2656* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గ్రామ పారిశుద్ధ్య పాఠ్య గ్రంథంలో - @2656* వ పుట!

           ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – మధు గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా బెజవాడ రహదారి, కొసరుగా పంచాయితీ కార్యాలయ వీధి ! రేపటికి ఇంకా మిగిలి పోయిన చోటులు - బ్రాహ్మణ కర్మల భవనం దగ్గర జానెడెత్తున పేరుకొన్న దుర్గంధమయ వ్యర్థాలూ, ‘శ్రీమంతు క్లబ్బునుండి బెజవాడ దిశగానూ!

          వేకువ 4.17 - నుండి 6.15 దాక సాగిన సుమారు 2 గంటల పారిశుద్ధ్య జైత్ర యాత్రలో ఇందరు కార్యకర్తల ప్రగతి 150 గజాలే! అందుకు కారకులు గ్రామ సామాజిక స్పృహ చాలని టీ  దుకాణదారులూ, సిమెంటు కొట్ల వారూ, పచారీ వర్తకులూ! వాళ్లు ఏ కాస్త శ్రద్ధ చూపినా - టీ, కాఫీల కప్పులు, రోడ్డు మీద, సైడు కాలవల్లో కాక - డబ్బాలోనే ఉండేవి. దుకాణాల ఎదుట మురుగు కాల్వల్లో ఈ ప్లాస్టిక్ సంచులూ, గట్ల మీద పిచ్చి మొక్కలూ ఉండకపోను! రోడ్డు పడమర చెరువునూ, దాని చుట్టూ వృక్ష సంపదనూ - పక్షుల శ్రావ్య నాదాలనూ చూస్తే ఆహ్లాదం; దాని గట్టు మీద నికృష్ట వ్యర్థాలను చూస్తేనేమో దుర్భరం!

          మెకానిక్ షెడ్ల ముందరా అంతే! వీటన్నిటినీ తుడుచుకొంటూ ఊడ్చుకుంటూ - గడ్డినీ, పిచ్చి మొక్కల్ని తొలగించుకొంటూ ఆరేడుగురు కార్యకర్తలా వ్యర్థాలను ట్రాక్టర్లో నింపుకొంటూ శివాలయ ద్వారం దగ్గర ఆగిపోయారు! టీ కొట్టు ముందర నెలల తరబడీ వాళ్లు ఊడ్చిన దుమ్మూ ఇసుకా గట్టిపడిన రెండు గుట్టల్ని గోకుడు పారల్తో రైల్వే పారల్తో పెళ్లగించి, ట్రక్కులోకి చేర్చే పనే ఎక్కువ సమయం పట్టింది! పైగా అక్కడ గుడికి వెళ్ళే భక్తుల టీ కాఫీ వాడకం దార్ల - మోటార్ సైకిళ్ల - ఇసుక బళ్ల రద్దీ!

          తాము పదే పదే శుభ్రం చేస్తున్న - గుంటలు పూడుస్తున్న - ఖాళీల్లో పూలమొక్కలు నింపుతున్న రహదారిని ఇలా పట్టించుకోని, అస్తవ్యస్తం చేస్తున్న వారి పట్ల కార్యకర్తలెవరైనా విసుగూ కోపమూ - చిరాకూ పడుతున్నారేమోనని ఆరా తీశాను. సమస్యల పరిష్కారాలను చర్చించడం తప్ప వాళ్లు ఇతరులను తూలనాడడం కనిపించలేదు! ఒకటి రెండు దుకాణ పరిసరాలు శుభ్రంగా కనిపించాయి గాని నిన్న శుభ్రపరచిన చోటులే 24 గంటలు గడవక ముందే - మళ్లీ చెత్తా - చెదారాలతో నిండిపోయాయి!

          50 కి పైగా పని గంటల శ్రమానంతరం ఈ స్వచ్ఛంద కార్మికులు నేటి తమ ప్రయత్నంతో బాగుపడ్డ వీధి భాగాన్ని చూసుకొంటూ - రేపటి కర్తవ్యాన్ని తలచుకొంటూ - సరదా కబుర్లు చెప్పుకొంటూ - కాఫీ సేవిస్తూ వక్కలగడ్డ రామకృష్ణ హడావిడిగా చెప్పిన స్వచ్చ సుందరోద్యమ గ్రామ నినాదాలందుకొంటూ - జాస్తి ప్రసాద్ గారి సోదరి - మధు స్పందనను ఆలకిస్తూ ...

          6. 40 దాక గడపి గాని ఇంటి దారి పట్టలేదు!

          రేపటి వేకువ మనం కలువదగిన చోటు శివాలయం దగ్గరే!

          ఓమహాత్మా! ఓ మహర్షీ!

నీవు నేర్పిన విద్యలేమిటి? నేడు జరిగే తంతు లేమిటి?

హరిత సంపద స్వచ్చ శుభ్రత అందలం ఊరేగుతుంటే-

అందమే ఆనందమను కవి అంతరంగం బోధపడితే

కార్యకర్తలె కాక ప్రజలూ కలిసి మెలిసీ శ్రమిస్తుంటే

ఊళ్లు నందనమైతే దేశం ఉన్నత స్థితి చేరుకోదా?

ఓ మహర్షీ! ఏది స్పందన? ఓ మహాత్మా! ఎచట బాధ్యత!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   20.01.2023.