2658* వ రోజు..........

              పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

                      స్వచ్చోద్యమ చల్లపల్లికి యువ శక్తి అండ! -@ 2658*

            ఆ అండతో ఈ ఆదివారం(22.01.2023) నాటి శ్రమదానానికొక క్రొత్త కళ! ప్రతిభా కోచింగ్ సెంటరు విద్యార్ధినీ విద్యార్థులు సుమారిరవై మంది+ రెగ్యులర్ – ప్రాత కార్యకర్తలు 28 మందీ వెరసి 48 మందితో చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమానికొక ఊపు వచ్చింది!

            ఆ ఊపుతో – 1) బెజవాడ రహదారి శ్రీ మంతు క్లబ్బు మొదలు నడకుదురు మార్గం దాకా, 2) అగ్రహారం 2 వ, 3 వ వీధుల్లో కొంతా, 3) బైపాస్ బాటలో కొంతా, 4) MRO –MDO కార్యాలయాల్లో పాక్షికంగా పారిశుద్ధ్యం సంతరించుకొన్నవి!

            ప్రాత- క్రొత్త వాలంటీర్ల సంఖ్యాదిక్యంతో చీపుళ్లు చాలని – చేతొడుగులు లోపించిన సమస్యా వచ్చింది! తమ చదువులోకం నుండి గ్రామ వీధుల స్వచ్చ కార్యక్రమం లోకి తొలిసారి వచ్చిన పిల్లల్లో ఎవరూ ఖాళీగా నిలుచోక -  చెత్తలోడింగులోనో, రోడ్ల దుమ్ము వదలగోటుతూనో, మట్టి డిప్పలు మోసి రహదారి మార్జిన్ల గుంటలు పూడుస్తూనో- ప్రాత కార్యకర్తల్నుండి పని నేర్చుకొంటూనో ఉండడమే గాని – ఏ అలసత్వమూ చూపకపోవడం విశేషం!

            ఒక వరుస క్రమంలో నేటి శ్రమదాన విశేషాలు:

1) ఒక డాక్టరమ్మ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థినులు గోకుడు పారల్తో రోడ్డు మట్టిని చెక్కి, బాటను విశాలపరచడం,

2) ఆ మట్టిని డిప్పలతో మోసి, కొన్ని గుంటలు పూడ్చడం,

3) నలుగురు కుర్రాళ్లు ట్రాక్టరులోనూ, ఏడెనిమిది మంది నేల మీదా నిలిచి ఒక ట్రక్కు నిండుగా వ్యర్థాలను నింపడం,

4) దారికి, పడమరగా- పంచాయతీ వారి అనుమతితో ఒకప్పటి మినీ ఉద్యానాన్ని ఆరేడుగురు స్వచ్చ కార్యకర్తలు పునరుద్ధరించడం,

5)HDFC బ్యాంకు ముందున్న పూల మొక్కల పాదులు సరిచేసి, ఆసరా కల్పించిన ఐదారుగురు పనిమంతులూ,

6) బ్రహ్మం గారి గుడీ, NTR పార్కు ముందూ, RTC బస్ ల నిలుపుదల దగ్గరా సమూలంగా వ్యర్థాల్ని తుడిచిపెట్టడమూ,

7) రెవిన్యూ కార్యాలయాల్లో కొంత భాగాల్ని పిచ్చి చెట్లు తొలగించి, ఊడ్చిన ఏడెనిమిది మందీ....

            ఈ పనులు కాక, ఈ కార్యకర్తలు కాక ఇక అభినందనీయులెవ్వరు?

            చలికాలం బద్ధకం వదిలించుకొని – తమ సొంత లాభం కాక ఊరి ప్రయోజనాన్ని లక్ష్యించి – దుమ్మూ, ధూళీ మురికీ మొరటు పనులకు పూనుకొన్న ఈ సన్నివేశం కాక సామాజిక పరమైన పండుగ వాతావరణమేది? స్వ ప్రయోజన ధోరణి రాజ్యమేలుతున్న సమాజం మూసపోకడకు ఎదురీదుతున్న చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమం కాక ఆదర్శమూ, తక్షణ అనుసరణీయమూ  ఏమున్నది?

            నా వరకూ మాత్రం – ఇందరు విద్యాధిక – స్త్రీ పురుష – పిన్న పెద్దల గ్రామ సామాజిక బాధ్యతలను చూసి సంతోషమూ- రెండు గంటల ఈ శ్రమదానమూ, సందడీ చూసి కూడ స్పందించని పరిసర గ్రామస్తుల వైఖరికి కొంత వెలితీ ! బెజవాడలో మెడికల్ కాన్ఫరెన్స్ వల్ల ముందే నిష్క్రమించకపొతే- మన ఊరి స్వచ్చ వైద్యుడింకెంత ఆనందించి ఉండునో!

            కాఫీ కాలం దాటాక – 1) ధ్యాన మండలి  ప్రతినిధి గోళ్ళ వేంకట రత్నం విస్పష్ట పరచిన గ్రామ స్వచ్చ-సుందరోద్యమ నినాదాలూ, శ్రీమాన్ నాయుడు మోహనుడి పరిచయ వాక్యాలూ,  ‘ ప్రతిభా తర్ఫీదు’ కేంద్ర నిర్వాహకుడు సురేష్ గారి, తమ తొలి గ్రామ బాధ్యతల స్వానుభవం వ్యక్తీకరించిన విద్యార్థిని ప్రతి స్పందనలూ,

            ధ్యాన మండలి పక్షాన పంపకమైన తిను బండరాలూ, శ్రీశైల భ్రమరాంబికా ప్రసాదం పంచిన కొర్రపాటి వీర సింహుల వారూ ఇలా-ముందే చెప్పినట్లు సందడే సందడి!

            సోమ- మంగళ వారాల రెస్క్యూ టీం సేవల సంగతి తెలియదు గాని- బుధవారం వేకువ మన కలయిక మాత్రం పెదకదళీపుర మార్గంలోని బండ్రేవు కోడు కాల్వ వంతెన దగ్గరే!

            కలిసి నడవక – కష్టపడకే

వ్యక్తి తనకై పాటుబడడం ఎక్కడైనా జరుగు విషయం

‘మనం మనకోసం’ శ్రమిస్తే మంగళ ప్రదమైన మార్గం

కలిసి నడవక – కష్టపడకే కలుగునా గ్రామం వికాసం?

స్వచ్చ సుందర కార్యకర్తకె సాధ్యమంతటి శ్రమ త్యాగం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   22.01.2023.