్యావరణ పరమ హితకరమైన విందునాస్వాదించడం కాస్త కష్టమనిపించినా ఇన్ని జాగ్రత్తలు పడిన హరిత వేడుక కర్తలైన ఇద్దరు సురేష్ లూ అభినందనీయులే! మరో దశాబ్దం పాటు వారు ప్రతి సంక్రాంతి పండుగనూ ఇలాగే నిర్వహించాలని మా అభిమతం ! విందు ప్రదాతలకూ - నిరంతర ధారావాహికగా సాగే స్వచ్చ సుందరోద్యమానికీ - తదభిమానులకూ పెద్ద పండుగ శుభకామనలు!

            రేపు - మకర సంక్రమణ శుభోదయాన - మనం కలుసుకొని ఊరి కోసం శ్రమించవలసిన చోటు బందరు - బెజవాడ - అవనిగడ్డ రోడ్ల కూడలే!

            చల్లపల్లి స్వఛ్ఛ - సుందరీకరణోద్యమ సారాంశాన్ని ముమ్మారు నినదించిన మన ఆస్థాన గాయకుడే ఈ క్రింద ప్రస్తావించిన గేయాన్ని ఆలపించాడు, అలరించాడు.

            సచ్ఛ కార్యకర్తల తాత్త్విక ధోరణిని ప్రతిబింబించే సదరు గేయం ఇదే - చిత్తగించండి:

               *శ్రమదాన యజ్ఞం*

(గానం నందేటి శ్రీనివాస్; రచనం ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు)

శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం

చల్లపల్లి స్వచ్చతకు నిబద్ధులం - ఆమె ముఖపద్మంపై చెరగని నవ్వులం ॥

            చల్లగ వీస్తూ - జనుల అలసట తీర్చే

            గాలి అడిగిందా ప్రతిఫలాన్ని నిన్నూ - నన్నూ!

            ఫలములనిచ్చీ - ప్రాణవాయువు పెంచే

            చెట్టు ఋణం తీర్చుమొనగాడున్నాడా అసలూ!

            తప్పటడుగును దిద్దీ - సాంప్రదాయము తెలిపే

            సమాజ ఋణం చెల్లించుట కర్తవ్యం కాదా!

            ఏసుక్రీస్తు గాంధీజీ ఏ ప్రతిఫలమాసించిరి?

            ఎందుకు తమ బ్రతుకులట్లు బలిదానం కావించిరి?

                        శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం ॥

            మొండి శిలలను చెక్కీ జీవకళ పుట్టించే

            శిల్పి పనితనమే మన వేకువ శ్రమదానంలో

            స్వచ్ఛ శుభ్రతలద్దీ - వీధి వీధిని దిద్దే

            అందచందాలను సృష్టించు ప్రయత్నం మనదీ!

            గ్రామ సేవలకు రమ్మని అందరినభ్యర్థిద్దాం

            కదలి వచ్చు సమైక్యతకు ఘనస్వాగత మర్పిద్దాం

            కలిసొస్తే ఒక దండం! రాకుంటే సహస్రం!

            కర్మఫలిత మాసింపక కదం త్రొక్కుదాము మనం

                        శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం!

            ప్రజలను చీల్చే - కులమత గోడలుకట్టే -

            శ్రమను అవమానించేంతటి దుస్వార్ధ పరులమా మనం?

            కశ్మలాలను ఊడ్చీ - ఒడలి చెమటలు చిందే

            స్వచ్చ - రమ్య - మాన్య చల్లపల్లి రూపకర్తలం

            స్వశక్తిని నమ్మీ - ఊరి స్వస్తత నిలిపీ

            అసలాగక అలుపెరుగక జరిపే ప్రస్థానంలో

            తమ తపస్సు ఫలితంగా తమ ఊళ్ళో ప్రజలెల్ల

            చిరాయువులై సుఖశాంతులతో వర్ధిల్లాలనుకొను

శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మన ఆయుధం

చల్లపల్లి స్వచ్ఛతకు నిబద్ధులం - ఆమె ముఖ పద్మంపై చెరగని నవ్వులం॥

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   14.01.2023.