2662* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2662* వ నాటి శ్రమదాన సంగతులు!

            గురువారం (26-1-23) వేకువ సైతం మళ్లీ అదే సమయం - అదే స్థలం - 4.19 AM, పెదకళ్ళేపల్లి రోడ్డులోని అట్టల మిల్లు ముందర! అంతకు ముందే 10 - 12 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సన్నద్ధత! రామపాదం కోసం ఎదురు చూసిన అహల్యలాగా - కశ్మల భూయిష్టమైన రహదారి స్వచ్ఛంద శ్రమదాతల కర పాద స్పర్శలకై ఆతృత!

            అప్పటి నుండి సుమారు 2 గంటల పాటు - పాతిక ముప్పై మంది చేసిన కష్టంతో 150 గజాల ఆ బాటకొక ఊరట! కొన్నాళ్ల క్రితం గుంటలు పూడి పైకేదో బాగున్నట్లుందేగాని - విచ్చలవిడిగా రాతిముక్కలు, ఒక్క వాడకానికే పరిమితమైన రకరకాల ప్లాస్టిక్ వస్తువులు, దుమ్ము - ధూళీ - ఇసుక, డ్రైనులో పేరుకుపోయిన వినాశకరమైన వ్యర్ధాలు.... ఇవన్నీ పరిశుభ్ర స్వచ్ఛ సుందర - ఆరోగ్య చల్లపల్లిలో కనపడరాని దృశ్యాలే!

            అందరిలాగా వెచ్చగా - హాయిగా ఇళ్లలో సుఖశయనం సుఖ నిద్రలు చెందక మరి - ఎందుకిందరు మర్యాదస్తులైన - గౌరవనీయులైన వ్యక్తులు కాళ రాత్రి వేళ చీపుర్లేసుకొని, మురుగు వాసన భరించి, ఇన్నేళ్లుగా శ్రమిస్తున్నట్లు? ఏం సాధించినట్లు?” అని అడిగితే

            ఔను వాళ్ళు కోరి కోరి సొంత బాధ్యతలతో బాటు గ్రామ సామాజిక బాధ్యతల్ని కూడ సంతోషంగా నెరవేరుస్తున్న ధన్యులు, ఎవరైనా ఆదర్శంగా తీసుకోదగ్గ మనుషులుఅనే చెప్పాలి!

            దేశాభిమానం నాకు కలదని వట్టి గొప్పలు చెప్పకోకోయ్

            పూని ఏదైననూ ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్

అని ఏనాడో గురజాడ వ్రాసిన ప్రబోధ కవితకు వీళ్లు ప్రతీకలు!

యధాప్రకారం ఈ వేకువ కూడ

- రోడ్లు ఊడ్చి, కల్యాణ మండపం వీధి దాక శుభ్ర పరచడం,

- మాంస దుకాణం దాక బాట మంచి చెడ్డల్ని చూసుకోవడం,

- దివంగత రామలింగయ్యగారి దనుకొంటా - ఒక పెద్ద ఖాళీ స్థలంలో పిచ్చి - దుష్ట మొక్కల్ని తొలగించడం,

- ప్రోగుబడ్డ వ్యర్ధాలన్నిటినీ డిప్పలతో ఎత్తి, ట్రాక్టర్లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడం,

- ఇవన్నీ ఎవరి ఆజ్ఞతోనో - మెప్పుకోసమో కాక, తమ మనః తృప్తికై చేయడం..... అన్నీ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి!

            కాకుంటే : వంతెన గోడను పగలగొట్ట జూస్తున్న ఒక రావి చెట్టును ఒక ట్రస్టు ఉద్యోగినడుముకు త్రాడుతో వ్రేలాడుతూ ఖండ ఖండాలుగా నరుకుతున్న శ్రమ విన్యాసాల వంటివి నేటి ప్రత్యేకం!

            ఈ పూట అట్టల పెట్టెల మిల్లు ఎదురుగా జరిగిన ముగింపు సభలో యోగా మాస్టారు వేంకటేశ్వరరావు గారు స్వచ్చోద్యమం కోసం 2 పారలను బహూకరించి, ముమ్మారు వినిపించిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సారంశ నినాదాలూ, కార్యకర్తల కష్టతర శ్రమ తీరును ప్రశంసించిన డాక్టరు DRK గారి ముగింపు వాక్యాలూ,

            రేపటి వేకువ మన బాధ్యతా నిర్వహణం సైతం తిరునాళ్లు దగ్గరపడుతున్న ఈ పెదకళ్లేపల్లి మార్గంలోనే!

            కంజలిస్తాం అనుకరిస్తాం

జనం మెచ్చిన శ్రమం ఎవరిదో - వనం పెంచిన ఘనతలెవరివొ -

హరిత సంపద పూల సొబగులు ఆక్రమించిన వీధులెచటివొ

ఎవరి శ్వాసలు ఎవరి ధ్యాసలు ఊరి ప్రగతికి రామరక్షలొ

అట్టి సుజనుల కార్యకర్తల కంజలిస్తాం అనుకరిస్తాం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   26.01.2023.