2660* వ రోజు................

పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

టైల్స్ సరిచేసిన నిన్నటి పనికి పొడిగింపుగా.....@2660*

            మంగళవారం(24-1-23) వేకువ సైతం ఐదారుగురు స్వఛ్ఛ - కార్యకర్తలది అదే కృషి, అదేచోట, అదే సమయానికి - 4.30 - 6.40 సమయాల నడుమ! చలి మాత్రం నిన్నటికంటే తీవ్రమయింది. ఏదో ఇద్దరు సీనియర్ మోస్ట్ కార్యకర్తలం మాత్రం వేకువ పాదచారణ సందర్భంగా చుట్టపు చూపుగా వాళ్ల కష్టానికి సాక్ష్యంగా కొంత సేపు నిలబడ్డాం!

            మా ఇద్దరికీ వాళ్ల యెడ అలాంటి సానుభూతి ఉండదు గాని, ఇతర సహృదయ పరిచయస్తులు ఈ రెస్క్యూదళ శరీర కష్టాన్ని చూస్తే అయ్యో! ఎందుకు వీళ్లకీ ఖర్మ! ఇంకా ఎన్నేళ్లకు స్వఛ్ఛ కార్యకర్తల గ్రామ స్వచ్ఛ శుభ్రతల బెంగతీరేది?...” అనుకొంటారేమో గాని - ఇంత మురికి పనులకు - ఇన్నేళ్లుగా అలవాటుపడిన అంకితులైపోయిన కార్యకర్తలు మాత్రం నిర్వికారంగా నిరంతరంగా తమ బాధ్యతను తాము చేసుకుపోతూనే ఉంటారు!

            ఈ వేకువ సైతం 2 గంటల పాటు శ్రమించినా - ఈ పంచ కార్యకర్తల లక్ష్యం నెరవేరలేదు! తమకు అలవాటు కాని తాపీ పనిని - ఒక్కో రంగు రాతిని జాగ్రత్తగా విరగకుండా తీసి, ఇసుకను సర్ది, సమతలంగా చేసి, రంగురాళ్ల దుమ్మును తుడిచి, వాటిని పేర్చడం వరకూ ముగిసిందిగానీ - ఇంకాస్త సుందరీకరణ పనేదో మిగిలినట్లుంది!

            ఈ ఊళ్లో - చేసే కార్యకర్తలుంటే ఇలాంటి పనులకు కొదవేముంటుంది? ఎప్పటికప్పుడు ఏ మురుగు కాల్వపనో - రహదార్ల హరిత సుందరీకరణ కృషో రోడ్ల గుంటలో వాళ్ల శ్రమదానానికి ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి!

            అలాంటి ఆహ్వానం రేపటి వేకువ కార్యకర్తలకు పెదకళ్లేపల్లి దారిలోని బండ్రేవుకోడు కాలువ వంతెన ప్రక్క నూనె మిల్లు దగ్గర!

            మాలెంపాటి అంజయ్య గారి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో నేటి ఈ కార్యకర్తల ప్రయత్నం వాయిదా పడింది.

            ప్రణామిస్తాం ప్రశంసిస్తాం!

సాహసిస్తే - దోహదిస్తే స్వచ్ఛ సుందర చల్లపల్లికి

అనుకరిస్తే - అనుసరిస్తే - అన్ని వార్డులు శుభ్ర ప్రగతికి

వినోదిస్తే - వికాసిస్తే వీధి స్వచ్ఛత, ప్రజా భద్రత

స్వచ్ఛ సుందర కార్యకర్తకు ప్రణామిస్తాం - ప్రశంసిస్తాం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

 

   24.01.2023.