2664* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

                             2664*వ వేకువ సామాజిక బాధ్యతల్లో – 26మంది!

          అది ఈ శనివారం – 28.1.23 వేకువ – 4.09 -6.07 సమయంలో – చలి గజ గజ వణికిస్తున్న పరిస్థితిలో! తొలుత 11 మంది సంఖ్య, కొద్ది నిముషాల్లో 26 కు చేరింది. పెదకళ్ళేపల్లి బాటలోని విజయ జూనియర్ &, విజయ క్రాంతి జూనియర్ ప్రైవేటు కళాశాలల నడుమ సుమారు 100 గజాలు నేడు బాగుపడిన చోటు!

          “ ఈ మాత్రం వీధి పారిశుద్ధ్యానికి – దేశంలో ఎక్కడా లేనట్లు పాతిక మంది పూనుకోవడం, అదీ ఎక్కువ మంది ముసుగుతన్ని పడుకొనే చలి వేకువలో – ఇంతగా వర్ణించదగిందా? సదరు శ్రమదానం ఫోటోలూ – వీడియోలూ సామాజిక మాధ్యమానికెక్కించి, దాన్ని ఎక్కడెక్కడి సామాజిక కార్యకర్తలో ప్రశంసించి, రచ్చ చేయవలసినంతటి ఘన కార్యమా ...” అని ప్రశ్నించే జిజ్ఞాసువులొకప్పుడుండేవారు!

          తొమ్మిదేళ్ళ స్వచ్చ సుందరోద్యమం పిదప – ఇదేదో ఆషామాషీ శ్రమదానం కాదనీ, ఊరి ప్రజల చైతన్యం వికసించి – గ్రామ వ్యాప్త కాలుష్యం అంతు చూసేదాకా ఆగనంత మొండిదనీ, ఆ కార్యకర్తలు కేవలం ఉబుసుపోకకో – గుర్తింపుకో – ప్రభుత్వం నుండీ ప్రజల్నుండీ మెప్పుకో కంటి తుడుపుగా పనిచేసే వ్యక్తులు కారనీ, అసలది సేవకాదు- సొంత ఊరి పట్ల బాధ్యత గానే చేస్తారనీ నమ్మే వాళ్లే ఇప్పుడు అత్యధికులు!

          ఈ పూట – తలా వంద నిముషాల శ్రమదానంతో ఏం సాధించారో అని గమనిస్తే:

  1) అన్ని చోట్లా లెక్కకుమించి శుభ కార్యాల వేళ ఇందరు కార్యకర్తలు ఉమ్మడి బాధ్యతలకు పూనుకోవడమే ఒక విశేషం!

2) ఈ కాస్త వీధిలోనే బడ్డీ కొట్ల, గ్యాస్ గోడౌన్ల, కోళ్ళ మేత కర్మాగారాల, భవన నిర్మాణ ప్రదేశాల దగ్గర పేరుకుపోయిన కశ్మలాలు ఎన్నో – మన వాట్సాప్ మాధ్యమంలో ఒక మారు చిత్తగించండి.

3) పొడి మురుగు కాల్వలో ఎంత చెత్త – ప్లాస్టిక్ సంచులు – కప్పులు గ్లాసులు – ఎంగిలాకులు –గోనె సంచులు – పెరిగిన పిచ్చి కంపలు – ఎండు కొమ్మలు – ఆకులలములు..... ఆహా! ఆ వైభవం మాటల్తో చెప్పేదా?

4) కార్యకర్తలెంత శ్రమిస్తే ఈ చెత్త సంపదంతా ప్రోగులుగా మారి, డిప్పల్లోకీ తదుపరి ట్రాక్టర్ లోకీ – చివరకు చెత్త కేంద్రానికీ చేరింది?

          సుమారు 50 పని గంటలు ముగిసి, కార్యకర్తలెవరి స్తోమతను బట్టి వాళ్లు చెమటలు దిగగార్చి, 100 గజాల వీధిని కశ్మల రహితంగా మార్చి, ఓదార్చిన తరువాత ఇప్పుడెంత శోభస్కరంగా కనిపిస్తున్నదో గమనించాలి.

          కార్యకర్తలెవరి పనుల్లో వాళ్లు మునిగిన వేళ- కళ్ళేపల్లి వీధిని ముస్తాబు చేస్తున్న సందడిలో – అక్కడి గృహిణి ఒకామె తన ఇంటి వ్యర్థాలను రెండు కవర్లలో తెచ్చి, చెత్త ట్రాక్టర్ లో కాక- సామాన్ల బండిలో వేసి వెళ్ళడమూ, రోడ్డు మీద వేయక ఏదో ఒక బండి లో వేసినందుకు కొంతనయమనుకోవడమూ – ఇదీ నేటి శ్రమదాన వేళా విశేషం!

          6.35 కాలంలో ఒక మాజీ ఉపాధ్యాయిని – కోట పద్మావతి – చొరవగా మైకందుకొని మన గ్రామ స్వచ్చ – సుందరోద్యమ నినాదాల్ని ముమ్మారు దంచి కొట్టడంతో నేటి కార్యక్రమం ముగింపు కొచ్చింది!

          రేపటి ఉదయం మనం కలుసుకొని కృషి చేయదగిన చోటు – విజయ క్రాంతి జూనియర్ కళాశాల ఎదుటే!

           ఏ తీరం చేరుటకో!

ముచ్చెమటలె పట్టినవో – ముసురులె ముంచెత్తినవో

మురుగు కంపులెన్ని పెరిగి ముక్కుపుటాలదిరినవో

స్వగ్రామం మెరుగుదలే పరమావధిగా జరిగిన

తొమ్మిదేళ్ల ప్రస్థానం ఏ తీరం చేరుటకో !          

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   28.01.2023.