2661* వ రోజు............ ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

స్వచ్చ సుందరోద్యమంలో బుధవారం నాటిది 2661* వ రోజు!

          ఏదో కామాలూ, సెమీ కోలన్లూ తప్ప - 9 ఏళ్లుగా ఆ ఉద్యమానికి ఫుల్ స్టాపులు లేవు! కొందరి వీధి దురన్యాయ చర్యలు గాని, ఎప్పటికప్పుడు స్వచ్ఛంద శ్రమదాతల ప్రతిచర్యలు గాని కనుచూపు మేరలో ఆగేట్లు కనిపించడమూ లేదు!

          25-1-23 వేకువ 4.15 కే తొలి ఉనికి చూపిన శ్రమదాతల సంఖ్య పెరిగి తుదకు 6.30 కు 33 కు చేరినా, నికరంగా 27 మంది వీధి శుభ్రతా ప్రయత్నం! ఇందులో ఐదుగురి కృషి 2 కి.మీ. దూరంలో - బందరు దారిలోని 1వ వార్డు దగ్గరే! అది నిన్న అసంపూర్ణంగా ముగిసిన భద్రతా చర్యకు ముగింపే! అందులో సర్పంచి సకుటుంబ శ్రమదానం కూడ కొంత ఉన్నట్లుంది?

          ఈ ఉషోదయ శ్రమదానం 22 మందిదీ పెదకళ్లేపల్లి దారి మొదట్లోనే ఉన్నది! నూనె మిల్లు దగ్గరా, వంతెన పైనా, గౌడ వీధి తొలి భాగంలోనూ, బస్ స్టాండు తూర్పు రోడ్డూ నేటి కార్యకర్తల శ్రమతో బాగైన ప్రాంతాలు! అక్కడ పడి ఉన్న దట్టమైన తుక్కులూ సీసాలూ నిన్నటి వాట్సప్ మాధ్యమ చిత్రంలో చూడవచ్చు.

          “ఇన్ని సంచుల కొద్దీ రకరకాల కశ్మీలాల్నీ ఊడ్చి తొలగించాలా, కొబ్బరి బొండాల - ప్లాస్టిక్ సంచుల పేడ - పెంటల - దుమ్మూ - ధూళీ ఇసుకా మిశ్రాన్నే ప్రోగులు చేసి ఎత్తాలా? వంతెన కిరు ప్రక్కలా మురుగు కాల్వలోకి జారుతున్న తుక్కుల్నే లాగాలా, పిచ్చి ముళ్ళ కంపల్నే నరికి, దంతెల్తో లాగి, డిప్పల్తో ట్రాక్టర్లోకెక్కించాలా, చీపుళ్లతో కళ్లేపల్లి రోడ్డు దుమ్మునే వదిలించాలా....అనే తర్కంలోకి దిగక - ఎప్పటిలాగే స్వచ్ఛ కార్యకర్తలు ఒక్కో పనిని కాస్త నెమ్మదిగానే చక్కబెట్టారు!

          బండ్రేవు కోడు దక్షిణ గట్టు వరకు మాత్రం ఈ ఉదయం శుభ్రపడింది. బస్టాండు ప్రహరీ వెలుపలి మురుగు కాల్వలో జానెడు మందాన పేరుకొన్న తుక్కులన్నీ భరింపరాని దుర్గంధం వెదజల్లుతూ ఇంకా అలాగే మిగిలిపోయాయి! చేస్తే ఇంకా రెండు రోజుల పని కాలువ ఉత్తరపు గట్టు దగ్గరే ఉన్నది.

          ధ్యాన మండలి వారు కాక స్ధానికులెవరైనా కలిసొస్తే తప్ప - అక్కడి మిల్లులు, ఖాళీ స్తలాల అపరిశుభ్రత తొలగాలంటే కష్టమే! ఇంత చలిలో, మంచులో ఈ వేకువ శ్రమదానానికి పరిసర గృహస్తులూ రాకపోవచ్చు!

          మరి - ఇన్ని సమస్యల్ని పరిష్కరించవలసిందీ, వచ్చే శివరాత్రి నాటికి ఈ 2 - 3 కిలోమీటర్ల తీర్ధయాత్రల బాట స్వచ్ఛ - పరిశుభ్రతలకు హామీ ఇవ్వాల్సిందీ స్వచ్ఛ కార్యకర్తలే గదా! వాళ్లు కోరి తెచ్చుకొన్న ప్రారబ్దం ఇదే కదా!

కొంచెం చలి తగ్గిన 6.30 వేళ – ‘చంద్ర ఆస్పత్రిదగ్గర జరిగిన సమీక్షా సమావేశంలో

1) హైదరాబాద్ లో 27 న జరిగే రాంబాబు గారి పుత్త్రుని పెండ్లికీ, నడకుదురు రోడ్డులో 28 న జరిగే పరిచయ వేడుకకూ అడపా వారి ఆహ్వానం,

2) విజయవాడలో ఫిబ్రవరి 1 న తన మనుమరాలి వైవాహిక వేడుకకు ఘంటా లీలా కృష్ణుని ఆత్మీయ పిలుపూ ముఖ్య విశేషాలు!

          గురవయ్య గురువుల వారు ముమ్మార్లు గ్రామ శౌచ - సంస్కార సదుద్దేశ నినాదాలు పలికి, నేటి శ్రమదానాన్ని ముగించారు.

          రేపటి వేకువ శ్రమదానం కూడ పెదకళ్లేపల్లి బాట వంతెన కేంద్రం గానే జరుగనున్నది!

కార్యకర్తకు శ్రమ వినోదం గ్రామజనులకు మనోల్లాసం

సుందరీకరణ ప్రయత్నం పర్యటనలకు పడిన బీజం

వీధి వీధికి వన్నె తెచ్చిన నవ వసంతాల ప్రయాణం

ఎవరు కర్తలు ఎవరు భోక్తలు? ఎవరి త్యాగం ఎవరి భోగం?

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

25.01.2023.