2657* వ రోజు...... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

కాలుష్యం మీద కదనంలో2657*వ ఘట్టం.

            శనివారం(21.01.2023) నాటి మహా యుద్ధం వేకువ చలి నడుమ 4.16 కే మొదలై 2 గంటలు కొనసాగింది! నేటి 27 మంది స్వచ్చ వీరుల్లో సింహ భాగం 20మంది అంతగా వాడుకలో లేని బెజవాడ బాటలోని- కర్మల భవనం దగ్గరి చెరువు గట్టు 5 సెంట్లలోని కాలుష్య సంహరంలోనే గడిపారు! ఇద్దరేమో రహదారిని ఊడ్చే పనిలో, నలుగురు మాత్రం అగ్రహారం సిమెంటు కొట్టు వీధి సుందరీకరణలో !

            కార్యకర్తలకు శ్మశానం తర్వాత గట్టి సవాలు విసిరిందీ, అగ్ని పరీక్ష పెట్టిందీ- శివాలయం టీ కొట్టు దగ్గర ఖాళీ స్తలమే ! శుభ్రపరచక ముందున్న ఒక వాట్సాప్ చిత్రంలో ఆ కాలుష్య విశ్వరూపం చూశారా! 30 - 40 పని గంటల తర్వాత చిత్రం కూడ చూడండి! గ్రామస్తుల ఆరోగ్యం కోసం - ఆహ్లాదం కోసం స్వచ్చ కార్యకర్తల శ్రమ ఫలితమే రెండవ చిత్రం!

            ఎందరు షాపుల వాళ్ళో టీ కొట్టు వారో రాత్రిళ్లు వేస్తున్న వ్యర్థాలవి! ఎంత మొండి వాళ్ళకో తప్ప అక్కడ సిరంజీల దుర్గంధాల పేడల-పెంటల చోటులో కాలైనా మోపలేని దుర్భర ప్రదేశమది! ఐదు సెంట్ల జాగానుండే అంత పెద్ద ట్రక్కు నిండిపోయిన కశ్మలాలవి! చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల గ్రామ కర్తవ్య దీక్షకు తాజా సాక్ష్యమది!

            శ్రీమంతు క్లబ్బు ఎదుట నాలుగైదేళ్ళుగా స్వచ్చ కార్యకర్తల పూనికతో నిర్వహింపబడుతున్న కస్తూరి మామ్మ

ఉద్యానం అందాన్ని దెబ్బతీస్తున్న వ్యర్థాల గుట్టను కూడ మన సామాజిక మాధ్యమం లో మీరు చూడవచ్చు! దాన్ని తొలగించి, ఊడ్చి పునః సుందరీకరించిన నలుగురూ అభినందనీయులు! ఐతే రేపటి మాపో, ఎల్లుండి రేపో అక్కడ మళ్ళీ వ్యర్థాలు ప్రోగుపడవని అభయమీయవలసింది పాల విక్రేతలూ- పండ్ల దుకాణాల వారే!

            అగ్రహారం రెండో వీధిలో కొంతమేర పట్టి పట్టి శుభ్ర- సుందరీకరించింది కూడ సుందరీకరణ బృందమే!

            కాఫీ సేవనం కాలంలో ఏ కార్యకర్తను పరిశీలించినా- కాస్తంత అలసట తప్ప వాళ్ల ముఖాల్లో కనిపించింది సంతృప్తే!

            అందరి సంతృప్తినీ- ఊరి వీధుల పారిశుద్ధ్య, సౌందర్య నిబద్ధతనీ ముమ్మార్లు నినాద రూపంలో దబాయించినది దేసు మాధురి”.

            రేపటి గ్రామ వీధి బాధ్యత కోసం బెజవాడ బాటలోని HDFC బ్యాంకు వద్ద కలువ వలెనని నిర్ణయమైనది!

            వినమ్రంగా - విభ్రమంగా

విహ్వలంగా విశృంఖలంగా- వెర్రిమొర్రిగ ఊరి వీధులు

అచేతనముగ- అనిశ్చితముగ-అయోమయముగ జనం మనసులు

వినమ్రంగా- విభ్రమంగా-విస్తృతంగా స్వచ్చ సేవలు!

స్వచ్చ-సుందర సమన్వితముగ చల్లపల్లి ప్రముఖ వీధులు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   21.01.2023.