2653* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

బైపాస్ వీధిలో 4.30 నుండి జరిగిన శ్రమదానం - @ 2653*

            మంగళవారం (17.01.2023) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమ విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప రహదారిలో ½  కిలో మీటరు పొడవునా విస్తరించాయి. ఐతే వాళ్ళు నలుగురైదుగురు + ముగ్గురే ననుకోండి! ఆ చలీ-మంచూ వాతావరణం ఎంతో నిబద్ధత మొండి  పట్టుదల ఉన్న వాళ్ళకు తప్ప అందరికీ సరిపడనిదేననుకోండి!

            ఇన్ని వేల రోజుల లక్షల పని గంటల ఫలప్రదమైన గ్రామ సేవలు ఇక చల్లపల్లికీ దాని అభ్యుదయ పరంపరకూ కట్టుబడిన స్వచ్చంద సేవకులకూ తప్ప మన సమకాలంలో ఎక్కడ చూడగలరు? ఈ అవకాశం, అదృష్టం ఐతే ఇద్దరిదీ కూడ!

            ఈ వేకువ గ్రామ రక్షక దళం తమ సరంజామాతో తొలుత ఆగింది సినిమా హాలు వద్దనే! అక్కడున్నవి-కరెంటు విభాగ ఉద్యోగులు కాబోలు కొట్టి పడేసి సగం ఎండిన కొమ్మలూ,ఆకులూ ! వాటిని సర్దుకొని, అదే వీధిలో మరొకచోట కూడ అలాంటి పనే పూర్తి చేసుకొని, 5.20 కి కమ్యూనిష్టు వీధి ఉత్తరం కొసకు వెళ్లారు.

            అది నాకు సంబంధించిన ఖాళీ స్తలమే అక్కడ పడి ఉన్న వేరెవరి ఇంటి వ్యర్థాలో- పూల తీగలు, కత్తిరించిన కొమ్మలు, చకచకా ఇద్దరు ట్రక్కులోనికెక్కిస్తుండగా ఇద్దరు కార్యకర్తలు ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కల్ని తొలగించారు!

            ఎలాగైతేనేం బైపాస్ వీధిలోనూ, సామ్యవాద వీధిలోనూ గంటన్నరకు పైగా తమ విలువైన కాలాన్నీ, శ్రమనూ వెచ్చించి, కొంతమేరకైనా సుందరీకరణం సాధించారుగదా!

            ఒకప్పటి కస్తూర్బా ప్రభుత్వాసుపత్రి ఆవరణను ఉదయం నడక సందర్భంగా చూశాం! ఐదారేడు నెలలుగా కార్యకర్తల శ్రమ రుచి చూడక- అదెంత అధ్వాన్నంగా ఉన్నదో! ముఖ్యంగాప్రవేశ ద్వారం!

            అక్కడి కశ్మలాల కారకులైన సమీప గృహస్తులు కలిసొస్తే తదుపరి సోమ- మంగళ వారాలైనా కార్యకర్తల్తో  సహకరిస్తే ఆ ప్రదేశాన్ని అందంగా మలచడం ఎంతసేపు?

            6.35 సమయంలో తమ శ్రమ వేడుక ముగింపుగా మాలెంపాటి అంజయ్య నినదించిన ఊరి స్వచ్చ- సుందరోద్యమ సంకల్పం మారు మ్రోగింది.

            మన రేపటి వేకువ ముఖ్య వీధి శుభ్రత కోసం కలిసి పురోగమించవలసిన చోటు అవనిగడ్డ బాటలోని వేంకటేశ్వర టెక్స్ టైల్స్ షాపు దగ్గరే!

            నా ప్రణామం -199

ఎవరికైనా గంట లిరువది నాలుగే ప్రతిరోజు అందలి

ఒక్క గంట శ్రమను సైతం ఊరి మేలు కొసంగ లేమా?

చల్లపల్లి స్వచ్చ సుందర శ్రామికుల సంకల్ప మదెగద!

అద్భుతంగద! అమోఘంగద! అందుకే గద! నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  17.01.2023.