పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
ఈ గ్రామ స్వఛ్ఛ - సుందరీకరణ నివేదిక (2675* వ నాటిది!)
బుధవారం (8-2-23) వేకువ 4.17 కే – కళ్లేపల్లి దారిలో – సాగర్ ఆక్వా పారిశ్రామిక ప్రదేశంలో - వానలా కురుస్తున్న మంచులో - తొలుత 10 మందితోనూ, క్రమంగా మరో 14 మందితోనూ జరిగిన వీధి పారిశుద్ధ్య బాధ్యత గురించిన ఒక వివరణ ఇది!
“ఇంత చలి వేకువ - ఏ 3.30 కో లేచి, వాహన దీపాల వెలుగులోనూ కనిపించని 2 – 3 కిలోమీటర్లను గడిచి, 24 వేల మంది పట్టించుకోని ఈ రహదార్ల భద్రతనీ, శుభ్ర సౌందర్యాలనీ - ఈ 24 మందే ‘తగుదునమ్మా’ అని - నడుములు వంచి, చెత్త – దుమ్ము - దుర్వాసనల పనికెందుకు పూనుకోవాలి? ఇదేదో కాస్త ఓవరాక్షన్ లాగ ఉందే...” అనుకొనే చల్లపల్లి గ్రామస్తులు కొంద రిదివరకుండే వారు గాని – ఇప్పుడంత తెలివి తేటలు తగ్గిపోయినవి!
2675* పని దినాల తర్వాత – చాల మంది గ్రామ పౌరుల్నుండి సానుభూతి వర్షిస్తున్నది గాని, అడపాదడపా చందాలందుతున్నవి గాని, ఆచరణాత్మక క్రియాశూన్యత ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు!
ఈ శ్రమదానమేమో కేవలం స్వచ్ఛందం! సానుభూతిపరుల, అభిమానుల ఇళ్లకు పోయి – “దయచేసి ఈ ఊరంతటి మంచి కోరి చేసే శ్రమదానానికి వారానికొక రోజో - రోజుకొక్క గంటో వచ్చి సహకరించండి” అని అభ్యర్థించగలమే గాని, “ఏం - నెప్పా? వారానికొక్క గంట చొప్పున వస్తావా - చస్తావా...” అని కఠినంగా అడగలేం కదా!
ఇంతటి అననుకూల వాతావరణంలో రెండు గంటలు శ్రమించి, 150 గజాల రహదారిలో ఊడ్చి, గడ్డీ, పిచ్చి – ముళ్ల మొక్కల్ని తొలగించి, రోడ్ల గుంటల్ని సరిచేసి, ప్లాస్టిక్ గ్లాసుల - సీసాల - కప్పుల దరిద్రాన్ని దుంప తెంచి, చలిలో - మంచులో సైతం సీసాల కొద్దీ మంచి నీళ్లు సేవించి, కార్యకర్తల సామాజిక బాధ్యతో – ఆత్మ సంతృప్తో - దాన్నెందరు అర్థం చేసుకొంటున్నారు?
ఒక్కసారి ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ మాధ్యమ చిత్రాన్ని పరిశీలించండి - 6.35 కు - మంచునూ చీకటినీ సూర్యుడు ఓడించే వేళకు కార్యకర్తల 2 గంటల శ్రమ తర్వాత డ్రైను, బైపాస్ రహదారి ఎగుడు దిగుళ్లూ, సారా కొట్టు ప్రక్కన దట్టమైన కశ్మలాలూ తొలగిపోయి - అక్కడ అంగళ్ల వారికీ ప్రయాణికులకూ ఆహ్లాదకరంగా లేదూ? ప్రతి ఉదయమూ ఆ కాస్త సంతృప్తి చాలు - ఈ స్వచ్చ కార్యకర్తలకు!
6.40 సమయానికి వాలంటీర్ల వదనాల్లో – అలసట కన్నా ఈ ఊరికేదో సాయపడిన సంతోషమూ, మంచునూ - చెడువాసననూ – ధూళినీ పీల్చిన దుస్ధితి కన్నా కాస్తైనా వాతావరణ కాలుష్యం తగ్గించాం గదా అనే సానుకూల దృక్పథమూ కనిపిస్తాయి చూడండి! నేటి శ్రమదానాన్ని సమీక్షించిన దాసరి వైద్యుల వారి మాటల్లోనూ అవే ప్రతిఫలిస్తాయి! (మరి - రెండు ముసలి ఘటాలు చిన్నపిల్లలుగా మారి, ఆడుకొన్న దృశ్యాన్ని గమనించారా?) ప్రయాణికులు ఉలిక్కిపడేలా – ముమ్మారు నేటి స్వచ్ఛోద్యమ నినాదాలను ఆలపించింది కోడూరు వేంకటేశ్వరావు గారు!
పాతికేళ్ల నాటి ‘జనవిజ్ఞాన వేదిక’ ముమ్మర కార్యక్రమాలూ, అందులో పాల్గొనేందుకు తనకు దొరికిన ప్రేరణనూ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ఒక గేయ రూపంలో వ్రాస్తే – నందేటి శ్రీనివాసుడది పాడితే - కార్యకర్తలు స్పందించిన వీడియోను గమనించారా? (ఈ వ్యాసం చివర్లో చదివి చూడండి!)
నేటి మరో విశేషం - శాస్త్రి మహాశయుని నెలవారీ చందా అక్షరాలా 5,000/- ఈ సందడిలోనే స్వీకరించడమైనది.
రేపటి వేకువ బాధ్యతల కోసం మనం మరొక మారు కలువదగిన ప్రాంతం “సాగర్ ఆక్వా ఆహారోత్పత్తి కర్మశాల” ఎదుటనే!
నాటి - నేటి ప్రేరణలు.
బ్రహ్మారెడ్డీ లక్ష్మణ్ రెడ్డీ
పురుషోత్తం అట్లూరు
జె. యస్, జి.వి.కె.లు
కూరపాటీ – గుళ్ళపల్లీ
అలనాటి మా ఇన్స్పిరేషన్!
శివన్ నారాయణ్ - వీర్ ఆంజనేయులూ
రామ్ రావు నల్లూరీ - కోటేశ్వర్ వాసిరెడ్డి
యోగాలూ - నాగాలూ, రాజాలూ - రమణాలూ
ఇటీవల మా ఇన్స్పిరేషన్!
వి రామ్ చందర్ – నిరంజన్ లూ
మదర్ లక్ష్మీ ప్రసంగాలూ
ఇరువదేళ్లుగ అనుభవాలూ - అరువదేళ్ల ఆగతాలూ
మరెప్పటికీ మాకు చోదకాలు!
రెండో శనివారం క్యాంపులూ
మధ్యలో పబ్లిక్ మీటింగులూ,
కరపత్ర ప్రచురణలూ - కమిటీ మీటింగులూ
మాకు హుషారిస్తుంటాయ్ - నిషా చేస్తుంటాయ్!
పద్మ, రాణీ ప్రవచనాలూ
కామ్ ఈశ్వరి సంయమనలూ
అహం ఎరగని - ఇహం మరవని
ఆప్త మిత్రుల అండదండతొ
నడచు జన విజ్ఞాన వేదిక
నాకు తరగని ఇన్స్పిరేషన్!
- డాక్టర్ DRK ప్రసాద్.
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
08.02.2023.