2652* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

మరొక మారు గ్రామ భద్రతా దళ చర్యలు - @2652*.

            ఇది కనుము పండుగే కావచ్చు - సోమవారం కనుక - ఊరి రోడ్ల లోపాలు - వీలైనంత తక్కువ డబ్బు ఖర్చూ, ఎక్కువ శ్రమ ఖర్చుతో చక్కదిద్దగల్గినది తమ కోసం ఎదురు చూస్తుండగా రెస్క్యూ టీమ్ ముసుగు తన్ని ఇంట్లో పడుకోగలదా? ఏ 3.30 కో లేచి, ట్రక్కులో సామాన్లు సర్దుకొని, నిర్ణీత ప్రదేశాన్ని బాగుచేయక సమయం తెలియకుండా నిద్రించగలదా?

            ఈ వేకువ 4.20 కి వాళ్ల కన్ను పడింది నాగాయలంక రోడ్డులోని - ఆదివారం ఉదయం లోడు చేయక - కావాలని వదిలేసిన దుమ్ము - ఇసుకా చిరు గుట్టల మీద! పెట్రోలు బంకు ఎదుట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కళాకాంతులు లోపించిన చిరు ఉద్యానం మీద! పైగా ఈ వీధి దుకాణాల ఎదుట ఒక్క రోజుకే మళ్లీ తయారైన వ్యర్ధాలు!

            నేటి బ్రహ్మకాలంలో వీధి పారిశుద్ధ్య బాధ్యతలు మోసింది ప్రధానంగా నలుగురు. అందులోనూ ముగ్గురు కరుడుగట్టిన శ్రమ వీరులు! ఇక వీళ్లకు వత్తాసుగా వచ్చింది నా బోటి నలుగురు!

ఈ స్వల్ప సంఖ్యాకులే సుమారు 10 పనిగంటల్లో :

- బంకు ఎదుట గాని, వస్త్ర దుకాణాల ముందు గాని, తోపుడు బళ్ల నడుమ గాని, శీతల పానీయ దుకాణాల వద్ద గాని, బండెడు మట్టినీ - ఇసుకను గోకి, కుప్పలు చేసి, డిప్పల్తో మోసి, అక్కడక్కడా రోడ్డు మార్జిన్ల పల్లాలు పూడ్చారు.

- మిగిలినది ట్రక్కులో నింపుకొని అవసరమైన చోటికి తరలించారు.

- ఇంకో 20 నిముషాలు - నిన్న శుభ్రపరచిన చోటనే చీపుళ్లతో ఊడ్చి వ్యర్థాల్ని తొలగించి, రోడ్ల కూడలిని మెరుగుపరచారు.

            తుదకు కస్తూరి శ్రీనివాసరావు గారు ప్రవచించిన ఊరి మెరుగుదల సంకల్ప త్రివిధ నినాదాలను కీర్తించి, గృహోన్ముఖులయ్యారు!

            నా ప్రణామం -198

ఎవరు మురుగును తోడినారో - వీధి వీధిని ఊడ్చినారో

ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో

స్వచ్ఛ సుందరచల్లపల్లికి సార్ధకత చేకూర్చినారో

అట్టి ధన్యుల ప్రశంసిస్తా - అందజేస్తా నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   16.01.2023.