2659* వ రోజు.............

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2659* వ నాటి గ్రామ భద్రతా చర్యలు.

            సోమవారం (23-1-23) నాటి వేకువ 4.30 నుండే ఊరి సౌకర్య మెరుగుదల చర్యలు మొదలై - 6.30 దాక కొనసాగినవి. నేటి రెస్క్యూదళం ధ(క)ర్మక్షేత్రం 1 వ వార్డు  ప్రవేశం - బందరు రహదారి ప్రక్కన!

            ఆ కార్యకర్తలు ఐదారుగురు, వాళ్ల ఆయుధాలు పారలూ, పలుగూ, డిప్పలూ, ఇంకా తలా రెండు చేతులూ! వాళ్ల అసలుద్దేశం – ‘మనకోసం మనంట్రస్టు తీర్చిదిద్దిన పేవర్ టైల్స్ క్రుంగిపోతే ఆ గుంటను సరిజెయ్యడం! పాదచారులకూ, ద్విచక్ర వాహనదారులకూ మరింత సౌకర్యం కల్పించడం!

            పంచాయతీ వారో, ఇతర దాతలో ఈ పని వృత్తి నిపుణులతో - అంటే తాపీ వారితో చేయిస్తే - ఏ 10 వేలో ఖర్చు అయ్యేది! మరి రెస్క్యూటీం వాళ్లవేమో - తేరగా దొరికిన ఉచిత సేవలు! సోమ మంగళవారాలలో గానీ, ఇతర వేకువ కాలాల్లో గానీ స్వచ్ఛ - కార్యకర్తల ఇలాంటి వేలాది పనులకు ఖరీదు కట్టుకుంటూపోతే ఆ లెక్క ఎన్ని కోట్లలో ఉంటుందో!

            రెస్క్యూ కష్ట జీవులకు మరో ముగ్గురు పెద్ద కార్యకర్తల పరామర్శా, మాట సహకారమూ కాక - 1వ వార్డు వారనుకొంటా - ఇద్దరి పరిశీలనా కుదిరాయి! (షరా! పరిశీలన మాత్రమే ప్రవేశం కానే కాదు)

            చూసే వాళ్లకీ, ఈ కృషి ఫలితాలనుభవించే వారికీ ఇదేమంత కష్టంలేఅనిపిస్తుందేమో గాని ఒక్కో రంగురాతిని పగలకుండ పైకి తీయడమెంత కష్టమో నేను దగ్గరగా చూశాను!

            ఐనా - రాళ్లు పెకలించడం వరకే నేటికి పూర్తయింది! ఇసుక సర్ది సమతలం చేసి - మళ్లీ వాటిని పరవడం రేపటికి మిగిలే ఉంది!

            తమ పని ముగింపు వేళ బిగ్గరగా గొంతెత్తి తూములూరి లక్ష్మణరావు పలికిన స్వచ్ఛ - సౌందర్య సంపాదక నినాదాలతో కార్యకర్తల సోమవారం నాటి శ్రమదానం ముగిసింది!

            చల్లపల్లికి తీపిగురుతులు

వినుతికెక్కే గ్రామ సేవలు వీర విక్రమ త్యాగ దీప్తులు

మురుగు సిల్టుల వెలికి తీతలు - ముమ్మరంగా రోడ్ల ఊడ్పులు

పచ్చ పచ్చగ పెరుగు చుండే స్వచ్ఛ సుందర బాహ్యవనములు

అవి సదా మన స్వచ్ఛ బంధుర చల్లపల్లికి తీపిగురుతులు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   23.01.2023.