2651* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

పెద్ద పండుగ (సంఖ్య - 9) నాటి శ్రమదానం - @2651*

        ఔను! చల్లపల్లి స్వచ్ఛ - సుందర శ్రమదానానికిది 9 వ సంక్రాంతి! మంచు - చలీ దేన్నీ లెక్కచేయక తలా – 2/3 కిలోమీటర్లు ప్రయాణించి, గ్రామ ముఖ్య వీధి కూడలి పాచి పనికి పూనుకొన్న కార్యకర్తలు 36 మంది! సమయం 4.20 వేకువ!

        “అసెంబ్లీలు, పార్లమెంట్లు చెత్త కబుర్ల రాయుళ్ల సదుపాయాలైనప్పుడు - సంతలూ, రచ్చబండ లూ, అక్కడి పోసుకోలు కబుర్లే ప్రజాస్వామిక చర్చలౌతాయి!....

        అని ఎంజిలో - కాట్రోచ్చినే ఫ్రెంచి రచయితలు (- అనువాదం శ్రీ శ్రీ) చెప్పినట్లు ఒకప్పుడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మిక సోదరులు చేసిన పాచి పనుల్ని ఇప్పుడిక్కడ వృత్తి నిబద్ధులైన వైద్యులు, ఉద్యోగులు, రైతులు, గృహిణులు నిర్వహిస్తున్నారు! ఇది కాలమహిమ - కాల దుర్విపరిణామం!

        ఊరి వీధుల్నిలా చెడగొట్టే జనంలో కాస్త మార్పు వచ్చినపుడు - ఎవరి ఇళ్ల పరిసరాలు వారు బాగా నిర్వహించుకోవాలనే స్పృహ కలిగినప్పుడు పై నుంచి క్రింది స్థాయి దాక సుపరిపాలన జరిగినప్పుడు ఈ దుస్థితి రాకపోను!

        మొన్నటి కార్యకర్తల అంచనా - అవనిగడ్డ రహదారిలో ఈ ఆదివారం వేకువ బందరు బాట నుండి RTC బస్ ప్రాంగణం దాటి శ్రమించి, బాగుచేయగలమనే! ఐతే వాళ్ల ఆలోచనకు అడ్డుకట్ట వేసింది గణేష్ ప్రెస్ వీధి, సచివాలయం చుట్టూ ఉన్న బండెడు వ్యర్ధాలు. అసలా జాగాలో లేనివేమున్నవి కనుక? సారా సీసాలు, ఎంగిలాకులు, ఎందుకొచ్చి పడ్డాయో తెలియని ఇంజెక్షన్ సూదులు, చిత్తు పేపర్లు, ఘాటెక్కిన ఉచ్చ కంపులు - ఇలాటి చోటనే గంటన్నర పాటు 14 మంది శుభ్ర సుందరీకరణలు!

        బందరు దారి, బస్టాండు బాటల బంకుల ఎదుట చెల్లా చెదరుగా త్రాగి పడేసిన కొబ్బరి బొండాలను ట్రక్కులోకి చేర్చుకొంటూ - పూల కొట్ల, బడ్డీ కొట్ల ఎదుటి భోగి నాటి రరకాల కశ్మలాలను సేకరించుకొంటూ 200 గజాల రోడ్డునూ, మార్జిన్లనూ ఊడ్చుకొంటూ - అటు చిన్న కార్ల స్టాండు నుండి పొట్టి శ్రీరాములు వీధి దాక తాము అడుగుపెట్టిన ప్రతి చోటును శుభ్రంగా మార్చిన స్వచ్చ కార్యకర్తలు ధన్యులు!

        15.1.23 – ఆదివారం నాడు - 30 మంది శ్రద్ధగా బాగుపరచిన (4.20 నుండి 6.15) తరువాత నేను 200 గజాల వీధిని ఒకమారు పరిశీలనగా తిరిగి చూస్తే - కార్యకర్తల సామాజిక శ్రద్ధ పట్ల సంతోషం - గర్వం పుట్టుకొచ్చాయి! 60 పని గంటలు శ్రమించిన కర్మవీరుల కెంత తృప్తిగా ఉంటుందో మరి!

6.35 పిదప వస్త్ర దుకాణం ఎదుట సమీక్షా సభలో:

- రామకృష్ణ వైద్యుని చిన్న సైజు - అనుభవ పూర్వక వ్యక్తిగత వికాస ప్రసంగమూ, దానికి ముందు సజ్జా ప్రసాదుని గ్రామ స్వఛ్ఛ - సుందరాభిలాషాపూర్వక నినాదాలూ కాక - పల్నాటి భాస్కర - అన్నపూర్ణల 1000/- విరాళము (సందర్భం - తమ కుమారుడు రాం చరణ్ జన్మదినం!)

 

        నిన్న భోగి పండుగ నాటి గోళ్ళ వేంకట రత్నం గారి నాలుగు అందమైన తల దీపాల (హెడ్ లైట్స్ ) వితరణ కూడ ప్రశంసనీయమూ, స్మరణీయమూ!  

        బుధవారం వేకువ ఇదే అవనిగడ్డ రహదారి శుభ్రత కోసం ప్రయత్నించదగింది పొట్టి శ్రీరాములు వీధి దగ్గరేనట!

        నా ప్రణామం -197

కరడుగట్టిన కశ్మలాలను- పడగ విప్పిన కల్మషాలను

మురుగు కంపును- ముళ్లకంపను - వీధి ప్రక్కల ఆక్రమణలనూ

సహృదయుల సహకారములతో సాగనంపిన స్వచ్ఛ సుందర

సాహసికులకె సమర్పిస్తా స్వస్త బంధుర సత్ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   15.01.2023.