2655* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గురువారం (19-1-23) నాటి బహుముఖీన శ్రమదానం - @2655*

            నేటి వేకువ - 4.16 కే కోటకు ఉత్తరాభిముఖంగా జరిగిన స్వచ్ఛ సుందరీకరణం రెండు మూడు చోట్లకు విస్తరించింది! 26+2 మంది హాజరైన 2 గంటల ప్రయత్నంతో

1) 3 రోడ్ల కూడలిలోని కాలుష్యదరిద్రం,

2) బెజవాడ బాటలో కోట ఉత్తర ద్వారం వరకూ,

3) కొసరుగా అగ్రహారం తొలి వీధిలో కొంత భాగం కశ్మలాలను కోల్పోయి, స్పచ్ఛ చల్లపల్లి వీధులనిపించు కొంటున్నాయి!

            ఐతే - కార్యకర్తలెప్పుడూ భారమనో, తప్పని తద్దినమనో అనుకోరు గాని ఇప్పుడక్కడ కనిపిస్తున్న వీధి అందం వెనుక - 50 పని గంటల శ్రమ సంగతేమిటి? కనీసం నెలకోమారు కార్యకర్తలు పాటుబడుతున్నా - అలవాటు చొప్పున ప్రతి పనికిరాని దాన్నీ మురుగు కాల్వలోకో, రోడ్డు మీదికో విసిరే వాళ్ల నిర్లక్ష్యం సంగతో? ఊరి జనాభాలో సగం మంది స్వచ్చ శుభ్రతల వైపుకు అడుగులేయాలా? లేక సామాజిక - సామూహిక ప్రయోజనం కోసం తాము తలపెట్టిన శ్రమదానాన్ని కార్యకర్తలు ఆపాలా?

            సమష్టి ప్రయోజనార్థం సమష్టి కృషి జరగవలసిన చోట. కొద్దిమంది కార్యకర్తలా బాధ్యతల నెంతకాలం మోయాలని మనగామస్తుల కోరిక? తొమ్మిదేళ్లు గడచినా బదులు దొరకని ప్రశ్నలివి!

            నిజమే - ఇంత చలిలో - ఇంత చీకటి వేకువలో - స్వచ్ఛంద శ్రమదానానికి రావాలని ఉబలాటం ఉన్నా - రాలేని నిస్సహాయత కొందరిది! వీధులూడ్చేందుకూ, బహిరంగ స్థలాల్లో మురికి పని చేసేందుకూ కోరిక ఉన్నా - వీడని బిడియమూ, సందిగ్ధతా మరి కొందరిది! ఎప్పటికైనా తొలగవలసిన అడ్డంకులే ఇవి!

            150 గజాల బెజవాడ వీధిలోనే ఇంత ప్లాస్టిక్ వ్యర్థాలూ, చిన్న ట్రక్కు దుమ్మూ ధూళీ కార్యకర్తలు ఊడ్చారంటే - డిప్పల్తో లోడు చేసి డంపింగ్ కేంద్రానికో కొన్ని రోడ్ల గుంటలు పూడ్చే పనికో తరలించారంటే - దుకాణదారుల అలసత్వం కూడ ఉన్నట్లే!

            పోలీసు పహరా కేంద్రం దగ్గర ఎంత దుమ్ము, ఎన్ని వ్యర్ధాలూ ఊడ్చారో భవన నిర్మాణ/పునర్వ్యవస్థీకరణాల దగ్గర ఎన్ని వ్యర్ధాల గుట్టలు పడి ఉన్నాయో వాటి పరిష్కారాలేమిటో అందరూ ఆలోచించాలి!

            లక్ష్మీ జనరల్ మర్చంట్స్తరపున యార్లగడ్డ హనుమంతరావు గారు పనిగట్టుకొని  అస్పత్రికి వచ్చి మనకోసం మనంట్రస్టుకు స్వచ్ఛ - సుందరీకరణ ఖర్చుల నిమిత్తం 10,000- విరాళం ప్రకటించడాన్నీ, పేరు చెప్పడానికి ససేమిరా ఇష్టపడని మరొక అజ్ఞాత దాత 10,000 /- విరాళాన్నీ స్వాగతించాలి!

            ఒక  పశువైద్య వృద్ధ కార్యకర్త మాలెంపాటి వారు నాణ్యమైన చాక్లెట్లు పంచగా, షణ్ముఖ శ్రీనివాసుల వారు మరొక మారు రేగు పండ్ల పంపకం చేయించారు. వీధి సుందరీకరణ నిపుణుడు ఆకుల దుర్గా ప్రసాదు స్థిరంగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ప్రకటించగా,

            సమీక్షా సభ జరిగిన విజయా డైరీదుకాణస్థుడు తన పరిసరాల స్వచ్చ - శుభ్రతలకు హామీ ఇవ్వగా, 6.40 కి నేటి కార్యక్రమం ముగింపు!

            రేపటి వేకువ కర్తవ్య నిర్వహణ కోసం మనం మరొకమారు కలిసి సాగవలసినది బెజవాడ బాటలోని స్వగృహ హోటల్ దగ్గరే!

            ఓ మహాత్మా! ఓ మహర్షీ!

దురదృష్ట - మదృష్టమేమిటి? ఏది కష్టం - ఏది నష్టం?

గ్రామమంటే మట్టి ఇసుకా? గ్రామమంటే జనం కాదా?

కార్యకర్తల తపస్సెందుకు - ఊరి స్వస్తత కోరి కాదా?

మనం మన కోసం శ్రమిస్తే గ్రామ సౌఖ్యం మెరుగు పడదా?

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   19.01.2023.