2666* వ రోజు...... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం.

సోమవారం (30-1-23) నాటి పరిమిత సామూహిక శ్రమ - @2666*

            ఇతర రోజుల్లో విస్తృత సామూహిక శ్రమదానమైతే - నాలుగేళ్ళకు పైగా సోమ మంగళ వారాల్లో ఆరేడుగురు కార్యకర్తల దొక ప్రత్యేక కృషి! దానికెవరో ‘రెస్క్యూ శ్రమదానం’ అనీ, వాళ్లకు ‘రెస్క్యూ టీమ్’ అనీ మారు పేర్లు పెట్టారనుకోండి!

            “నేములో నేముంది?” “పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది? (“what is in a name?) అని ఎవరో చమత్కరించినట్లు - ఏ పేరైతే నేం? స్వచ్ఛ కార్యకర్తలు 9 ఏళ్లుగా చల్లపల్లి గ్రామం కోసం చేస్తున్నది 24 గంటల్లో ఒక గంట శ్రమదానం!

            ఈ మాత్రం దానికి ఒక కవి ‘ఇదేదో యజ్ఞమనీ, ఈ కార్యకర్తలు దీక్షగా చెక్కుతున్నది గ్రామ వీధుల అందాల శిల్పమనీ’ ఏకంగా ఒక పాటే వ్రాశాడు : 

            “శ్రమదానం ఒక యజ్ఞం - సహనం మీ ఆయుధం......

            మొండి శిలలను చెక్కి - జీవకళ సృష్టించే

            శిల్పి పనితనమే మీ వేకువ శ్రమదానంలో....”

            అని అతడు వ్రాసిన పాటలోని చరణాలు ఈ వేకువ 4.30 నుండి నలుగురైదుగురు 6.20 దాక చేసిన పనుల్లో గుర్తుకొచ్చాయి!

ఒక సినిమా కవి (ఆత్రేయ) వేరే సందర్భంలో

            “సముద్రంలో ఉప్పునూ – చెట్టు మీద ఉసిరినీ

            కలిపి వేశావయ్యా!...” అని దేవుణ్ణి మెచ్చుకొన్నట్లు –

            ఈ కార్యకర్తలు ఎక్కడో పెదకళ్లేపల్లి రోడ్డులో పడి ఉన్న పెద్ద చెట్టు బోదెనూ - బెజవాడ దారిలోని మరొక దుంగనూ తెచ్చి - గంగులవారిపాలెం దారి - ఆస్పతి దగ్గర ప్రజలు కూర్చొనేందుకు బెంచీగా మలచడాన్ని గంటకు పైగా గమనించాను!

            ఈ ప్రయత్నంలో ఒక కార్యకర్త/ ట్రస్టు ఉద్యోగి కాలు పట్టు తప్పి వెల్లకిలా పడడమూ - నేలకు తగిలిన బంతిలా వెంటనే లేచి పని కొనసాగించడమూ జరిగిపోయినవి. అందుకే మరి - చల్లపల్లి కార్యకర్తలకు “స్వచ్ఛ సైన్యం” అని పేరు సార్థకమయింది!

            గౌరిశెట్టి నరసింహారావు గారు మూడు మార్లు స్పష్ట పరచిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో నేటి పని రేపటికి వాయిదా పడింది!

 

దేవరకోట వాస్తవ్యులు దోనేపూడి గోపాలకృష్ణయ్య మాస్టారి కుమారుడు, అమెరికాలో సర్జెన్ గా పనిచేస్తున డా. దోనేపూడి శరత్ గారు ఈ సంవత్సరానికి 50,000/- రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

          అసలీ స్వచ్చోద్యమమొక...

ఆశాజనకంగానా – అనుమానా స్పదముగనా?

చారిత్రక ఘట్టముగా? సారహీన చేష్టముగా?

సమగ్ర హేతుబద్ధమా? శుష్క వ్యర్థ సాహసమా?

సదవగాహనా పూర్వక జనహిత సంక్షేమమా?

 - ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   30.01.2023.