2654* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

24 మంది ఆదర్శ శ్రమజీవులు - 200 గజాల జాతీయ రహదారి - @2654*

          అవి బుధవారం (18-01-2023) నాటి చల్లపల్లి ముఖ్యవీధిలోని శ్రమదాన సమీకరణాలు! సమీకరణ వేదిక పొట్టి శ్రీరాములు వీధి మొదలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రవేశ ద్వారం దాటిన దాక! సమయం 4.20 - 6.10 నడుమ! శ్రమకారుల ఉద్దేశ్యం తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాల మెరుగుదల! ఫలితం -

1) జాతీయ రహదారి బాగుపడి, గ్రామస్తుల మనోల్లాసం,

2) రెండు డజన్ల సామాజిక చైతన్యజీవులకు రోజుకు సరిపడా సంతృప్తి!

          వాళ్ల శ్రమదానమూ - తన్మూలంగా పొందే సంతోషమూ ఒకనాటిదో - ఒక ఏటిదో కాదు, 9 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం! ఉబుసుపోకకు కాక - పేరు ప్రఖ్యాతులకు కాక ఏస్వార్థమూ లేక ఊరి కాలుష్యం మీద నిరంతరం జరిగే ఈ సమరం - ఆరంభమూ కాదు, అంతమూ కాదు! తామనుకొన్న చైతన్యం సోదర గ్రామస్తుల్లో కలిగే దాక తాము కలగన్న స్వచ్ఛ - సుందర స్వగ్రామం నిజమయ్యే దాక - ఇదొక నిత్యజీవన పోరాటమే!

          ఎప్పట్లాగే చలిని లెక్కింపక - బ్రహ్మకాలంలోనే అత్యధిక గ్రామస్తులు నిద్రిస్తున్న వేళలోనే - అవనిగడ్డ బాటలో వేంకటేశ్వర వస్త్ర దుకాణం దగ్గర ప్రారంభించిన కార్యకర్తల ప్రయత్నం కోట దక్షిణ ద్వారం దాటిం దాక కొనసాగింది! అప్పటికే ఈ సదుద్యమ సంచాలకుని 3 వ విజిల్ కూడ మ్రోగి పని నిలిపే సమయానికే:

- దుకాణాల ముందర  - కాస్త తక్కువగా పడి ఉన్న రకరకాల వ్యర్థాలనూ, దుమ్మునూ,

 

- కూరల దుకాణం వద్ద తగు మాత్రం గలీజునూ,

- అది దాటి, మూడు రోడ్ల కూడలిలోని ఎంగిలి గ్లాసులూ - ప్లాస్టిక్ సంచులూ, గుడి అని కూడ చూడకుండ భక్తులో ఇతరులో వేసిన కశ్మలాలనూ,

 - కోట గుమ్మం మలుపు వద్ద మాంస విక్రయ దుకాణం, ఇతర అంగళ్ల ఎదుటి అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లనూ ఊడ్చుకొంటూ, అవసరమైనపుడు గోకుడు పారల్తో గట్టిపడి అతుక్కొన్న మట్టిని లేపుతూ సాగింది - 15 మంది కార్తకర్తల పని తీరు!

          ఏడెనిమిది మందికి ఈ వేకువ కఠిన పరీక్ష పెట్టింది మాత్రం RTC నిష్క్రమణ ప్రదేశమే! ఆవరణలో మంచి నాణ్యమైన మూత్రశాలలున్నా సరే, వందలాది మంది విచ్ఛలవిడిగా విసర్జించిన ఉచ్చ కంపు నడుమ - అరగంట సేపు శుభ్రపరచడం - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు కాక మరెవరికి సాధ్యం?

          ఆటోలు నిలుపు చోటూ, బస్టాండు ఎదుటి సువిశాల రహదారీ కార్యకర్తల చీపుళ్లకు బాగానే పని కల్పించాయి! ఏమైతేనేం - గంటా 50 నిముషాల పారిశుద్ధ్య పోరులో స్వచ్ఛంద శ్రమదాతలదే పైచేయి!

          ఇంత చలిలో - దుమ్ము, మురికి పని చేశాక - 6.35 సమయంలోనూ వాలంటీర్ల ఉత్పాహం షరామామూలే! ఇది విజేతల తాలూకు సంతోషం మరి! చిరకాల శ్రమదాత నూతక్కి శివబాబు ప్రకటించిన స్వచ్ఛ - సౌందర్య సంకల్ప నినాదాలూ, కొత్త పద్ధతిలో ఈ నిరంతర శ్రమ త్యాగాన్ని అతడు అన్వయించిన పద్ధతీ బాగున్నాయి!

          సమీప భవిష్యత్ శ్రమదాన ప్రణాళికను చర్చించాక -

          రేపటి వేకువ శ్రమ స్తలం బెజవాడ బాటలోని అగ్రహారం వద్ద అని నిర్ణయమయింది!

          నా ప్రణామం -200

పైకి ఒకటీ - లోపలొకటీ, మాట వేరుగ - చేత వేరుగ

హిపోక్రసి తమ తోడు నీడగ - విహ్వలిస్తున్న దుస్థితిలో

సమాజంలో స్వచ్ఛ సంస్కృతి స్థాపనకు తగు చొరవ చూపిన

స్వచ్ఛ ధీరులు ఎక్కడున్నా సమర్పిస్తున్నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   18.01.2023.