2663* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

                             తీరు మారని ఊరూ- కాలుష్యం పై పోరూ - @2663*

          ఆ పోరాటం శుక్రవారం (27.01.2023) నాటిది, కనీసం 20 మందితో పెదకళ్ళేపల్లి వీధిలో పెళ్లి మండపం దారి మొదలు వివేకానంద కళాశాల దాక సాగినది! శ్రమదానం చేసిన వారికి సంతృప్తినీ, ఉదయం 6.30 తరువాత ఆ వీధి చారులకూ ఉల్లాసాన్నీ మిగిల్చజాలినదీ!

          30 మందికి పైగా కార్యకర్తల ప్రయత్నంలో ముందుకు సాగవలసిన నేటి వీధి పారిశుద్ధ్యం 100 గజాలకే పరితమైన కారణం ఈ ప్రొద్దూ, రేపూ ముమ్మరంగా జరుగుతున్న శుభ కార్యాలూ – స్వచ్చ కార్యకర్తలు కొందరు తప్పక హాజరు కావలసినవే! అందులోనూ – స్వచ్చ కార్యకర్త – అడపా వారి ఇంట పెళ్లికీ!

          ఈ వేకువ జరిగింది 100 గజాల వీధి సుందరీకరణమే గాని- పనులకేం లోటు? రోడ్డు కిరు ప్రక్కలా ఎండిన మురుగు దిబ్బలు లేవా, కొంచెం ఘాటు వాసన కొట్టే డ్రైన్లు లేవా? వాటి లోపల దిక్కు మాలిన వ్యర్దాలూ, గట్ల మీద చిందర వందరగా పెరిగిన కలుపు, పిచ్చి మొక్కలూ కావలసినన్ని!

          స్వచ్చ సుందరీకరణ ముఠా సభ్యులందరికీ చట్టుగా మారిన మురుగు మట్టిని పెళ్ళగించి, సమతలం చేయడంతోనే సరి పోయింది! ఏడెనిమిది మందికి కొరగాని ముళ్ళ-పిచ్చి చెట్లనూ, తీగల్నీ నరికి – పీకి ప్రోగులు పెట్టడమే సరిపోయె! మిగిలిన వాళ్లలో ఇద్దరికీ దంతెలతో లాగే పనీ, చీపుళ్లతో దుమ్మూ-కాగితాలూ ఊడ్చేపనీ పడింది!

          ఇలా – స్వచ్చ సుందరోద్యమంలో పనులు చాలవరకు ప్రాతవే; కార్యకర్తలూ ఇంచుమించు ప్రతి వేకువా వచ్చే వారే! పని చోటు మారడమూ, ప్రాత పనైనా పునర్నవంగా – ఉత్సాహంగా నిర్వహించడమూ, ప్రత్యేకతలు!

          ఈ విధంగా – మూడవ నాడు కూడ పెదకళ్ళేపల్లి రహదారి ముస్తాబు పనులు విజయవంతంగా ముగియగా – ఆలస్యంగా బస్సు దిగి వచ్చిన యార్లగడ్డ నాగయ్య, తాతినేని రమణ గార్లు సైతం పాల్గొన్నారు!

          6.25 వేళ – తమ తాత్త్విక సమాలోచనా సమావేశంలో మొక్కల రమణుడు గ్రామ స్వచ్చ –సుందర ప్రగతీ నినాదాలు వినిపించి, కార్యకర్తలకు పునరుత్సాహం కలిగించగా –

DRK గారి సమీక్షా వచనాలతో నేటి శ్రమదానం ముగిసింది!

రేపటి గ్రామ- వీధి బాధ్యతలకై మనం కలుసుకోనదగిన ప్రాంతం కూడ నేటి పని ముగింపు వద్దనే!

  అసంకల్పితంగానో – సుసంకల్పితం గానో

అందరిలో కాకున్నా కొందరిలో స్ఫూర్తి నింపి

అసంకల్పితంగానో – సుసంకల్పితం గానో

తమ స్వస్తత, ఊరుమ్మడి జన శ్రేయం సాధించిన

స్వచ్చ – సుందరోద్యమ ప్రవర్తకులకు నమస్కృతులు!  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   27.01.2023.